‘గేమ్ ఛేంజర్’ బెనిఫిట్ షోలపై హైకోర్టు ఆగ్రహం
గేమ్ ఛేంజర్ సినిమా బెనిఫిట్ షోలకు, టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బెనిఫిట్ షోలు రద్దు చేశామని చెప్పి ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడమేంటని ప్రశ్నించింది.
Game Changer, Ramcharan, High Court
సంక్రాంతి కానుకగా జనవరి 10న (game changer release date) ‘గేమ్ ఛేంజర్’ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీకి బెనిఫిట్ షోలకు అనుమతులు, టిక్కెట్ ధరల పెంపు చేయటం జరిగింది. ఈ విషయమై ఈరోజు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బెనిఫిట్ షోలను రద్దు చేశామని చెప్పి... ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడమేంటని ప్రశ్నించింది.
ఇటీవల పుష్ప 2 ది రూల్ సినిమా రిలీజ్ సమయంలో తొక్కిసలాట ఘటన నేపథ్‌యంలో ‘ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు. అదనపు షోలు ఉండవు. టిక్కెట్ ధరలు పెంచబోం’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారని తెలిసిందే.
అయితే ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రకటించి నెల రోజులు కూడా కాకముందే ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటూ.. రామ్‌చరణ్ హీరోగా ‘గేమ్ ఛేంజర్’ సినిమా బెనిఫిట్ షోలకు, అదనపు షోలకు, టిక్కెట్ ధరల పెంపునకు అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ రోజు 10వ తేదీన ఉదయం 4 గంటల నుంచి బెనిఫిట్‌షోలు ప్రదర్శించేందుకు, ఆ రోజు 6 షోలు, 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఐదు షోలు ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. అంతేకాదు 10న అదనంగా మల్టీప్లెక్స్‌లో రూ.150, సింగిల్ స్క్రీన్లలో రూ.100, 11-19 వరకు మల్టీప్లెక్సుల్లో రూ.100, సింగిల్ స్క్రీన్లలో రూ.50 టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ప్రభుత్వ నిర్ణయంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో హైకోర్టు ఎలాంటి ఆదేశాలిస్తుందనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తాజాగా హై కోర్టు ఈ విధానంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
కోర్టు ఏమందంటే...
తాజా పరిణామాల దృష్ట్యా ‘గేమ్ ఛేంజర్’ స్పెషల్ షోలకు అనుమతిపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. బెనిఫిట్ షోలు రద్దు చేశామంటూ, పరోక్షంగా ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడమేంటని ప్రశ్నించింది. అర్ధరాత్రి ఒంటి గంట దాటిన తర్వాత తెల్లవారుజామున షోలకు అనుమతి ఇవ్వడంపై పునఃసమీక్షించాలని ఆదేశించింది. ఈమేరకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. నిర్మాత భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసి ప్రేక్షకుల నుంచి వసూలు చేసుకోవడం సరైంది కాదని వ్యాఖ్యానించింది. ఈ విషయంపై తదుపరి విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది.
ఇక ఎప్పటిలాగే రాజకీయాల నేపథ్యంలో నడిచే ఓ కథను ఎంచుకుని, వ్యవస్థను ప్రక్షాళనను చేసే ఐఏఎస్ అధికారి చుట్టూ సాగే విధంగా దర్శకుడు శంకర్ ఈ కథను అల్లుకున్నాడు. ఆయన గత చిత్రాలు 'ఒకే ఒక్కడు' తో పాటు 'శివాజీ' చిత్రాలు గుర్తొచ్చే విధంగా ఈ కథాంశం ఉండటం విశేషం.
అయితే ఈ చిత్రంలో ఏ సన్నివేశం కూడా ఆ రెండు చిత్రాల స్దాయిలో ఉండదు. అలాగే సీన్స్ హృదయానికి హత్తుకునే విధంగా అనిపించదు. ప్రధాన పాత్రల ద్వారా ఉండాల్సిన ఎమోషన్స్ కూడా చిత్రంలో మచ్చుకు కూడా కనిపించవు. దాంతో సినిమా మార్నింగ్ షోకే డివైడ్ టాక్ తెచ్చుకుంది.