బాలకృష్ణ ఇంటికి మార్కింగ్: రాష్ట్ర ప్రభుత్వం పట్టుదల?
హైదరాబాద్‌లో రోడ్డు విస్తరణ కోసం నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటికి మార్కింగ్ వేశారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా జానారెడ్డి ఇంటికి కూడా మార్కింగ్ వేయడంతో ఇద్దరు నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
photo credit-aha unstoppable 4
హైదరాబాద్ లో రోడ్డు విస్తరణ పనుల కోసం నటుడు, ఏపీ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటికి మార్కింగ్ వేశారు అధికారులు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ క్రమంలో రోడ్ల డివైనింగ్ లో భాగంగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో ఉన్న బాలకృష్ణ ఇంటికి, బంజారాహిల్స్ లో రోడ్ నంబర్ 12 లోని జానారెడ్డి ఇంటి కాంపౌండ్ కి మార్కింగ్ వేశారు అధికారులు. బాలకృష్ణ ఇంటికి సుమారు ఆరు ఫీట్ల వరకు మార్కింగ్ వేశారు సిబ్బంది. అయితే తమ ఇళ్లకు మార్కింగ్ వేయడంపై జానారెడ్డి, బాలకృష్ణ అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
కేబీఆర్ పార్కు రోడ్డు విస్తరణ పనులు చాలా మంది ప్రముఖులను తీవ్ర మనస్తాపానికి గురి చేస్తున్నాయి. రోడ్ల వైడెనింగ్ కోసం 87 ఆస్తులను సేకరిస్తున్నారు. అందులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి, సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, అల్లు అర్జున్ మామ కె.చంద్రశేఖర్‌రెడ్డి, రెండు మీడియా సంస్థల యజమానులు, పలువురు బడా వ్యాపారవేత్తలు ఉన్నారని సమాచారం.
జూబ్లీహిల్స్ మహారాజ అగ్రసేన్ కూడలి నుంచి చెక్‌పోస్టు వరకు కేబీఆర్ పార్కు హద్దు పొడవునా రోడ్డు విస్తరణ పనులు, పార్కు చుట్టూ ఉన్న ఆరు కూడళ్ల అభివృద్ధి పనులతో ఈ పరిస్థితి నెలకొంది. ఏమైనప్పటికీ పనులను ముందుకు తీసుకెళ్లడంపై రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలగా ఉందని, బాధితులందరికీ నచ్చజెప్పి భూసేకరణకు ఒప్పిస్తుందని అధికారులు చెబుతున్నారు.
ఒమేగా ఆసుపత్రి సమీపంలో జానారెడ్డికి రెండు ప్లాట్లున్నాయి. వాటిని 43 అడుగుల మేర రోడ్డు కోసం సేకరించాల్సి వస్తోంది. దాదాపు 700 గజాలు ఆయన నష్టపోవచ్చని తెలుస్తోంది. ఎమ్మెల్యే బాలకృష్ణ ఇల్లు రోడ్డు నం.45, 92 కూడలి వద్ద ఉండటంతో రెండు వైపులా భూసేకరణ చేపట్టాల్సి ఉందని, దాదాపు సగం భూమి నష్టపోతారని అంచనా.
ఇప్పటికే ఈ ప్రాంతాలో ఓ దఫా మార్కింగ్ జరిగింది. టెండర్లు పూర్తికాగానే పనులు షురూ అవుతాయి. కేబీఆర్ పార్కుతో పాటు రోడ్ నంబర్12ను విస్తరించనున్నారు. 100 అడుగుల మేర ఉన్న రోడ్డును 120 అడుగులకు పెంచనున్నారు. బాలాజీ టెంపుల్ జంక్షన్ తోపాటు రోడ్డు విస్తరణకు ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.150 కోట్లను కేటాయించింది. ఈ పనులను కూడా వెంటనే పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
photo credit-aha unstoppable 4
ఈ క్రమంలో జూబ్లీ చెక్‌పోస్ట్‌వద్ద ఒకదానిపై మరో ఫ్లైఓవర్ రానున్నాయి. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి రోడ్డు నెంబర్ 45 వైపు వచ్చే ఫ్లైఓవర్ పై భాగంలో 2 లేన్లలో ఉంటుంది. కేబీఆర్ పార్కు నుంచి రోడ్ 36 వైపు వెళ్లే 4 లేన్ల ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్లనుంది.
వీటికి సంబంధించి అన్ని అడ్డంకులు తొలగినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్ల నిర్మాణంతో కేబీఆర్ పార్కు గ్రీనరీపై ప్రభావం పడుతుందని పలువురు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) ని ఆశ్రయించారు. ఎటువంటి ప్రభావం పడకుండా పనులు చేస్తామని, ఒకవేళ చెట్లు తొలగించాల్సి వస్తే వాటిని వేరేచోట ట్రాన్స్ ప్లాంట్ చేస్తామని అధికారులు చెబుతున్నారు.
బాలకృష్ణ తాజా చిత్రం విశేషానికి వస్తే...నందమూరి బాలకృష్ణ నటిస్తున్న డాకు మహారాజ్ నుంచి టైటిల్ సాంగ్ శనివారం రిలీజైంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో బాలయ్యకి జోడీగా ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్నారు.
బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్న ఈ మూవీ జనవరి 12న సంక్రాంతికి కానుగా థియేటర్లలోకి రాబోతోంది. టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేయడం ద్వారా బాలయ్య లుక్‌తో పాటు కథ గురించి కూడా క్లారిటీ ఇచ్చేసింది. 1980లో ఛంబల్ ఏరియాలోని దోపిడీ ముఠాకి సంబంధించిన కథ ఇది.