Mithali Raj: రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోనున్న మిథాలీ రాజ్..? మళ్లీ ఆడతానని హింట్
Mithali Raj: టీమిండియా మహిళా క్రికెట్ జట్టు మాజీ సారథి మిథాలీ రాజ్ తిరిగి గ్రౌండ్ లోకి అడుగుపెట్టనుందా..? ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన ఆమె దానిని తిరిగి వెనక్కి తీసుకోనుందా..?

సుదీర్ఘ కాలం పాటు భారత మహిళల జట్టుకు సారథ్యం వహించిన మిథాలీ రాజ్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నది. అయితే ప్రస్తుతం ఆమె తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనుందా..? మిథాలీ మళ్లీ బ్యాట్ పట్టనుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.
తాజాగా ఐసీసీ పోడ్కాస్ట్ ‘హండ్రెడ్ పర్సెంట్ క్రికెట్’ లో ఆమె మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. అయితే మిథాలీ ఆడేది అంతర్జాతీయ మ్యాచులలో కాదు. బీసీసీఐ వచ్చే ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన మహిళల ఐపీఎల్ లో..
బీసీసీఐ.. 2023లో ఆరు జట్లతో మహిళల ఐపీఎల్ ను ప్రారంభించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఇందులో ఆడాలని మిథాలీ ఆసక్తిగా ఉంది. ఆమె మాట్లాడుతూ.. ‘నేను ఆ ఆప్షన్ (తిరిగి ఆడటం) ను ఓపెన్ చేసి పెట్టుకున్నాను..
అయితే దానిమీద నేనింకా నిర్ణయం తీసుకోలేదు. మహిళల ఐపీఎల్ ప్రారంభం కావడానికి ఇంకా చాలా సమయముంది. మహిళల ఐపీఎల్ తొలి సీజన్ లో భాగమవడం ఉత్సాహంగా ఉంటుంది..’ అని ఆమె తెలిపింది.
పురుషుల ఐపీఎల్ విజయవంతం కావడంతో మహిళలకు కూడా ఇలాంటి లీగ్ ను ప్రారంభించాలని బీసీసీఐ మీద ఒత్తిడి పెరుగుతున్నది. దీంతో ఎట్టకేలకు బీసీసీఐ.. వచ్చే ఏడాది దీనిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నది. మహిళలకు ఉమెన్స్ టీ20 ఛాలెంజ్ నిర్వహిస్తున్నా అది అంతగా విజయవంతం కావడం లేదు.
ఐపీఎల్ లో ఫ్రాంచైజీ ఓనర్లు కూడా మహిళల ఐపీఎల్ పై ఆసక్తిగా ఉన్నారట. ఆరు జట్లతో ప్రారంభించబోయే ఈ జట్లను కొనుగోలు చేసేందుకు వాళ్లే ఎదురుచూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరి మిథాలీ కోరిక తీరుతుందా..? ఆమె తొలి మహిళల ఐపీఎల్ ఆడుతుందా..? లేదా..? అనేది కొద్దిరోజుల్లో తేలనుంది.