- Home
- Entertainment
- Isakapatnam Review: ఇసకపట్నం రివ్యూ.. కుర్చీ కోసం డాన్ కూతురు ఆడిన క్రిమినల్ మైండ్ గేమ్ ఎలా ఉందంటే ?
Isakapatnam Review: ఇసకపట్నం రివ్యూ.. కుర్చీ కోసం డాన్ కూతురు ఆడిన క్రిమినల్ మైండ్ గేమ్ ఎలా ఉందంటే ?
సముద్రఖని, ఐశ్వర్య రాజేష్ ప్రాధాన పాత్రల్లో నటించిన ఇసకపట్నం వెబ్ సిరీస్ పై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్ ఆకట్టుకునేలా ఉందా లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం.

Isakapatnam Review
ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా కమర్షియల్ సినిమాలు చేస్తూనే కొన్ని ప్రయోగాత్మక పాత్రలు కూడా ఎంచుకుంటున్నారు. తన పాత్రల ఎంపిక విషయంలో ఐశ్వర్యరాజేష్ సెలెక్టివ్ గా ఉంటున్నారు. ఏ పాత్రలు పడితే వాటిని ఓకె చేయడం లేదు. తాజాగా ఐశ్వర్య రాజేష్, సముద్రఖని, నరేష్ అగస్త్, రాజా చేంబోలు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ఇసకపట్నం. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. మొత్తం ఇది 7 ఎపిసోడ్ ల వెబ్ సిరీస్. ప్రైమ్ వీడియోలో ఈ రాత్రి నుంచి స్టీమింగ్ మొదలైంది. ఐశ్వర్య రాజేష్, సముద్రఖనితో పాటు కీలకంగా అనిపించే పాత్రలు ఈ సిరీస్ లో చాలానే ఉన్నాయి. నరేష్ అగస్త్య, సుధాకర్ కొమాకుల, సునీల్, బనెర్జీ, రవి వర్మ కీలక పాత్రల్లో నటించారు. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ
ఇసకపట్నం వెబ్ సిరీస్ అనేది ఇసకపట్నం తీరప్రాంతం, పోర్ట్ ఏరియాలో 1980, 1990 టైం పీరియడ్ లో జరిగే కథ. సముద్రఖని సాధారణ కూలీగా బతుకుదెరువు కోసం ఇసుకపట్నం పోర్ట్ ఏరియాకి భార్య కూతురితో వెళతాడు. సముద్రఖని పాత్ర పేరు నాయుడు. అతడు క్రూరమైన వ్యక్తిత్వం గలవాడు. ఆ ప్రాంతంలో సిన్నరావు( రాజీవ్ కనకాల) అనే లోకల్ లీడర్ ఉంటారు. మత్సకారుల సమస్యలు పరిష్కరిస్తూ మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటాడు. ఊహించని పరిస్థితుల్లో నాయుడు.. సిన్నరావుని హత్య చేసి ఒక్కసారిగా పోర్ట్ ఏరియాని గ్రిప్ లోకి తెచ్చుకుని డాన్ గా ఎదుగుతాడు. ఆ తర్వాత పోర్ట్ ఏరియాలు వ్యాపారాలు, స్మగ్లింగ్, రౌడీయిజంతో డబ్బు, పవర్ సంపాదిస్తాడు. అతడికి రైట్ హ్యాండ్ గా బెనర్జీ ఉంటారు.
తండ్రి చేసే అక్రమాలు, రౌడీయిజం అంటే కూతురు భారతి(ఐశ్వర్య రాజేష్) కి ఇష్టం ఉండదు. అలాగని తండ్రి పనులకు అడ్డు రాదు. ఆమె ఒక ఎన్జీవో సంస్థకు విరాళాలు ఇస్తూ పేద వారికి సాయం చేస్తూ ఉంటుంది. తండ్రి అంటే ఇష్టం లేకపోవడానికి భారతికి మరో కారణం కూడా ఉంటుంది. దానిని మనసులోనే పెట్టుకుని ఉంటుంది. కొంత కాలం తర్వాత వ్యాపారంలో విభేదాలు రావడంతో నాయుడు అనుచరుడు పోతన అతడి నుంచి దూరం జరుగుతాడు. నాయుడుని దెబ్బ కొట్టాలని అదే ఏరియాలో ధనవంతుడు అయిన ప్రతాప్ వర్మ(రవి వర్మ)తో చేతులు కలుపుతాడు.
ఇంతలో ఇసకపట్నం పోర్ట్ ఏరియాలో ఊహించని సంఘటనలు జరుగుతాయి. గ్యాస్ లీక్ వాళ్ళ పేలుడు జరిగి కొందరు చిన్నారులు మరణిస్తారు. ఊహించని పరిస్థితుల్లో భారతి వివాహం ప్రతాప్ వర్మతో జరుగుతుంది. ఇష్టం లేకపోయినా, తనకి ప్రియుడు ఉన్నప్పటికీ భారతి అతడిని పెళ్లి చేసుకుంటుంది. కానీ ఫస్ట్ నైట్ రోజే ప్రతాప్ వర్మ చనిపోతాడు. తండ్రి అన్ని దుర్మార్గాలు చేస్తున్న కుమార్తె భారతి ఎందుకు సైలెంట్ గా ఉంటుంది ? గ్యాస్ లీకేజి ఘటనకు కారణం ఎవరు ? భారతితో పెళ్ళైన వెంటనే ప్రతాప్ వర్మ ఎందుకు చనిపోయాడు ? ఇందులో భారతి హస్తం ఉందా ? తన నాన్నమ్మ చెప్పిన మాటలతో భారతి ఏం చేసింది ? ఇవన్నీ తెలియాలి అంటే ఇసకపట్నం వెబ్ సిరీస్ చూడాల్సిందే.
విశ్లేషణ
7 ఎపిసోడ్ లతో తెరకెక్కిన ఇసకపట్నం సిరీస్ పోర్ట్ ఏరియాలో జరిగే రౌడీయిజం, మాఫియా, స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. ఇసకపట్నం పోర్ట్ లో ఉండే లోకల్ మత్య్సకారులు, బర్మా నుంచి వచ్చిన మత్స్యకారులు మధ్య ఆధిపత్యం పోరుతో కథ మొదలవుతుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో సముద్రఖని చుట్టూ కథ తిరుగుతుంది. మొదటి రెండు మూడు ఎపిసోడ్స్ కథ నెమ్మదిగా సాగినప్పటికీ దర్శకుడు ఒక్కో పాత్రని పరిచయం చేసిన విధానం, ఆ పాత్రలని మలిచిన తీరు బావుంది. సాధారణంగా ఒక కథతో రెండు మూడు పాత్రలు బలంగా ఉంటాయి.
కానీ ఈ వెబ్ సిరీస్ లో ఐశ్వర్య రాజేష్, సముద్రఖనితో పాటు బలంగా ఉండే పాత్రలు చాలానే ఉన్నాయి. దర్శకుడు అందరికీ కథలో ఇంపార్టెన్స్ ఇవ్వడం అభినందించదగ్గ విషయం. అయితే ప్రారంభంలో సముద్రఖని ఒక్కసారిగా డాన్ గా ఎదగడం అనేది అంత కన్విన్సింగ్ గా లేదు. ఆ సన్నివేశాలని ఇంకాస్త డిటైల్డ్ గా ఎస్టాబ్లిష్ చేసి ఉండాల్సింది. ప్రారంభం నుంచే ఐశ్వర్య రాజేష్ ఫైరీ పెర్ఫార్మెన్స్ చూడాలనుకునే అభిమానులకు కాస్త నిరాశ తప్పదు. ఆమె పాత్రలో అసలు కోణం బయట పెట్టడానికి దర్శకుడు చాలానే టైం తీసుకున్నారు.
ఆ తర్వాత ఆమె వేసే ఎత్తుగడలు అద్భుతంగా ఉంటాయి. ఒక వ్యక్తి బలాన్ని లాగేయాలి అంటే చంపాల్సిన అవసరం లేదు చచ్చేంత పని చేస్తే చాలు అనే సిద్ధాంతాన్ని నమ్మి తండ్రికి వ్యతిరేకంగా పావులు కదపడం ఎంగేజింగ్ గా ఉంటుంది. సునీల్ పోషించిన పోలీస్ అధికారి పాత్రకు అంతగా ప్రాధాన్యత దక్కపోవడం మరో మైనస్.
భారతి ప్రియుడిగా సుధాకర్ సుధాకర్ కొమాకుల, ఆటో డ్రైవర్ గా కనిపించిన నరేష్ అగస్త్య పాత్రలని దర్శకుడు కథలో ఇన్వాల్వ్ చేసిన విధానం బావుంది. అయితే కొన్ని సన్నివేశాల్లో ఇంకాస్త క్లారిటీగా తీసి ఉండాల్సింది. ఎవరు ఎవరి వైపు ఉన్నారు అనే విషయంలో అక్కడక్కడా క్లారిటీ మిస్ అయింది. భారతి ఎంతటి క్రిమినల్ మైండ్ గేమ్ఆడింది అనేది క్లైమాక్స్ లోనే తెలుస్తుంది. ఆమె ఆడిన మైండ్ గేమ్ షాకింగ్ గా ఉంటుంది. కానీ ఆ సన్నివేశాలు క్లైమాక్స్ లోనే రివీల్ కావడంతో భారతి పాత్ర ఎంత పవర్ ఫుల్ అనేది బిగినింగ్ నుంచి ఆడియన్స్ కి అర్థం కాదు. దీనితో ఇంపాక్ట్ కాస్త మిస్ అయింది. క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ లు సంతృప్తికరంగా అనిపిస్తాయి. లేడీ పుష్ప తరహాలో ఐశ్వర్య రాజేష్ కి ఎలివేటివ్ లభిస్తుంది అని చెప్పొచ్చు.
నటీనటులు
ఎప్పటి లాగే సముద్రఖని తన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. ఇసకపట్నం పోర్ట్ ఏరియాలో డాన్ గా ఆయన నటించిన విధానం చాలా బావుంది. విలన్ గా క్రూరత్వం ప్రదర్శిస్తూనే తన ఆధిపత్యం నిలుపుకునేందుకు మెదడుకు పని చెప్పి వేసే ఎత్తుగడలు చాలా బావుంటాయి. ఇక ఐశ్వర్య రాజేష్ విలన్ కుమార్తె అయినప్పటికీ సాధారణ ఎన్జీవో కార్యకర్తగా సింపుల్ గా కనిపిస్తూ ఆకట్టుకుంది. ఆ తర్వాత తన పాత్రలో ఉండే మలుపులు తగ్గట్లుగా బాడీ లాంగ్వేజ్ ని మారుస్తూ మైండ్ బ్లాక్ చేసింది.
నరేష్ అగస్త్యకి ఈ సిరీస్ లో చాలా మంది పాత్ర దక్కింది. నరేష్ పాత్రలో ఎమోషనల్ డెప్త్ ఉంటుంది. ఇక భారతి ప్రియుడిగా సుధాకర్ కొమాకుల కూడా ఆకట్టుకున్నాడు. సునీల్, రాజీవ్ కనకాల, రవి వర్మ తమ పాత్రల మేరకు మెప్పించారు.
టెక్నికల్ గా
పోర్ట్ ఏరియాలో జరిగే మాఫియా కథలో తండ్రి కూతుళ్ళ ఆధిపత్యం అంశాన్ని దర్శకుడు గ్యారీ బీహెచ్ జోడించిన విధానం చాలా బావుంది. కథని చక్కగా ప్రజెంట్ చేశారు. అయితే ఐశ్వర్య రాజేష్ పాత్రని ఇంకా బోల్డ్ గా, పవర్ ఫుల్ గా చూపించే అవకాశం ఉంది. కానీ దానిని దర్శకుడు మిస్ చేసుకున్నారు. మొదటి 3 ఎపిసోడ్స్ లో ఎడిటింగ్ షార్ప్ గా ఉండి ఉంటే కథ ప్రారంభం నుంచే పరుగులు పెట్టేది. సంగీతం పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.
ఫైనల్ గా
ఇది క్రూరమైన తండ్రిపై కూతురు ఆడే క్రిమినల్ మైండ్ గేమ్. కొన్ని మైనస్ లు ఉన్నప్పటికీ సముద్రఖని, ఐశ్వర్య రాజేష్ పవర్ ఫుల్ పెర్ఫార్మన్స్ కోసం ఇసకపట్నం వెబ్ సిరీస్ చూడవచ్చు.
రేటింగ్: 2.75/5

