ANR: అమ్మాయిలా నడుస్తున్నాడు హీరో అవుతాడా? అక్కినేని ఎదుర్కొన్న అవమానాలు.. లావుగా కనబడేందుకు బాడీకి ప్యాడ్స్
వెండితెర బహుదూరపు బాటసారి అక్కినేని నాగేశ్వరరావు(ఏఎన్నార్) తెలుగు చిత్ర పరిశ్రమకి రెండు కళ్లలో ఒకరిగా వెలుగొందారు. లెజెండరీ నటుడిగా కీర్తించబడుతున్నారు. కానీ ప్రారంభంలో బాడీ షేమింగ్ కామెంట్లని ఫేస్ చేశారు.
ఏఎన్నార్.. దాదాపు ఏడు దశాబ్దాలపాటు నటుడిగా రాణించాడు. తెలుగు చిత్ర పరిశ్రమకి అత్యధికంగా సేవలు అందించిన నటుడిగా నిలిచారు. ఎన్నో విషయాల్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు. ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలిచారు. ఎన్నో మరుపురాన చిత్రాలను, ఎన్నో క్లాసిక్స్ లో నటించి తిరుగులేని స్టార్‌గా ఎదిగారు. లెజెండరీ నటుడిగా వెలుగుతున్నారు. చిత్ర పరిశ్రమకి రెండు కళ్లల్లో ఒకరిగా రాణించబడిన ఏఎన్నార్ శతజయంతి నేడు. ఆయన 1923 సెప్టెంబర్ 20న జన్మించిన విషయం తెలిసిందే.
అక్కినేని నాగేశ్వరరావు అంటే ఎన్నో క్లాసిక్ చిత్రాలు, ఆయన స్టార్ ఇమేజ్, ప్రయోగాలు, అత్యధిక పారితోషికం అందుకునే నటుడిగానే గుర్తొస్తారు.అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో చిత్ర పరిశ్రమ ఎదిగేందుకు దోహదపడ్డ విషయాలు గుర్తొస్తాయి. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతగా, పద్మ విభూషణ్‌గా కేంద్ర ప్రభుత్వ గౌరవాలు, అనేక అవార్డులు గుర్తొస్తాయి. కానీ దాని వెనకాల చాలా అవమానాలున్నాయి. అనేక హేళనలు, బాడీషేమింగ్ కామెంట్లు ఉన్నాయి.
నాటకాల నుంచి సినిమాల్లోకి వెళ్లారు ఏఎన్నార్. ఇక్కడ ఆయన అనేక నాటకాలు వేశారు. అందులో చురుకుగా యాక్ట్ చేయడంతో మంచి పేరొచ్చింది. సినిమాల్లో ప్రయత్నించమనే ఒత్తిడి పెరిగింది. దీంతో రైలు బండెక్కి మద్రాస్ చెక్కేశాడు. అయితే ప్రారంభంలో ఏఎన్నార్ చాలా బక్కగా, పీలగా ఉండేవారట. దీంతో అనేక కామెంట్లు చేశారట. పైగా ఆడనడక అంటూ హేళన కూడా చేశారట. సినిమాల్లో రాణించాలనే ఉత్సాహం, కసి ఓ వైపు, ఇలాంటి బాడీ షేమింగ్ విమర్శలు మరోవైపు ఆ సమయంలో మానసికంగా చాలా స్ట్రగుల్ అయ్యాడట ఏఎన్నార్.
అంతేకాదు తను బక్కగా ఉండటంతో సినిమాల్లో నటించేటప్పుడు బాడీకి ప్యాడ్స్ తొడిగేవారట. అలాంటి ఇబ్బందులు ఎన్నో ఫేస్ చేశాడు ఏఎన్నార్. ఆ తర్వాత ఇంగ్లీష్ భాష విషయంలోనూ విమర్శలు తప్పలేదు. ఇంగ్లీష్ రాదని చాలా అవమానించేవారట. కనీసం పిల్లని కూడా ఇచ్చేవారు కాదని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు అక్కినేని నాగేశ్వరరావు. ఇంగ్లీష్ భాష నేర్చుకోవడంలో చాలా అవమానాలు, విమర్శలు ఉన్నాయని, ఆ కసి లో నుంచి వచ్చిందే ఇంగ్లీష్ అని తెలిపారు. బాధ, కసి, ఛాలెంజ్‌తో వచ్చిందన్నారు.చాలా సంఘటనలు ఫేస్ చేసినట్టు చెప్పారు.
అంతేకాదు తన మేనమామ కూతురినే ఇవ్వలేదన్నారు. అంతకంటే అవమానం ఏముంటుందని ఆవేదన వ్యక్తం చేశారు ఏఎన్నార్. సినిమాల్లో నటించే వారంటే చిన్న చూపు ఉండేదని, సినిమా వాళ్లు, నాటకాలు వేసే వాళ్లంటే తాగుబోతులు, వ్యభిచారులుగానే చూసేవారట. ఎవరో ఒకళ్లు చేస్తే అందరికి ఆపాదించి అవమానంగా మాట్లాడేవారని తెలిపారు.
ఇక చిత్ర పరిశ్రమకి ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్లు లాంటి వారని సంభోదించగా.. దీనిపై తనదైన స్టయిల్‌లో రియాక్ట్ అయ్యారు ఏఎన్నార్. ఏఎన్నార్, ఎన్టీఆర్ రెండు కళ్లు అయితే మిగిలిన వాళ్లంతా ఏమైపోయినట్టు.. ఎస్వీ రంగారావు, రేలంగి, గుమ్మడి, సూర్యకాంతం ఏమైంది, వీళ్లంతా ఏమైనట్టు అని ప్రశ్నించారు. ఈ మీడియా రాసే వాటికి ఉబ్బిపోయే పిచ్చివాళ్లు రామారావు కాదు, నేను కాదు అంటూ స్పష్టం చేశారు.
ఏఎన్నార్.. ఘంటసాల బాలరమయ్య పరిచయం కావడంతో ఆయన కెరీర్ మలుపు తిరిగింది. ఆయన కారణంగానే `శ్రీ సీతారామజననం` చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఏఎన్నార్ తొలి పూర్తి స్థాయి మూవీ ఇది. అంతకు ముందు `ధర్మపత్ని` అనే చిత్రంలో చిన్న రోల్‌లో మెరిశారు ఏఎన్నార్. జానపదాలు, పౌరాణికాలు, సంఘీకాలు ఇలా అన్ని రకాల చిత్రాలు చేశారు. లేడీ గెటప్స్, మల్టీస్టారర్స్ చేసి మెప్పించారు. టాలీవుడ్‌కి డ్యాన్స్ నేర్పించారు. తన 73ఏళ్ల సినిమా కెరీర్‌లో 250కిపైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. దిగ్గజ నటుడగా ఎదిగారు.