- Home
- Sports
- Cricket
- అక్షర్ ను ఎందుకు పంపారు..? డీకే ఉన్నాడుగా.. ఇది చెత్త నిర్ణయం.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
అక్షర్ ను ఎందుకు పంపారు..? డీకే ఉన్నాడుగా.. ఇది చెత్త నిర్ణయం.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
IND vs SA T20I: ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య కటక్ లోని బారాబతి స్టేడియంలో ఆదివారం జరిగిన రెండో టీ20 లో భారత జట్టు వైఫల్యాలతో మరో పరాజయం మూటగట్టుకుంది.

కటక్ మ్యాచ్ లో టీమిండియా అనుసరించిన పలు వ్యూహాలపై భారత క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇండియా ఇన్నింగ్స్ చివర్లో దినేశ్ కార్తీక్ కు బదులు అక్షర్ పటేల్ ను ముందుగా పంపడం.. బౌలర్లను సరిగా ఉపయోగించుకోకపోవడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆదివారం నాటి మ్యాచ్ లో 13వ ఓవర్లో హార్ధిక్ పాండ్యా ఔట్ కాగానే అతడి స్థానంలో దినేశ్ కార్తీక్ రావాల్సి ఉంది. కానీ టీమ్ మేనేజ్మెంట్ అనూహ్యంగా అక్షర్ ను పంపింది.
కార్తీక్ కంటే ముందుగా వచ్చిన అక్షర్.. 11 బంతులు ఆడి 10 పరుగులు చేశాడు. నోర్జే బౌలింగ్ లో అతడు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే అక్షర్ ను కార్తీక్ కంటే ముందు పంపి ఏం సాధించారని టీమిండియా ఫ్యాన్స్ ట్విటర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
ఇదే విషయమై ట్విటర్ లో పలువురు ప్రశ్నిస్తూ.. ‘డీకే కంటే ముందు అక్షర్ ను పంపారు. ఒక ఆటగాడిని ఫినిషర్ గా తీసుకున్నంత మాత్రానా అతడు చివరి రెండు ఓవర్లకో మూడు ఓవర్లు ఉన్నప్పుడు పంపించడం కాదు. అంతకన్నా కాస్త ముందు పంపినా నష్టమేమీ లేదు..’
‘మీరు డీకే కంటే ముందుగా అక్షర్ పటేల్ ను ఎలా పంపుతారు..? అసలు ఎవరి ఐడియా ఇది..?’ ‘పాండ్యా ఔట్ అవగానే నేను డీకే వస్తాడని ఎదురుచూస్తున్నా. కానీ అక్షర్ వచ్చాడు. ఇది నాన్సెన్స్ కాకుంటే మరేంటి..? టీమ్ మేనేజ్మెంట్ వ్యూహాలు నిరాశపరుస్తున్నాయి..’
‘డీకే ను కాదని అక్షర్ ను ముందుకు ఎందుకు పంపారు. ఓ అర్థమైంది. కార్తీక్ బాగా ఆడతాడనా..?’ ‘మళ్లీ డీకేను కిందికి పంపుతున్నారు..? ఇదేం కెప్టెన్సీ పంత్..? మైండ్ ఉందా అసలు...?’ అని ఫైర్ అవుతున్నారు.
శ్రేయస్ అయ్యర్ ఔటయ్యాక వచ్చిన దినేశ్ కార్తీక్.. 21 బంతుల్లో 30 రన్స్ కొట్టాడు. చివరి రెండు ఓవర్లలో అతడు బ్యాట్ ఝుళిపించడంతో భారత్ ఆమాత్రం స్కోరైనా చేయగలిగింది. అయితే అక్షర్ ను ముందుకు పంపడంపై శ్రేయస్ స్పందించాడు. అది జట్టు వ్యూహంలో భాగమని తెలిపాడు.
అయ్యర్ మాట్లాడుతూ.. ‘ఇది ముందుగా మేం అనుకున్న వ్యూహమే. మాకింకా ఏడు ఓవర్లు మిగిలున్నాయి. ఆ సమయంలో అక్షర్ వస్తే సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేస్తాడు. ఆ టైమ్ లో హిట్టింగ్ కు దిగే బ్యాటర్ కోసం మేం చూడలేదు.
డీకే కూడా సింగిల్స్ తీస్తాడు. కానీ అతడు మాకు 15ఓవర్ల తర్వాత వస్తేనే భాగుంటుంది. అతడు మాకు ఆస్తి. ఈ మ్యాచ్ లో అతడు కూడా ఇన్నింగ్స్ ఆరంభించడానికి ఇబ్బంది పడ్డాడు.. ఈ గేమ్ లో వికెట్ కీలక పాత్ర పోషించింది..’ అని అన్నాడు.