- Home
- Sports
- Cricket
- అందుకే దక్షిణాఫ్రికాలో ఓడాం.. వాళ్లు ఆడుంటే పరిస్థితి మరోలా ఉండేది.. టీమిండియా పేసర్ షమీ సంచలన వ్యాఖ్యలు
అందుకే దక్షిణాఫ్రికాలో ఓడాం.. వాళ్లు ఆడుంటే పరిస్థితి మరోలా ఉండేది.. టీమిండియా పేసర్ షమీ సంచలన వ్యాఖ్యలు
India vs South Africa: సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ ఓటమిపై తాజాగా భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ స్పందించాడు. ఈ సిరీస్ లో భారత బౌలింగ్ దళం మెరుగ్గా రాణించిందని.. కానీ...

ఇటీవలే ముగిసిన దక్షిణాఫ్రికాలో భారత జట్టు టెస్టులతో పాటు వన్డే సిరీస్ ను కూడా కోల్పోయింది. టెస్టు సిరీస్ లో భాగంగా సెంచూరీయన్ లో జరిగిన తొలి టెస్టులో గెలిచినా.. తర్వాత దక్షిణాఫ్రికా పుంజుకుని మిగిలిన రెండు టెస్టులను గెలుచుకుంది.
జోహన్నస్బర్గ్ తో పాటు కేప్టౌన్ టెస్టులను గెలిచి సిరీస్ ను 2-1తో గెలుచుకుంది. అయితే ఈ సిరీస్ లో భారత బ్యాటింగ్ పేలవంగా ఉన్నా బౌలర్లు మాత్రం అదరగొట్టారు. సిరీస్ ఆసాంతం దక్షిణాఫ్రికాను వణికించారు.
సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ ఓటమిపై తాజాగా భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ స్పందించాడు. సిరీస్ లో భారత బౌలింగ్ దళం అదరగొట్టిందని, కానీ బ్యాటింగ్ వైఫల్యాల వల్లే ఓడామని అన్నాడు.
ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షమీ మాట్లాడుతూ.. ‘అవును, మా బ్యాటింగ్ పేలవంగా ఉంది. అందుకే దక్షిణాఫ్రికాలో ఓడాం...’ అని అన్నాడు. ‘ఈ సిరీస్ లో మా బౌలింగ్ దళం అద్భుతంగా రాణించింది. సిరీస్ ఆసాంతం మేం మెరుగ్గా రాణించాం. ఇది జట్టుకు మంచి కలిగించేదే...
కానీ మా బ్యాటింగ్ బలహీనంగా ఉంది. ఒకవేళ బ్యాటర్లు మరో 50-60 పరుగులు ఎక్కువ చేసుంటే రెండు, మూడో టెస్టులలో కూడా ఫలితాలు మరో విధంగా ఉండేవి. అయితే ఈ సమస్యలను మేం త్వరలోనే పరిష్కరించుకుంటాం...’ అని వ్యాఖ్యానించాడు.
షమీ చెప్పినట్టు దక్షిణాఫ్రికా సిరీస్ లో భారత జట్టు ప్రదర్శన పేలవంగా ఉంది. ఈ సిరీస్ లో మన టాపార్డర్ బ్యాటర్లు చేసిన పరుగులను ఓసారి పరిశీలిస్తే.. ఓపెనర్ కెఎల్ రాహుల్ మూడు టెస్టులలో కలిపి 226 రన్స్ చేశాడు. ఇందులో తొలి టెస్టులో చేసిన 123 పరుగులు తప్ప ఆ తర్వాత అతడు ఐదు ఇన్నింగ్సులలో విఫలమయ్యాడు.
మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ చేసిన పరుగులు 225. సెంచూరియన్ లో తొలి ఇన్నింగ్సులో చేసిన 60 రన్స్ హయ్యస్ట్ స్కోరు. కానీ మిగిలిన ఇన్నింగ్సులలో 30 రన్స్ దాటలేదు.
ఇక టీమిండియా సీనియర్స్ ఛతేశ్వర్ పుజారా 6 ఇన్నింగ్సులలో కలిపి 124 పరుగులు చేస్తే.. రహానే 6 ఇన్నింగ్సులలో 136 రన్స్ చేశాడు.
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి.. నాలుగు ఇన్నింగ్సుల (రెండు టెస్టులే ఆడాడు) లో కలిపి 161 పరుగులు చేశాడు. ఇక టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్.. 6 ఇన్నింగ్సులలో 186 రన్స్ చేశాడు. అందులో మూడో టెస్టులో చేసిన సెంచరీ కూడా ఒకటి.
ఇదిలాఉంటే భారత బౌలింగ్ దళం జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ లు సిరీస్ లో రాణించారు. మూడు టెస్టులలోనూ దక్షిణాఫ్రికాను తొలి ఇన్నింగ్సులో ఆలౌట్ చేశారు. రెండో టెస్టులో భారత్ మరో 60 పరుగులు చేసి ఉంటే షమీ చెప్పినట్టే ఫలితం మరో విధంగా ఉండేది.