ఆర్జీవీ `పవర్ స్టార్` సినిమా చేస్తే తప్పేంటి: ప్రకాష్ రాజ్
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల వరుసగా వివాదాస్పద చిత్రాలతో హల్చల్ చేస్తున్నాడు. లాక్ డౌన్ సమయంలో దర్శక నిర్మాతలంతా ఖాళీగా ఉంటే వర్మ మాత్రం వరుస సినిమాలు చేస్తున్నాడు. అయితే తాజాగా వర్మ తెరకెక్కించిన పవర్ స్టార్ సినిమాపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.
రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన పవర్ స్టార్ సినిమా గురించి ప్రేక్షకుల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొంత మంది వర్మ తీసిన సినిమాలో తప్పేంటి అంటుంటే, మరికొందరు మాత్రం ఒక వ్యక్తి క్యారెక్టర్‌ను టార్గెట్ చేస్తూ సినిమాలు చేయటం ఏంటి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ విషయంలో సెలబ్రిటీల్లో కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
పవర్ స్టార్ సినిమా రిలీజ్ కు ముందు హీరో నిఖిల్, నిర్మాత నాగ వంశీ లాంటి వారు వర్మను టార్గెట్ చేస్తూ పోస్ట్‌లు చేశారు. కొంత మంది చిన్న చిన్న ఆర్టిస్ట్‌లు కూడా వర్మను తీవ్ర పదజాలంతో దూషిస్తూ వీడియోలు రిలీజ్ చేశారు. అయితే తాజాగా ఈ విషయంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించాడు.
ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ నా దృష్టిలో వర్మ అద్భుతమైన వ్యక్తి. ఆయన పవన్ కళ్యాణ్ మీద ఏదో సినిమా తెరకెక్కించాడంటున్నారు. మరికొందరు సినిమా క్లైమాక్స్‌లో పవన్ గురించి చాలా పాజిటివ్‌గా చూపించారంటున్నారు. వర్మకు ఏదైనా చెప్పే హక్కు ఉంది. ఆయన సినిమా ఆయన్ని తీసుకోనివ్వండి అన్నాడు.
వర్మ సినిమాలు మీకు నచ్చకపోతే చూడకండి... సింపుల్. ఆయన నిజంగానే తప్పుగా తీశాడనుకో.. మీరెందుకు ఆ తప్పును చూస్తున్నారు. నిజానికి రామ్‌గోపాల్ వర్మకు ఉన్నంత తెలివి, ఆయన దగ్గర ఉన్నంత ఇన్‌ఫర్మేషన్ ఎవరి దగ్గరా చూడలేదు అంటూ వర్మను ఆకాశానికి ఎత్తేశాడు ప్రకాష్ రాజ్.
వర్మ మ్యాడ్ కాదు, బ్యాడ్ కాదు. కాకపోతే కాస్త విచిత్రంగా ఆలోచించే మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఒక లైన దాటితే ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొనాల్సిందే. కానీ వర్మ ఆ లైన్ దాటడనే నేను అనుకుంటున్నా. అయినా వర్మకు వ్యతిరేకంగా పవన్ అభిమానులు కూడా సినిమా తీశారు కదా. వాళ్లను కూడాతీసుకోనివ్వండి. కొట్టుకోవటం కన్నా ఇది బెటర్ కదా అన్నాడు ప్రకాష్ రాజ్.