Bhagavanth Kesari Review: బాలకృష్ణ `భగవంత్ కేసరి` మూవీ రివ్యూ, రేటింగ్..
నందమూరి నటసింహాం బాలకృష్ణ ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి `వీరసింహారెడ్డి`తో బ్లాక్ బస్టర్ హిట్‌ని అందుకున్నారు. ఇప్పుడు `భగవంత్ కేసరి`తో మరో హిట్‌కి సిద్ధమవుతున్నారు. నేడు గురువారం(అక్టోబర్ 19)న ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంతో బాలయ్య హ్యాట్రిక్ కొట్టాడా? లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
Bhagavanth Kesari Review
నందమూరి నటసింహాం బాలకృష్ణ ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి `వీరసింహారెడ్డి`తో బ్లాక్ బస్టర్ హిట్‌ని అందుకున్నారు. ఇప్పుడు `భగవంత్ కేసరి`తో మరో హిట్‌కి సిద్ధమవుతున్నారు. ఎంటర్‌టైనింగ్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందించిన చిత్రమిది. షైన్ స్క్రీన్ పతాకంపై ఈ చిత్రాన్ని సాహుగారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. కాజల్ ఈ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తుంది. తొలిసారి బాలయ్యతో కలిసి నటించింది. యంగ్ సెన్సేషన్ శ్రీలీల కీలక పాత్ర పోషించింది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ నెగటివ్ రోల్ చేసిన చిత్రమిది. దసరా పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని నేడు గురువారం(అక్టోబర్ 19)న ఈ చిత్రం విడుదలైంది. మరి సినిమా (Bhagavanth Kesari Review) ఎలా ఉంది? `అఖండ`, `వీరసింహారెడ్డి` ల తర్వాత ఈ చిత్రంతో బాలయ్య హ్యాట్రిక్ కొట్టాడా? లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
Bhagavanth Kesari Review-Premier Talk
కథః
నేలకొండ భగవంత్ కేసరి(బాలకృష్ణ) జైల్లో నేరస్థుడిగా ఉంటాడు. అదే జైల్లో ఉన్న లీడర్ శుక్లాని రౌడీల నుంచి కాపాడతాడు. ఆ సమయంలోనే జైలర్(శరత్ కుమార్) కొత్తగా విధుల్లోకి వస్తాడు. భగవంత్ కేసరికి, ఆయనకు మంచి రిలేషన్ ఏర్పడుతుంది. వాళ్ల పాపని భగవంత్ కేసరి బాగా చూసుకోవడంతో ఆ అనుబంధం ఏర్పడుతుంది. అయితే భగవంత్ కేసరి అమ్మ(జయచిత్ర) చావుబతుకుల్లో ఉండటంతో జైలు నుంచి భగవంత్ కేసరిని అమ్మ చివరి చూపుకు తీసుకెళ్తాడు జైలర్. దీని కారణంగా ఆయన ఉద్యోగం పోతుంది. పోయే క్రమంలో భగవంత్ కేసరి విడుదల చేస్తాడు. అయితే జైలర్ భార్య ఆర్మీలోకి వెళ్లాలని అనుకుంటుందట. ఆమె అనుకోకుండా చనిపోతుంది. దీంతో తన కూతురు విజ్జి పాప(శ్రీలీల)ని ఆర్మీలో చేర్పించాలనుకుంటాడు జైలర్. కానీ విధుల నిమిత్తం హైదరాబాద్ వెళ్లి వచ్చే సమయంలో యాక్సిడెంట్‌లో జైలర్ చనిపోతాడు. దీంతో విజ్జిపాప బాధ్యత భగవంత్ కేసరి చూసుకుంటాడు. ఆమెని ఆర్మీలో చేర్పించాలని ట్రైన్ చేస్తుంటాడు. కానీ అదంటే తనకిష్టం లేదు. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండాలనుకుంటుంది. కానీ తాను కాలేజ్‌లో ఫ్రెండ్ ఒకడు తన లవర్ పిలుస్తున్నాడని చెప్పి విజ్జిపాపని రౌడీల వద్దకి తీసుకెళ్తాడు. ఆమెని కాపాడేందుకు వచ్చిన భగవంత్ కేసరికి రాహుల్ శాన్వీ(అర్జున్ రాంపాల్)ని చూస్తాడు. దీంతో ఇద్దరి పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి. దీంతో పాత ప్రతీకారం తీర్చుకునేందుకు ఇద్దరూ ఛాలెంజ్ విసురుకుంటారు. మరి భగవంత్ కేసరికి, రాహుల్ శాన్వీకి మధ్య ఉన్న గొడవేంటి? భగవంత్ కేసరి జైల్లో ఎందుకున్నాడు? ఆయన ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏంటి? విజ్జిపాప ఆర్మీలో చేరిందా? ఇందులో కాజల్ పాత్రేంటి? అనేది మిగిలిన కథ.
విశ్లేషణః
బాలకృష్ణ సినిమా అంటే మూడు పాటలు, ఆరు ఫైట్లు, ఎలివేషన్లు సీన్లు, బీజీఎం మోత. మధ్య మధ్యలో అంతో కొంత కథ, ఎమోషనల్ సీన్లు, ఒకటిరెండు కామెడీ కామెడీ సీన్లు ఉంటాయి. ఫ్యాన్స్ కి కావాల్సింది కూడా ఇదే. గత పదేళ్లలో బాలయ్య హిట్ మూవీస్ అన్నీ `సింహా`, `లెజెండ్`, `అఖండ`, `వీరసింహారెడ్డి` చిత్రాల్లో అవే ఉంటాయి. అందుకు భిన్నంగా ఉన్న మూవీస్ అన్నీ బోల్తా కొట్టాయి. బాలయ్య మార్క్ యాక్షన్, ఎలివేషన్లు లేకపోతే ఆడియెన్స్, ఆయన ఫ్యాన్స్ కూడా చూసేందుకు ఇష్టపడరు. తాజాగా `భగవంత్ కేసరి`తో మరో ప్రయోగం చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. బాలయ్య మార్క్ ఎలిమెంట్లని తగ్గించి ఎమోషన్స్, కూతురు సెంటిమెంట్ లకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే శ్రీలీల పాత్రకే ప్రయారిటీ ఇచ్చాడు. దీంతో ఈ సినిమా రూపు రేకలే మారిపోయాయి. పగ, విలన్‌ని ఎదుర్కొనే సీన్లకే బాలయ్య ఎపిసోడ్లని పెట్టారు. ఆ తర్వాత కథ మొత్తం శ్రీలీల పాత్ర చుట్టూతే తిప్పారు. ఇదే బాలయ్య అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచే అంశం.
మొదటి భాగంలో జైల్ లో ఫైట్ సీన్‌తో బాలయ్యని పరిచయం చేశారు. ఆయన హిందీలో చెప్పే డైలాగు, కామెడీతో చేసే ఫైట్లతో ఇది బాలయ్య మూవీ కాదు, అనిల్ రావిపూడి సినిమా అని చెప్పేశాడు. అందుకు తగ్గట్టుగానే ఫైట్లలో కామెడి మిక్స్ చేసి సాగతీత ప్రారంభించారు. మొదటి భాగంలోనే తల్లి ఎమోషన్ పెట్టి పిండేశాడు. ఆ తర్వాత కథ ఎంతసేపు అక్కడక్కడే తిరుగుతుంటుంది. శ్రీలీలని ట్రైన్ చేయడం, ఆమె వినకపోవడం, దీనికితోడు కౌన్సిలింగ్ ఇప్పించేందుకు కాచి(కాజల్) వద్దకి పంపించడం, ఆ సమయంలో శ్రీలీల తన లవర్‌తో, కాజల్ బాలయ్యతో లవ్ ట్రాక్ నడిపిస్తూ విసుగెత్తించే ప్రయత్నం చేశాడు. అయితే ఇందులో కొంచెం కామెడీ మిక్స్ చేసినా, అది పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇంటర్వెల్ వరకు సినిమా మొత్తం చప్పగా సాగుతుంది. ఇంటర్వెల్ సాంగ్‌లో బాలయ్యకి, అర్జున్ రాంపాల్‌కి మధ్య ఉన్న గత కక్షని పరిచయం చేస్తూ ట్విస్ట్ వదిలారు. కానీ అంతకు ముందే మధ్యలో భగవంత్ కేసరి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌ని రివీల్ చేయడంతో ఆ కిక్ పోయింది. సెకండాఫ్‌లో సినిమా అర్జున్ రాంపాల్‌కి, బాలయ్యకి మధ్య వార్‌లా సాగుతుంది. కానీ ఆయా సీన్లు కూడా స్లోగా సాగుతుంటాయి. అడ్డు వచ్చే సన్నివేశాలన్నీంటిని మిక్స్ చేసి సినిమాని లాగుతూ వెళ్లాడు. ఆడపిల్లలకు సంబంధించి తక్కువ చేసి మాట్లాడిన ఆర్మీ కోచ్‌ని క్లాస్ పీకడాలు, ఆ తర్వాత అమ్మాయిల గొప్పతనం చెప్పడం, దీనికితోడు చిన్నపిల్లలపై దుండగులు చేసే దాడులు, వారికి ఐస్‌క్రీమ్‌లు, చాక్లెట్లు ఇచ్చి లొంగదీసుకుని పాడు పనులు చేయడం వంటి వాటిని అడ్రెస్ చేస్తూ స్కూల్‌లో బాలయ్య క్లాస్‌లు చెప్పడంతో కొంత ఫర్వాలేదనిపించినా, సినిమా పరంగా అవన్నీ బోరింగ్‌గా అనిపిస్తాయి.
Bhagavanth Kesari Review-Premier Talk
`భగవంత్ కేసరి` కథ పరంగా ఫర్వాలేదనిపించినా, దాన్ని సరైన విధంగా డీల్ చేయలేకపోయాడు దర్శకుడు అనిల్ రావిపూడి. కేవలం మూడు ఫైట్లు బాగుంటే చాలు, వాటిలో ఎలివేషన్లు పెడితే చాలు అనే దృక్పథంతో ఈ చిత్రాన్ని తీశారని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అలాంటి ఫైట్లు కూడా రొటీన్ అవుతాయని భావించారేమో, అందులోనూ సాగదీతలు, క్లాస్‌లు పీకడాలు, భారీ డైలాగులతో యాక్షన్ సీన్లలో ఉండే కిక్ డైల్యూట్ అయ్యేలా చేశారు. క్లైమాక్స్ ఫైట్‌ని అదిరిపోయేలా డిజైన్ చేసినా, అది కూడా సాగదీయడంతో ఆడియెన్స్ ఆ కిక్ ఫీల్ కాకుండా అయిపోయింది. ఫైట్స్ లోనూ ఫీల్ లేదు. బాలయ్య మార్క్ ఈజ్ కనిపించలేదు. ఇందులో హిందీలో వచ్చే రెండు మూడు డైలాగ్‌లు తప్ప, బాలయ్య మార్క్ పవర్‌ఫుల్ డైలాగ్‌లు మిస్ అయ్యాయి. ఎమోషన్స్ లో దమ్ములేదు. బాలయ్య జైల్‌కి వెళ్లిన సందర్భంలో దమ్ము లేదు, మరోవైపు ఫ్లాష్ అదిరిపోయేలా ఉంటుందని అక్కడ ఇక్కడ ఊదగొట్టారు, కానీ ఆ బ్లాక్ ఏమాత్రం ప్లస్ కాలేదు, అందులో మ్యాటరే లేదు. అది తేలిపోయింది. పైగా సినిమా మొత్తం శ్రీలీల చుట్టూ తిప్పడంతో బాలయ్య మార్క్ మిస్ అయ్యింది. శ్రీలీల సినిమాలో బాలయ్య నటించిన ఫీలింగ్ కలుగుతుంది. అర్జున్ రాంపాల్‌తో గొడవలోనూ బలం లేదు. అడవి బిడ్డ భగవంత్ కేసరి అంటూ పదే పదే డైలాగ్‌లు చెప్పారు, కానీ అడవి బిడ్డ అని చెప్పే ఒక్క సీన్ కూడా లేకపోవడంతో ఆ డైలాగ్‌లకు అర్థం లేకుండా అయిపోయింది. దీనికితోడు చెప్పిన డైలాగులనే పదే పదే రిపీట్ చేయడం కూడా రొటీన్ ఫీలింగ్‌ని తెప్పిస్తాయి. మొత్తంగా అనిల్ రావిపూడి.. బాలయ్యని సరిగా డీల్ చేయలేకపోయాడు. ఫెయిల్ అయ్యాడు.
Bhagavanth Kesari Review-Premier Talk
నటీనటులుః
నేలకొండ భగవంత్ కేసరి పాత్రలో బాలకృష్ణ అదరగొట్టాడు. పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు. తనకు సెట్ అయిన ఏజ్డ్ రోల్‌లో కనిపించడం విశేషం. అయితే పోలీస్ ఆఫీసర్‌గా ఆయన రోల్ అంతగా పండలేదు, అందులో దమ్ములేదు. అది తేలిపోయింది. కాకపోతే ఎమోషనల్ సీన్లలో మాత్రం పిండేశాడు. చాలా రోజుల తర్వాత బాలయ్య తనలోని ఎమోషనల్ యాంగిల్‌ని పరిచయం చేశాడు. యాక్షన్ తో అదరగొట్టిన బాలయ్య డైలాగ్‌ల విషయంలో మజా మిస్ అయ్యింది. కాజల్.. గ్లామర్ హీరోయిన్‌గా కాకుండా బాలయ్యకి జోడీగా కనిపించింది. పెద్దగా ప్రయారిటీ లేదు, జస్ట్ ఓకే అనిపించింది. బాలయ్య, కాజల్ మధ్య కామెడీ సీన్లు మాత్రం బాగా వర్కౌట్ అయ్యాయి. విజ్జిపాపగా శ్రీలీల అదరగొట్టింది. ఇందులో యాక్టింగ్‌తో ఇరగదీసింది. నెగటివ్ రోల్‌లో అర్జున్ రాంపాల్ బాగా చేశాడు. పాత్రకి తగ్గట్టుగా తన ఆరా చూపించాడు. వీరితోపాటు శరత్ కుమార్, రవి శంకర్, రఘుబాబు, జాన్‌విజయ్, గణేష్, రాహుల్ రవి వంటి వారు తమ పాత్రల మేరకు బాగా చేశారు.
Bhagavanth Kesari Review-Premier Talk
టెక్నీషియన్లుః
థమన్ మ్యూజిక్ సినిమాకి పెద్ద మైనస్. పాటలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. `ఉయ్యాలో ఉయ్యాల` సినిమాలో అంతగా అనిపించలేదు. బాలయ్య తల్లి చనిపోయినప్పుడు మాత్రం ఎమోషనల్ గా అనిపించింది. ఇక గణేష్ సాంగ్ తేలిపోయింది. `యలమల యాలలల.. ` అంటూ వచ్చే బీజీఎం కొంత వరకు ఓకే, కానీ బాలయ్య మార్క్ బీజీఎం మాత్రం మిస్ అయ్యింది. అన్ని ఫైట్లకి ఒకే బీజీఎం కనిపిస్తుంది. దీనికితోడు `జైలర్` బీజీఎం కాపీ కొట్టిన ఫీలింగ్ కూడా కలుగుతుంది. రాంప్రసాద్ విజువల్స్ ఓకే. తమ్మిరాజు ఎడిటింగ్ పరంగా ఇంకా కోత కోయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి.. కథని బలంగా చెప్పలేకపోవడం, బాలయ్యని బలంగా చూపించలేకపోవడం మైనస్. ఎమోషన్ సీన్లు, సెలిమెంట్లు, అమ్మాయిల గురించి క్లాస్ పీకడాలు, వంటి సీన్లతో టైమ్ పాస్ చేస్తూ సినిమాని సాగదీసుకుంటూ వెళ్లాడు. బోర్ తెప్పించాడు. సినిమాలో సోల్ మిస్ అయ్యింది. అలగే ఎమోషన్స్ లో డెప్త్ మిస్ అయ్యింది. సీన్లలో ఎమోషన్స్ క్యారీ కాకపోవడంతో చాలా సీన్లు తేలిపోయాయి, అవి బోర్ తెప్పించాయి. దీంతో `భగవంత్ కేసరి` డిజప్పాయింట్ చేసింది.
Bhagavanth Kesari
ఫైనల్‌గాః దర్శకుడు అనిల్ రావిపూడి ముందు నుంచి చెబుతూనే ఉన్నాడు, ఇది బాలయ్య మార్క్ సినిమా కాదని. నిజమే ఇది బాలయ్య మూవీ కాదు.
రేటింగ్‌ః 2