- Home
- Sports
- Cricket
- ఇదే ఇండియాలో అయ్యుంటేనా! ఎంత రచ్చ చేసేవాళ్లు... ఆస్ట్రేలియాపై వీరేంద్ర సెహ్వాగ్ ఫైర్...
ఇదే ఇండియాలో అయ్యుంటేనా! ఎంత రచ్చ చేసేవాళ్లు... ఆస్ట్రేలియాపై వీరేంద్ర సెహ్వాగ్ ఫైర్...
ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరిగిన తొలి టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. ఇంకా పక్కాగా చెప్పాలంటే సరిగ్గా రెండు రోజుల ఆట కూడా సాగకుండానే 144.2 ఓవర్లలోనే ముగిసింది టెస్టు మ్యాచ్. మొదటి రోజు 15 వికెట్లు పడగా రెండో రోజు ఏకంగా 19 వికెట్లు పడ్డాయి..

144.2 ఓవర్లలో 34 వికెట్లు పడగొట్టిన ఇరుజట్ల బౌలర్లు, రికార్డు ప్రదర్శనలు నమోదు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 152 పరుగులకి పరిమితం కాగా ఆస్ట్రేలియా 218 పరుగులకి ఆలౌట్ అయ్యింది. రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 99 పరుగులకే చాపచుట్టేసింది...
Pat Cummins
ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ 5 వికెట్లు తీసి చెలరేగగా మిచెల్ స్టార్క్, బొలాండ్ చెరో రెండు వికెట్లు తీశారు. సఫారీ రెండో ఇన్నింగ్స్‌లో భువమా 29, జొండో 36, కేశవ్ మహారాజ్ 16 మాత్రమే సింగిల్ డిజిట్ స్కోరు దాటగలిగారు. నలుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు...
34 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన ఆస్ట్రేలియా 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. చచ్చీ చెడి సౌతాఫ్రికా జట్టు మరో 80-120 పరుగులు చేసి ఉంటే మ్యాచ్ రిజల్టే మారిపోయి ఉండేది. బౌలర్లకు పిచ్ నుంచి అద్భుతమైన సహకారం లభిస్తుండడంతో టాప్ క్లాస్ బౌలింగ్ యూనిట్స్ ఉన్న రెండు టీమ్స్ మధ్య సమరం ఒకటిన్నర రోజుల్లోనే ముగిసింది..
‘142 ఓవర్లు... సరిగ్గా రెండు ఓవర్లు కూడా మ్యాచ్ సాగలేదు. వీళ్లు పిచ్‌లు ఎలా ఉండాలో కబుర్లు చెబుతారు. ఇదే ఇండియాలో జరిగి ఉంటే, టెస్టు క్రికెట్ చచ్చిపోతుందనే, సంప్రదాయ ఫార్మాట్‌కి గోరీ కడుతున్నారని రచ్చ చేసేవాళ్లు. ఇవన్నీ కపట నాటకాలు... ’ అంటూ ట్వీట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్...
‘ఉపఖండ పిచ్‌ల్లో టెస్టు మ్యాచ్ రెండు రోజుల్లో ముగిసి ఉంటే వచ్చే రియాక్షన్స్ వేరేగా ఉండేవి. టెస్టు క్రికెట్‌ని చంపేస్తున్నారని తెగ గోల చేసేవాళ్లు..’ అంటూ మీమ్ పోస్టు చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్..
2021 ఫిబ్రవరిలో ఇండియా, ఇంగ్లాండ్ మధ్య అహ్మదాబాద్‌లో జరిగిన పింక్ బాల్ టెస్టు మ్యాచ్ రెండు రోజుల్లోనే ఫలితం తేలింది. ఈ సమయంలో స్పిన్ పిచ్‌ని తయారుచేసిన బీసీసీఐపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇలాంటి పిచ్‌ల కారణంగా టెస్టు క్రికెట్ చచ్చిపోతుందని ట్రోల్స్ వచ్చాయి...
ఏడాది తర్వాత ఆస్ట్రేలియా కూడా ఇలాంటి పిచ్‌తోనే విజయం సాధించింది.స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్ ఓడిపోతే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరే ఛాన్సులను సంక్లిష్టం చేసుకుంటుంది ఆస్ట్రేలియా. అందుకే సఫారీ జట్టును ఓడించేందుకే ఇలాంటి బౌలింగ్ ట్రాక్‌ని రూపొందించింది క్రికెట్ ఆస్ట్రేలియా..
Cricket Australia
ఆస్ట్రేలియాలో రెండు రోజుల్లో టెస్టు మ్యాచ్ ఫలితం తేలడం ఇది రెండోసారి. ఇంతకుముందు 1931లో మెల్‌బోర్న్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ కూడా రెండు రోజుల్లోనే ముగిసింది...
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారత్‌లో నాలుగు టెస్టు మ్యాచులు ఆడనుంది ఆస్ట్రేలియా. ఇండియాలో ఇలా టెస్టు మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసి, భారత జట్టు గెలిస్తే... ఆసీస్ క్రికెటర్లు, క్రికెట్ ప్రపంచం ఎలా స్పందింస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు అభిమానులు. ఇప్పుడు లేవని నోళ్లు, అప్పుడు భారత క్రీడా స్ఫూర్తిని ప్రశ్నించడానికి నిద్రలేస్తాయని అంటున్నారు టీమిండియా ఫ్యాన్స్..