- Home
- Entertainment
- శ్రీదేవిని తీసేయమని చెప్పిన బాలయ్య.. వీరి కాంబోలో మూవీ రాకపోవడానికి కారణం ఎన్టీఆర్ కాదు, చిరంజీవి ప్రస్తావన
శ్రీదేవిని తీసేయమని చెప్పిన బాలయ్య.. వీరి కాంబోలో మూవీ రాకపోవడానికి కారణం ఎన్టీఆర్ కాదు, చిరంజీవి ప్రస్తావన
శ్రీదేవి అప్పట్లో ఎన్టీఆర్ నుంచి వెంకటేష్ వరకు అందరు అగ్ర హీరోలతో సినిమాలు చేసింది. కానీ బాలయ్యతో మాత్రం ఒక్క మూవీ కూడా చేయలేదు. అందుకు గల కారణం ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఎన్టీఆర్ నుంచి వెంకటేష్ వరకు..
ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమని ఏలిన హీరోయిన్లలో శ్రీదేవి ముందు వరుసలో ఉంటారు. శ్రీదేవిని తెలుగు ప్రేక్షకులు అతిలోక సుందరి అని ముద్దుగా పిలుచుకుంటారు. శ్రీదేవి తెలుగులో అలనాటి ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు లాంటి హీరోలతో పాటు వారి తర్వాతి తరం హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లతో కూడా హీరోయిన్ గా రొమాన్స్ చేసింది.
బాలయ్యతో ఒక్క మూవీ కూడా లేదు
ఇంతమంది అగ్ర హీరోలతో నటించిన శ్రీదేవి.. నందమూరి బాలకృష్ణతో మాత్రం ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ఇందు కారణం ఎన్టీఆర్ అని చాలా మంది భావిస్తూ ఉండొచ్చు. ఎన్టీఆర్, శ్రీదేవి లది సూపర్ హిట్ కాంబినేషన్. వేటగాడు, బొబ్బిలి పులి లాంటి చిత్రాల్లో శ్రీదేవి ఎన్టీఆర్ తో రొమాన్స్ చేసింది. తన తండ్రితో నటించిన హీరోయిన్ కాబట్టి బాలయ్య.. శ్రీదేవితో నటించకూడదు అని డిసైడ్ అయినట్లు అంతా భావించారు. కానీ అది నిజం కాదు.
చిరంజీవి సినిమాలో మాత్రమే..
శ్రీదేవితో ఎందుకు నటించలేదో బాలయ్య ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. శ్రీదేవి నా సినిమాలకు సెట్ అవ్వదు. ఆమెతో నటించకూడదని నేను నిర్ణయించుకోలేదు. మా కాంబినేషన్ సెట్ కాకపోవడం అనేది యాదృచ్చికం. చాలా సందర్భాల్లో ఆమె నా సినిమాలకు సరిపోదు అని నాకు అనిపించింది. నాన్నగారి తరం హీరోలతో ఆమె హవా బాగా సాగింది. మా తరానికి వస్తే బ్రదర్ చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి చిత్రాల్లో మాత్రమే ఆమె పాత్ర పండింది.
నా మాట వినలేదు, మూవీ ఫ్లాప్
ఒక హీరో సినిమాలో శ్రీదేవిని తీసుకున్నారు. ఆ చిత్రానికి ఆమె అవసరం లేదు. ఆమెని తీసేసి వేరే వాళ్ళని పెట్టుకోమని ఆ నిర్మాతకి చెప్పాను. అది నా సినిమా కూడా కాదు. వేరే హీరో మూవీ అయినప్పటికీ మంచి సలహా ఇచ్చాను. కానీ వాళ్ళు నా మాట వినలేదు. శ్రీదేవిని హీరోయిన్ గా పెట్టుకున్నారు. ఆ మూవీ కనీసం వారం కూడా ఆడలేదు, డిజాస్టర్ అయింది అని బాలయ్య తెలిపారు. ఆ హీరో ఎవరు ? ఆ సినిమా ఏంటి ? అనే వివరాలు బాలయ్య చెప్పలేదు.
కథకి ఎవరు కరెక్టో వాళ్లనే తీసుకోమని చెబుతా
అదే విధంగా ఒక రీమేక్ సినిమా కోసం టాప్ హీరోయిన్ ని తీసుకున్నారు. అది కూడా నా సినిమా కాదు. ఆ కథకి ఆమె సెట్ కాదు అని చెప్పా. వాళ్ళు కూడా వినలేదు. ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది అని బాలయ్య అన్నారు. తన చిత్రాల్లో ఎక్కువగా సాధారణ హీరోయిన్లే ఉంటారని, కథకి ఎవరు కరెక్టో వాళ్లనే తీసుకోమని చెబుతానని బాలయ్య అన్నారు.