- Home
- Sports
- Cricket
- వాళ్లిద్దరి మధ్య గొడవలు పోవాలంటే అదొక్కటే మార్గం : గంభీర్, కోహ్లీలకు యువీ కీలక సూచన
వాళ్లిద్దరి మధ్య గొడవలు పోవాలంటే అదొక్కటే మార్గం : గంభీర్, కోహ్లీలకు యువీ కీలక సూచన
IPL 2023: ఐపీఎల్ లో నాలుగు రోజుల క్రితం ముగిసిన లక్నో - బెంగళూరు మ్యాచ్ లో గొడవపడ్డ గౌతం గంభీర్, విరాట్ కోహ్లీలకు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కీలక సూచననిచ్చాడు.

టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్, మాజీ సారథి విరాట్ కోహ్లీలకు మధ్య ఉన్న గొడవ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. ఇది బహిర్గతమే. పదేండ్లుగా ఈ ఇద్దరూ ప్రతి ఐపీఎల్ లో నిత్యం వాదులాడుకుంటూనే ఉంటున్నారు. ఈ ఏడాది లక్నో - బెంగళూరు మ్యాచ్ లో కూడా ఈ గొడవ తారాస్థాయికి చేరింది.
అయితే ఈ వివాదంపై మాజీ క్రికెటర్లు భిన్నంగా స్పందిస్తున్నారు. భారత క్రికెట్ కు రెండు వరల్డ్ కప్ లు అందించిన టీమ్ లో సభ్యుడిగా ఉన్న గంభీర్.. వన్డే వరల్డ్ కప్ గెలిచిన సభ్యుడైన కోహ్లీలు ఇలా వాగ్వాదానికి దిగి క్రీడా స్ఫూర్తిని విఘాతం కలిగిస్తున్నారని చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఈ ఇద్దరూ గొడవలు మాని కలిసిపోవాలని సూచిస్తున్నారు.
తాజాగా టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కూడా ఈ విషయంపై స్పందించాడు. ఇదే విషయమై యువీ ట్విటర్‌లో స్పందిస్తూ.. ‘ఈ ఇద్దరి మధ్య వివాదాలు చల్లారాలంటే గంభీర్, కోహ్లీలతో ఓ సాఫ్ట్ డ్రింక్ యాడ్ చేయించాలి. అప్పుడు అదే వాళ్లిద్దరినీ చల్లగా ఉంచుతుంది. దీనిపై మీరేమంటారు..?’ అని ట్వీట్ చేశాడు.
యువీ చేసిన ఈ ఫన్నీ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఎవర్నీ నొప్పియ్యకుండా యువీ చేసిన ఈ ట్వీట్ ఫ్యాన్స్ ను అలరించడమే గాక ఇరువురు ఆటగాళ్ల ఫ్యాన్స్ కు కూడా ఈ సూచన తెగ నచ్చింది. యువీ సూచించిన మాదిరిగా అయినా ఈ ఇద్దరూ కలిస్తే అంతకంటే కావాల్సిందేముందని వాళ్లు కామెంట్స్ చేస్తున్నారు.
కాగా గంభీర్ - కోహ్లీ వివాదంపై ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైఖేల్ వాన్ కూడా స్పందించాడు. మైదానంలో ఆటగాళ్లు గొడవపడటం సహజమేనని, కానీ కోచ్ లు ఫీల్డ్ లోకి రావడం మంచిదికాదని గంభీర్ ను ఉద్దేశిస్తూ విమర్శలు చేశాడు.
వాన్ స్పందిస్తూ.. ‘మైదానంలో ఆటగాళ్లు గొడవపడటం సాధారణమే. ఇది ఆట మాత్రమే. ఇటువంటివి రోజూ జరుగవు. ఈ విషయంలో కోచ్ లు జోక్యం చేసుకోవడం నాకిష్టం ఉండదు. ఫీల్డ్ లో జరిగింది ఫీల్డ్ లోనే వదిలేయండి. ఇద్దరు ఆటగాళ్ల మధ్య గొడవను వాళ్లే పరిష్కరించుకోవాలి. కోచ్ లు డ్రెస్సింగ్ రూమ్ లో వ్యూహాలు రచించాలి..’ అని పేర్కొన్నాడు.