ఏఎన్నార్ ఎంత గొప్పవాడో చెప్పేందుకు ఈ సంఘటన చాలు... అంత పెద్ద స్టార్ అయ్యుండి!
పరిస్థితులను అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు మనల్ని అవమానించారనో, మనకు అపకారం చేశారనో రివేంజ్ లు తీర్చుకోకూడద, ఈ ఉదంతం తెలియజేస్తుంది.
పెద్దగా చదువుకోని నాగేశ్వరరావుకు నాటకాలంటే పిచ్చి. ఆ మక్కువే చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేసేలా చేసింది. 1944లో విడుదలైన శ్రీ సీతారామ జననం మూవీతో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా పరిచయం అయ్యారు. బాలరాజు, కీలుగుఱ్ఱం, దేవదాసు, మిస్సమ్మ చిత్రాలతో ఆయన స్టార్ గా ఎదిగారు.
ఎన్టీఆర్-ఏఎన్నార్ సమకాలీన నటులు తెలుగు చిత్ర పరిశ్రమను దశాబ్దాల పాటు ఏలారు. అయితే కెరీర్ బిగినింగ్ లో ఏఎన్నార్ కి కూడా అవమానాలు తప్పలేదట. తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని, ఏఎన్నార్ గతంలో తెలియజేశారు. ఏఎన్నార్ ని భోజనం చేసే చోట ఓ వ్యక్తి తీవ్రంగా అవమానించాడట.
1946లో విడుదలైన ముగ్గురు మరాఠీ లు చిత్రంలో ఏఎన్నార్ నటించారు. ఏఎన్నార్ కి అది మూడో చిత్రం. ఆయనకు ఎలాంటి ఫేమ్ లేదు. ముగ్గురు మరాఠీ లు చిత్రానికి ఘంటసాల బలరామయ్య దర్శకుడు. ఏఎన్నార్ మొదటి చిత్రం దర్శకుడు కూడా ఆయనే.
మధ్యాహ్నం మేకప్ రూమ్ లో కన్నాంబతో పాటు మరికొందరు నటులు, ప్రముఖులు భోజనం చేస్తున్నారట. ఏఎన్నార్ కూడా భోజనం చేద్దామని లోపలి వెళ్లబోయాడట. ముగ్గురు మరాఠీలు చిత్రానికి మేనేజర్ గా ఉన్న సూర్యనారాయణ అనే వ్యక్తి ఏఎన్నార్ ని అడ్డగించాడట. పెద్దవాళ్ళు భోజనం చేస్తుంటే నువ్వు ఎక్కడికి? నువ్వేమైనా స్టార్ అనుకుంటున్నావా? క్యాంటీన్ కి వెళ్లి తిను, అని గట్టిగా కసిరాడట.
అవమానభారంతో ఏఎన్నార్ అక్కడ నుండి వెళ్ళిపోయాడట. క్యాంటీన్ లో భోజనం చేశాడట. 1967లో ప్రాణమిత్రులు షూటింగ్ జరుగుతుందట. ఆ చిత్రానికి దర్శకుడు పి.పుల్లయ్య. నిర్మాత వి. వెంకటేశ్వర్లు. అయితే సూర్యనారాయణ అన్నీ దగ్గరుండి చూసుకునేవారట. సూర్యనారాయణతో పుల్లయ్య.. ఏఎన్నార్ మేకప్ వేసుకోవడం పూర్తి అయితే రమ్మను షాట్ రెడీ అని చెప్పాడట.
ఏఎన్నార్ కి చెప్పేందుకు సూర్యనారాయణ మేకప్ రూమ్ కి వెళ్ళాడట. అప్పుడు ఏఎన్నార్... నువ్వు ముగ్గురు మరాఠీ లు చిత్రానికి మేనేజర్ గా పని చేశావు కదా? నాకు తెలుసు. ఇంకా గుర్తుంది. ఆ రోజు నువ్వు భోజనం దగ్గర నన్ను కసిరి అవమానించావు, అన్నాడట. ఏదో తప్పైపోయింది క్షమించండి అని సూర్యనారాయణ అన్నాడట. అప్పుడు నువ్వు నాకు చేసిన అవమానానికి నిన్ను చెడామడా తిడతానని అనుకోకు, అని ఏఎన్నార్ అన్నారట.
నీ తప్పేమీ లేదు. నీ బాధ్యత నువ్వు నెరవేర్చావు. అప్పుడు నిజంగా నేను ఎవరినీ? స్టార్ హీరోని కాదు కదా? నువ్వు అలా అనడం భావ్యమే. కన్నాంబ గారు పెద్ద నటులు. ఆమెకు ఇచ్చే గౌరవ మర్యాదలు వేరుగా ఉంటాయి. అంతటి గౌరవం నాకు ఎలా ఇస్తార్లెండి. కానీ బాధ కలిగింది కనుక ఆ అవమానం మర్చిపోలేదు. అందుకే అడిగాను... అన్నారట. నేడు ఏఎన్నార్ శతజయంతి. 1924 సెప్టెంబర్ 20న ఆయన జన్మించారు.