టాలీవుడ్ బాక్సాఫీస్ బ్లాస్ట్.. 100 కోట్ల మార్క్‌ను దాటిన సినిమాలు ఇవే!
100 Crore Club Movies : 2025 లో తెలుగు బాక్సాఫీస్ హవా ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త సినిమాలు వరుసగా రిలీజ్ అవుతూ రికార్డులు బద్దలు కొడుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే 7 సినిమాలు రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరాయి. అవేంటో?

సంక్రాంతికి వస్తున్నాం- బిగ్గెస్ట్ హిట్
విక్టరీ వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. జనవరి 14, 2025న విడుదలైన ఈ చిత్రం కేవలం 17 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 303 కోట్ల వసూళ్లు సాధించింది, ఆ ఏడాది అత్యధిక వసూళ్లు చేసిన తెలుగు సినిమాగా నిలిచింది. సంక్రాంతికి వస్తున్నాం రికార్డులు చూస్తే.. ఈ మూవీ 5 రోజుల్లో ₹150 కోట్లు, 7 రోజుల్లో ₹200 కోట్లు, 17 రోజుల్లో ₹303 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. మేకర్స్ ఈ సినిమాను అధికారికంగా ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్ అని ప్రకటించగా, ఇది వెంకటేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
గేమ్‌చేంజర్ – భారీ అంచనాలకు తగని కలెక్షన్లు
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం తెరకెక్కిన సినిమా ‘గేమ్‌చేంజర్’. 2025 సంక్రాంతి బరిలో భారీ అంచనాల నడుమ విడుదలైంది. విడుదలైన రెండు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరినా, తరువాత బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దాదాపు ₹450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా చివరికి కేవలం ₹191.81 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఫలితంగా, రామ్ చరణ్ , శంకర్ కెరీర్‌లలోనే అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది.
డాకూ మహారాజ్ – అంచనాలను మించిపోయిన కలెక్షన్లు
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకూ మహారాజ్’ సినిమా 2025లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ₹130 కోట్లకు పైగా వసూలు చేసి 100 కోట్ల క్లబ్‌లో స్థానం సంపాదించింది. బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలించింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకులను కట్టిపడేసిన సీన్స్, హైప్, ప్రమోషన్స్ బాక్సాఫీస్ విజయానికి తోడ్పడ్డాయి. ఇప్పటివరకూ 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాలలో నాలుగవ స్థానంలో నిలిచింది.
కుబేరా – మాస్ అండ్ క్లాస్ హిట్
టాలీవుడ్ ప్రేక్షకులకు 2025లో మరో పెద్ద ఎంటర్టైనర్‌ను అందించిన చిత్రం ‘కుబేరా’. స్టార్ హీరోలు ధనుష్, నాగార్జున హీరోలుగా, నేషనల్ క్రష్ రష్మిక మంధన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం విడుదలైన వెంటనే మంచి టాక్ తెచ్చుకుంది. పాజిటివ్ మౌత్ టాక్‌తో ‘కుబేరా’ థియేటర్లలో హౌస్‌ఫుల్ షోలు నడిపి, బాక్సాఫీస్ వద్ద స్థిరమైన కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొత్తం ₹138.85 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసి, 2025లో విడుదలైన తెలుగు చిత్రాల్లో మూడో స్థానంలో నిలిచింది.
హిట్ 3 – క్రైమ్ థ్రిల్లర్‌కి సూపర్ రెస్పాన్స్
నేచురల్ స్టార్ నాని, కేజీఎఫ్ ఫేం శ్రీనిధి శెట్టి జంటగా నటించిన చిత్రం హిట్ 3: ది థర్డ్ కేస్ (హిట్ 3). ఈ సినిమాకు డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించగా, వాల్ పోస్టర్ సినిమా, యునాన్మిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ప్రశాంతి త్రిపిర్నేని నిర్మించారు. హిట్ ఫ్రాంచైజీలో థర్డ్ కేస్‌గా ఈ సినిమా టాలీవుడ్‌లో బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 120.58 కోట్లు వసూలు చేసింది. ఇందులో ఇండియా వైడ్ గా రూ. 95.58 కోట్లు వసూలు చేయగా, ఓవర్సీస్ నుండి ₹25 కోట్లు వసూలు చేసింది. ఇలా ఈ ఏడాది టాలీవుడ్‌లో 100 కోట్ల వసూళ్లు సాధించిన సినిమాలలో ‘HIT 3’ ఒకటిగా నిలిచింది.
హరిహర వీరమల్లు – పీరియడ్ యాక్షన్ డ్రామా
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, క్రిష్ జాగర్లమూడి–జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘హరిహర వీరమల్లు’. పీరియడ్ యాక్షన్ డ్రామా రూపుదిద్దుకున్న ఈ మూవీ జూలై 24న భారీ అంచనాల మధ్య విడుదలైంది. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ప్రారంభంలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, కలెక్షన్ల పరంగా మాత్రం నిరాశ కలిగించింది. బాక్సాఫీస్ వసూళ్ల విషయానికి వస్తే.. దాదాపు రూ. 250 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.117.16 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అలా 100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టినా, పవన్ కళ్యాణ్ కెరీర్ లో డిజాస్టర్ గా నిలిచింది.
మిరాయ్ – యంగ్ హీరో సక్సెస్ రన్
యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ‘మిరాయ్’.ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమా బాక్సాఫీస్‌లో ఘన విజయం సాధించింది. విడుదలైన మొదటి షో నుండి పాజిటివ్ టాక్ తో దూసుకపోతుంది. తొలి రోజు రూ. 27.20 కోట్లు, రెండో రోజు రూ. 55.60 కోట్లు వసూలు చూసింది. కేవలం ఐదు రోజుల్లోనే 105 కోట్ల కలెక్ట్ చేసి, 2025లో 100 కోట్ల క్లబ్‌లో చోటు దక్కించుకుంది. వచ్చే వారం పవన్ కల్యాణ్ ‘ఓజీ’ రిలీజ్ కావడంతో కలెక్షన్లపై ప్రభావం ఉండొచ్చని ట్రేడ్ వర్గాలు సూచిస్తున్నాయి.
2025లో టాలీవుడ్ బాక్సాఫీస్‌కి ఇది గోల్డెన్ ఇయర్‌గా నిలిచింది. వేర్వేరు జానర్స్‌లో వచ్చిన ఈ సినిమాలు వరుసగా 100 కోట్ల క్లబ్‌లో చేరడం గర్వకారణం. ఇక మిగతా సినిమాలు ఇంకా ఏ రేంజ్‌లో కలెక్షన్లు సాధిస్తాయో చూడాలి.

