Year Ender 2024: టాప్ స్కోరర్ నుండి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వరకు.. ఐపీఎల్ 2024 రికార్డులు ఇవే
Year Ender 2024: 2024 ముగిసి కొత్త సంవత్సరం రావడానికి కొన్ని వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే, రాబోయే ఐపీఎల్ 2025కి ముందు గత ఐపీఎల్ లో సీజన్‌లో సాధించిన అద్భుతమైన రికార్డుల వివరాలు మీకోసం.
అత్యధిక మ్యాచ్ స్కోరు
ఐపీఎల్ 2024 లో అద్భుతమైన ఆటతో పలువురు ప్లేయర్లు రికార్డుల మోత మోగించారు. 2024 ఏప్రిల్ 15న, సన్‌రైజర్స్ హైదరాబాద్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతమైన ఆటతో పరుగుల వరద పారించాయి. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ టీమ్ ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ పరుగుల సునామీ తీసుకువచ్చింది. ట్రావిస్ హెడ్ దూకుడు బ్యాటింగ్ తో ఆర్సీబీ బౌలర్లకు దిమ్మదిరిగే షాకిచ్చారు.
ట్రావిస్ హెడ్ ఫోర్లు, సిక్సర్లతో బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. హెడ్ 41 బంతుల్లో 102 పరుగులు చేశాడు. అతని తోడుగా ఇతర ఆటగాళ్లు కూడా బ్యాట్ తో రాణించడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ 287 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఎస్ఆర్హెచ్ టీమ్ లోని హెన్రిచ్ క్లాసెన్ 31 బంతుల్లో 67 పరుగులు, అబ్ధుల్ సమద్ 10 బంతుల్లో 37 పరుగులు చేశారు. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ టీమ్ కూడా పరుగుల వరద పారించింది. దినేష్ కార్తీక్ (35 బంతుల్లో 83), ఫాఫ్ డు ప్లెసిస్ (28 బంతుల్లో 62) దూకుడుగా ఆడుతూ ఆర్సీబీ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. కానీ విరాట్ కోహ్లీ టీమ్ 262 పరుగులు మాత్రమే చేసింది. దీంతో బెంగళూరు టీమ్ హైదరాబాద్ టీమ్ చేతిలో 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే, ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి మొత్తం 549 పరుగులు చేశాయి.
మార్కస్ స్టోయినిస్ ఆధిపత్యం.. ఐపీఎల్ 2024లో టాప్-5 అత్యధిక వ్యక్తిగత స్కోర్లు
ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడుతున్న మార్కస్ స్టోయినిస్ చెన్నై సూపర్ కింగ్స్‌పై మర్చిపోలేని ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 63 బంతుల్లో సూపర్ సెంచరీతో 124 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో లక్నో టీమ్ సూపర్ విక్టరీ అందుకుంది. స్టోయినిస్ తన ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. ఐపీఎల్ 2024 నమోదైన అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఇదే.
స్టోయినిస్ తర్వాత రాజస్థాన్ రాయల్స్ పై విరాట్ కోహ్లీ చేసిన 113 పరుగులు ఐపీఎల్ 2024 లో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు. వీరి తర్వాత సునీల్ నరైన్ (109 పరుగులు), జానీ బెయిర్ స్టో (108 పరుగులు), రుగురాజ్ గైక్వాడ్ (108 పరుగులు) టాప్ 5 లిస్టులో ఉన్నారు.
సునీల్ నరైన్ బ్యాటింగ్, బౌలింగ్ విధ్వంస.. IPL 2024 లో అత్యంత విలువైన ఆటగాడు
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కీలక ఆటగాడిగా బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించాడు. అతని ప్రభావవంతమైన ప్రదర్శనలు అతనికి మూడుసార్లు అత్యంత విలువైన ఆటగాడి బిరుదును సంపాదించిపెట్టాయి. ఐపీఎల్ 2025 టైటిల్ ను కేకేఆర్ గెలుచుకోవడంలో సునీల్ నరైన్ అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్ ఇన్నింగ్స్ లు కీలక పాత్ర పోషించాయి. సునీల్ నరైన్ ఐపీఎల్ 2024 లో 488 పరుగులు చేయడంతో పాటు 17 వికెట్లు కూడా పడగొట్టాడు.
ఐపీఎల్ 2024లో అత్యధిక పరుగులు, వికెట్లు తీసుకున్న ప్లేయర్లు వీరే
ఐపీఎల్ 2024 లో చాలా మంది ప్లేయర్లు అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడారు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా కొనసాగుతున్న టీమిండియా స్టార్, రన్ మిషన్ విరాట్ కోహ్లీ మరోసారి ఐపీఎల్ 2024 లో పరుగుల వరద పారించాడు. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచాడు. కోహ్లీ 15 ఇన్నింగ్స్‌లలో 741 పరుగులు చేసి తన ఫామ్‌ను తిరిగి పొందాడు.
ఐపీఎల్ 2024 బౌలింగ్ విషయానికి వస్తే మరోసారి భారత బౌలర్ల హవా కొనసాగింది. పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్న హర్షల్ పటేల్ టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. అతను 14 ఇన్నింగ్స్‌లలో 24 వికెట్లు తీసుకున్నాడు. అతని తర్వాత వరుణ్ చక్రవర్తి (21 వికెట్లు), జస్ప్రీత్ బుమ్రా (20 వికెట్లు), టీ నటరాజన్ (19 వికెట్లు), హర్షిత్ రాణా (19 వికెట్లు)లు ఉన్నారు.
ఐపీఎల్ 2024 లో అత్యధిక 50లు, 100లు కొట్టిన ప్లేయర్లు వీరే
ఐపీఎల్ లో పరుగులు చేయడానికి పోటీ పడ్డ ప్లేయర్లు.. సెంచరీలు, హాఫ్ సెంచరీలతో వారి జట్లకు అద్భుతమైన విజయాలు అందించారు. ఐపీఎల్ 2024 లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన ప్లేయర్లలో విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, సంజూ శాంసన్ లు ముందున్నారు. వీరు ముగ్గురు సమంగా ఐదు అర్ధ శతకాలు సాధించారు. ఇక సెంచరీల విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ రెండు శతకాలు బాదాడు.
విరాట్ కోహ్లీ, రుగురాజ్ గైక్వాడ్, ట్రావిస్ హెడ్, సాయి సుదర్శన్, సునీల్ నరైన్, యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్, రోహిత్ శర్మ, మార్కోస్ స్టోయినిస్, సూర్యకుమార్ యాదవ్, జానీ బెయిర్ స్టో, విల్ జాక్స్ మొత్తం 13 మంది ప్లేయర్లు సెంచరీలు బాదారు.