ఒకరు ముఖ్యమంత్రి.. మరొకరు టాప్ హీరో! ఈ పాత ఫొటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టారా?
Childhood Photo: ఒక పాత ఫొటో ఇప్పుడు మళ్లీ నెట్టింట వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో ఉన్న స్టార్స్ ఎవరు, అందులో ఓ ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు. కాలేజీ రోజుల నుంచి వాళ్ల స్నేహం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకుందాం.

ఈ పాత ఫొటోలో ఉన్న ఇద్దరు కుర్రాళ్లు ఎవరో గుర్తుపట్టారా?
సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కొన్ని పాత ఫొటోలు బయటకు వచ్చి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇప్పుడు అలాంటి ఒక ఫొటోనే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక సీనియర్ నటుడి పక్కన కూర్చున్న ఈ ఇద్దరు కుర్రాళ్లు, ఇప్పుడు సౌత్ ఇండియాలో టాప్ సెలబ్రిటీలుగా ఎదిగారు. ఈ ఫొటోలో ఉన్న పెద్దాయన ప్రముఖ నటుడు శివకుమార్. ఆయన పక్కన ఉన్న ఆ ఇద్దరు అబ్బాయిలు ఎవరో కాదు.. స్టార్ హీరో సూర్య, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్. ఈ ఫొటోతో వాళ్ల పాత స్నేహం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
లయోలా కాలేజీలో చిగురించిన స్నేహం
సూర్య, విజయ్ ఇద్దరూ చెన్నైలోని లయోలా కాలేజీలోనే చదువుకున్నారు. సూర్య కంటే విజయ్ ఒక సంవత్సరం సీనియర్ అని గతంలో వచ్చిన వార్తల్లో పేర్కొన్నారు. వీళ్లిద్దరి మధ్య కాలేజీ రోజుల నుంచే మంచి స్నేహం ఉండేది. ఒక ఇంటర్వ్యూలో సూర్య చెబుతూ, ఇప్పటికీ వీళ్లిద్దరూ కాలేజీ అల్యూమినీ వాట్సాప్ గ్రూప్‌లో ఉన్నామని చెప్పారు. విజయ్ సినిమాలు చూసి నచ్చినప్పుడు, ఆయనకు మెసేజ్ చేసి అభినందిస్తానని కూడా సూర్య వెల్లడించారు. ఇద్దరూ తమ కెరీర్లో వేర్వేరు దారుల్లో వెళ్లినా, ఆ స్నేహం ఇంకా అలాగే ఉండటం అభిమానులను ఆకట్టుకుంటోంది.
సినిమాలో కలిసిన ఇద్దరు స్టార్లు
1997లో వసంత్ దర్శకత్వంలో, మణిరత్నం నిర్మాణంలో వచ్చిన 'నేరుక్కు నేర్' సినిమా వీళ్లిద్దరినీ ఒకే స్క్రీన్‌పైకి తెచ్చింది. విజయ్, సూర్య, సిమ్రాన్, కౌసల్య ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. సూర్యకు హీరోగా ఇదే తొలి సినిమా కావడం విశేషం. కుటుంబ సమస్యల వల్ల వచ్చే గొడవలు, ఒక చిన్నారిని కాపాడేందుకు ఇద్దరూ కలిసి పోరాడటం ఈ సినిమా ప్రధాన కథాంశం. సూర్య సినీ ప్రయాణానికి పునాది వేసిన ఈ సినిమా, వీరిద్దరూ కలిసి నటించిన తొలి చిత్రంగా నిలిచిపోయింది.
'ఫ్రెండ్స్' సినిమాతో మళ్లీ జతకట్టిన ఫ్రెండ్స్
2001 సంక్రాంతి కానుకగా వచ్చిన 'ఫ్రెండ్స్' సినిమాలో విజయ్, సూర్య మరోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సిద్ధిక్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రమేష్ కన్నా, దేవయాని, విజయలక్ష్మి, వడివేలు ఇతర పాత్రల్లో నటించారు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమా స్నేహం, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సూపర్ హిట్ అయింది. ముఖ్యంగా వడివేలు చేసిన నేసమణి క్యారెక్టర్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్. 'నేరుక్కు నేర్' తర్వాత ఈ ఇద్దరినీ మళ్లీ ఒకే సినిమాలో చూసి ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.
ఇప్పుడు ఎవరి దారి వారిదే
కాలక్రమంలో ఇద్దరి ప్రయాణం వేర్వేరు దారుల్లో సాగింది. సూర్య సినిమాల్లో తన సత్తా చాటుకుంటూనే ఉన్నాడు. విజయ్ మాత్రం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి, 2026 మే 10న తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒకప్పుడు కలిసి నటించిన ఇద్దరు స్నేహితుల్లో ఒకరు ఇప్పుడు రాష్ట్రాన్ని పాలిస్తుంటే, మరొకరు సినీ రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఈ పాత ఫొటో వాళ్ల పాత రోజులను మళ్లీ గుర్తుచేస్తోంది. భవిష్యత్తులో వీళ్లిద్దరూ మళ్లీ కలిసి నటిస్తారా అనేది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.















