గేమ్ ఛేంజర్: ఏపీ ఈవెంట్ విజయవాడ లో కాదు..మరెక్కడ ? డిటేల్స్
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న 'గేమ్ ఛేంజర్' సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. అమెరికాలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగింది, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు.
దర్శకుడు శంకర్ అభిమానులు ‘గేమ్ ఛేంజర్’ రూపంలో ఓ బెస్ట్ మూవీని చూడబోతున్నారని రామ్‌చరణ్ ఇప్పటికే ఊరించటం మొదలెట్టారు. చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. కియారా అడ్వాణీ హీరోయిన్. దిల్ రాజు నిర్మాత. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న (game changer movie release date) ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా ఇప్పటివరకూ ఏ భారతీయ సినిమాకు నిర్వహించని విధంగా అమెరికాలోని డల్లాస్‌లో ‘గేమ్ ఛేంజర్ గ్లోబల్ ఈవెంట్’ పేరుతో (Game Changer Global Event) ప్రీరిలీజ్ వేడుక జరిపారు. అదే విధంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈవెంట్స్ జరిపి ఫ్యాన్స్ లో జోష్ నింపనున్నారు.
గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ కు చాలా తక్కువ సమయమే ఉండటంతో ప్రమోషన్స్‌లో మరింత జోరు పెంచేస్తున్నారు చిత్రయూనిట్. రిలీజ్‌కు ముందు భారీ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అల్లు అర్జున్ పుష్ప మాదిరే 5 భారీ వేడుకలు చేయబోతున్నట్లు సమాచారం.
ఈలోపు ఏపీ, తెలంగాణలోనూ రెండు భారీ ఈవెంట్స్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ఈవెంట్స్ కు చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్ కూడా వస్తారనే ప్రచారమూ భారీగా జరుగుతుంది. హైదరాబాద్‌లో త్వరలోనే ఓ ఈవెంట్ ఉండబోతుంది. ఈ వేడుకకు చిరంజీవి వస్తారని తెలుస్తుంది. దాంతో పాటు జనవరి 4 లేదా 5 తేదీల్లో ఏపీలో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు.
ఏపీలో ఈవెంట్ విషయానికి వస్తే... తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరిలో గేమ్ ఛేంజర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ నెల 4న సాయంత్రం 6గంటలకు ఈవెంట్ ప్రారంభించనున్నట్లు రాష్ట్ర చిరంజీవి, రామ్ చరణ్ యువత కమిటీ సభ్యుడు ఏడిద బాబి తెలిపారు. మహానాడు నిర్వహించిన మైదానాన్ని A-మీడియా ఛైర్మన్ నరేంద్ర వచ్చి పరిశీలించినట్లు ఆయన తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ ముఖ్య అతిథిగా పాల్గొంటారన్నారు.
రామ్‌చరణ్ (Ram Charan) మాట్లాడుతూ.. ‘‘ మంచి సినిమా అందిస్తే మీరు (ప్రేక్షకులు) బాగా ఆదరిస్తారు. సరైన సినిమాలు తీయకపోతే.. అంతే స్థాయిలో విమర్శిస్తూ తిరస్కరిస్తారు. మీరెప్పుడూ అలాగే ఉండండి. కానీ, నేను హామీ ఇస్తున్నా. ‘గేమ్ ఛేంజర్’ అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. శంకర్‌గారి ప్రతి అభిమానికి ఇదొక బెస్ట్ ఫిల్మ్ అవుతుంది.
ఈ సంక్రాంతికి మా సినిమా లేకపోతే, కల్యాణ్ బాబాయ్‌ని బలవంత పెట్టి అయినా.. ఆయన సినిమా రిలీజ్ అయ్యేలా చేసేవాడిని. అసలు ‘గేమ్ ఛేంజర్’ డిసెంబరులో రావాలి. సంక్రాంతి డేట్ ఇచ్చిన చిరంజీవిగారికి, యూవీ ప్రొడక్షన్స్ వాళ్లకు ధన్యవాదాలు చెబుతున్నా. మామూలుగా అన్ని విషయాల్లో దిల్‌రాజు గారు మార్కులు కొట్టేస్తారు. కానీ, తమన్ కూడా ఎక్కడా తగ్గలేదు. మనవాడు కూడా మార్కులు కొట్టేశాడు అన్నారు రామ్‌చరణ్ .
తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చాలా ఘటనలు ‘గేమ్ ఛేంజర్’లో కనిపిస్తాయని నిర్మాత దిల్‌రాజు అన్నారు. అవన్నీ నాలుగేళ్ల కిందట శంకర్‌గారు (game changer director) రాసుకున్న సన్నివేశాలని తెలిపారు. అవే ఇప్పుడు ప్రేక్షకులతో క్లాప్స్ కొట్టిస్తాయన్నారు. ‘గేమ్ ఛేంజర్’ హై ఓల్టేజ్ మూవీ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. తనకు బాగా కనెక్ట్ అయిన నటుడు రామ్‌చరణ్ అని దర్శకుడు సుకుమార్ అన్నారు.
నటుడు ఎస్‌జే (S. J. Suryah) సూర్య మాట్లాడుతూ రామ్‌చరణ్‌పై ప్రశంసలు కురిపించారు. ‘చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్ నిజంగా కింగ్. ఎందుకంటే ఆయన ప్రవర్తన, మనసు, వ్యవహారశైలి, నడక, నటన అంతా కింగ్‌లా ఉంటుంది.
నా మొబైల్‌లో ఆయన నంబర్ ‘ఆర్.సి. ది కింగ్’ అని ఉంటుంది. నేను ఏది ఫీలవుతానో అదే మాట్లాడతా. ఆయనతో నటించడం చాలా సంతోషంగా ఉంది. అన్ని సన్నివేశాలకు నేనే డబ్బింగ్ చెప్పాను. హిందీలో కూడా చెప్పాను. ఎందుకంటే ఆ ఎనర్జీని ఈ మూవీ, అందులోని సన్నివేశాలు నాకు ఇచ్చాయి. అదే ఎనర్జీ మీకు తెరపై కనపడుతుంది’ అని అన్నారు.