అక్కడ శార్దూల్‌కు మంచి రికార్డు.. అందుకే తీసుకున్నారా..?
WTC Final 2023: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో భాగంగా జూన్ 7 నుంచి మొదలుకాబోయే తుది పోరుకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇందులో శార్దూల్ ఠాకూర్ పేరు కూడా ఉంది.

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం భారత సీనియర్ సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా.. ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. అయితే ఈ టీమ్ లో దాదాపు అందరూ బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ) లో ఉన్న ఆటగాళ్లే ఉన్నా రెండు మార్పులు చోటు చేసుకున్నాయి.
శ్రేయాస్ అయ్యర్ స్థానంలో అజింక్యా రహానే చోటు దక్కించుకోగా సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ లను సెలక్టర్లు పక్కనబెట్టారు. ఇంగ్లాండ్ లో పిచ్ లు పేసర్లకు ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించే పిచ్ పై రాణించేందుకు గాను నలుగురు పేసర్లతో పాటు మరో పేస్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ను కూడా జట్టులోకి తీసుకొచ్చింది.
గతేడాది ఇంగ్లాండ్ లోని బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన టెస్టులో ఆడిన శార్దూల్ ఆ తర్వాత పేలవ ప్రదర్శనలతో వన్డేలకే పరిమితమయ్యాడు. ఇటీవలే ముగిసిన బీటీటీలో కూడా అతడికి చోటు దక్కలేదు. కానీ అనూహ్యంగా డబ్ల్యూటీసీ ఫైనల్ లో సెలక్టర్లు అతడికి చోటు కల్పించారు.
Image credit: PTI
ఐపీఎల్ లో కూడా చెప్పుకునేంత గొప్ప ప్రదర్శనలు ఏమీ చేయకపోయినా శార్దూల్ కు ఇంగ్లాండ్ లో మంచి రికార్డు ఉంది. 2021లో భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన జట్టులో సభ్యుడు. ఆ సిరీస్ లో అతడు రెండు టెస్టులు ఆడాడు.
ఫస్ట్ టెస్టులో బ్యాటర్ గా విఫలమైనా బౌలింగ్ లో నాలుగు వికెట్లు తీశాడు. ఇక జూన్ 7న ఆస్ట్రేలియాతో జరుగబోయే ది ఓవల్ మైదానంలో శార్దూల్ కు మంచి రికార్డు ఉంది. ఓవల్ వేదికగానే జరిగిన మూడో టెస్టులో శార్దూల్ బాల్ తో పాటు బ్యాట్ తోనూ రాణించాడు.
నాలుగో టెస్టులో భాగంగా తొలి ఇన్నింగ్స్ లో 36 బంతుల్లోనే 57 పరుగులు చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా 72 బంతుల్లో 60 రన్స్ సాధించాడు. బౌలింగ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో 1 వికెట్ తీసిన అతడు రెండో ఇన్నింగ్స్ లో 8 ఓవర్లే వేసి 2 వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. .ఈ సిరీస్ లో శార్దూల్.. 2 మ్యాచ్ లలో 3 ఇన్నింగ్స్ ఆడి 117 పరుగులు చేయడం విశేషం.
ఇప్పుడు ఇదే ఓవల్ లో శార్దూల్.. 2021 నాటి ప్రదర్శన పునరావృతం చేస్తాడని భారత్ ఆశిస్తోంది. తుది జట్టులో కూడా అతడికి చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ గా అతడికి టీమ్ లో చోటు దక్కొచ్చు. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల ఫార్ములా ప్రకారం ఆడితే శార్దూల్ తప్పకుండా టీమ్ లో ఉంటాడు.