కోహ్లీ ది గ్రేట్.. ప్రపంచ రికార్డు సృష్టించిన పరుగుల యంత్రం
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ తన జోరు కొనసాగిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో ఇప్పటికే వరుసగా రెండు హాఫ్ సెంచరీలు చేసిన కోహ్లీ.. తాజాగా ప్రపంచకప్ లో తోపు రికార్డు సొంతం చేసుకున్నాడు.
పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. టీ20లలో ఈ జనరేషన్ ఆటగాళ్లలో మరెవరికీ సాధ్యం కాని రికార్డును నమోదు చేశాడు. గత మ్యాచ్ లో ఊరించిన ఆ రికార్డును ఈ మ్యాచ్ లో పూర్తి చేసి రికార్డుల మొనగాడు అని నిరూపించుకున్నాడు.
ఈ మ్యాచ్ కు ముందు టీ20 ప్రపంచకప్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ రెండో స్థానంలో ఉండేవాడు. శ్రీలంక మాజీ ఆటగాడు మహేళ జయవర్దెనే.. టీ20 ప్రపంచకప్ లలో 31 మ్యాచ్ లలో 31 ఇన్నింగ్స్) 1,016 పరుగులు చేశాడు.
Image credit: PTI
ఈ రికార్డును కోహ్లీ ఇప్పుడు బద్దలుకొట్టాడు. బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో 16 పరుగుల వద్దకు చేరుకోగానే విరాట్ ఈ రికార్డును బ్రేక్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. జయవర్దెనేను అధిగమించి మరెవరికీ సాధ్యం కాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
జయవర్దెనేకు 1016 పరుగులు చేయడానికి 31 ఇన్నింగ్స్ అవసరం కాగా.. కోహ్లీకి మాత్రం 25 మ్యాచ్ లు (23 ఇన్నింగ్స్) లోనే ఈ ఘనతను అందుకోవడం గమనార్హం. ఈ జాబితాలో భారత సారథి రోహిత్ శర్మ నాలుగో స్థానంలో ఉన్నాడు.
జాబితాలో కోహ్లీ తొలి స్థానంలో నిలవగా.. జయవర్దెనే, క్రిస్ గేల్ (965), రోహిత్ శర్మ (921), తిలకరత్నే దిల్షాన్ (897), డేవిడ్ వార్నర్ (781), షకిబ్ అల్ హసన్ (729), జోస్ బట్లర్ (665) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఇక బంగ్లాదేశ్ తో అడిలైడ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో భారత్ దూకుడుగా ఆడుతున్నది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు వచ్చిన భారత్.. 12 ఓవర్లు ముగిసేసరికి 101 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (2) మరోసారి నిరాశపరచగా కెఎల్ రాహుల్ (50) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ (29*), సూర్యకుమార్ యాదవ్ (21*) క్రీజులో ఉన్నారు.