సచిన్ రికార్డు బ్రేక్ చేసిన కింగ్ కోహ్లీ.. అడిలైడ్ ఓవల్ అంటే ఆగేదేలే..
T20 World Cup 2022: ఆసియా కప్ లో ఫామ్ లోకి వచ్చి ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో వరుస హాఫ్ సెంచరీలతో దూకుడుమీదున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ.. తాజాగా మరో రికార్డు బద్దలుకొట్టాడు.

రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో పాత రికార్డుల దుమ్ము దులుపుతున్నాడు. ఆసియా కప్ కు ముందు వరుస వైఫల్యాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కున్న ఈ బ్యాటింగ్ మ్యాస్ట్రో.. కొద్దిరోజులు విరామం తర్వాత క్రీజులోకి వచ్చి మునపటి ఫామ్ ను అందుకుని మళ్లీ పాత కోహ్లీని పరిచయం చేస్తున్నాడు.
తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ పలు రికార్డులను బద్దలుకొట్టాడు. అందులో ఒకటి టీ20లలో అత్యధిక పరుగల వీరుడి రికార్డు కాగా మరొకటి లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ చెరిపేశాడు.
ఆస్ట్రేలియాలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లలో సచిన్ టెండూల్కర్ అందరికంటే ముందుండేవాడు. సచిన్.. అన్ని ఫార్మాట్లలో కలిపి 84 ఇన్నింగ్స్ లలో 3,300 పరుగులు చేశాడు. ఈ రికార్డు ఇప్పుడు చెరిగిపోయింది. బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా కోహ్లీ.. 3,350 పరుగులు సాధించాడు. ఇందుకు గాను సచిన్ 84 ఇన్నింగ్స్ తీసుకుంటే కోహ్లీ మాత్రం 68 ఇన్నింగ్స్ లలోనే చేరుకోవడం గమనార్హం.
దీనితో పాటు కోహ్లీ.. టీ20 ప్రపంచకప్ లలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కూడా జయవర్దెనే పేరిట ఉన్న రికార్డును చెరిపేసిన విషయం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్లలో జయవర్దెనే.. 31 మ్యాచ్ లలో 1,016 పరుగులు చేయగా కోహ్లీ మాత్రం.. 23 ఇన్నింగ్స్ (25 మ్యాచ్ లు) లలోనే 1,065 పరుగులు సాధించాడు.
ఇక ఆస్ట్రేలియాలో ఆడటం అంటే కోహ్లీకి చాలా ఇష్టం. అదీ అడిలైడ్ ఓవల్ లో అంటే పండుగే. అడిలైడ్ లో మొత్తం 10 మ్యాచ్ లు 14 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ.. 907 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు టెస్టులు ఆడి 8 ఇన్నింగ్స్ లో 509 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 1 హాఫ్ సెంచరీ ఉంది.
4 వన్డేలలో 244 రన్స్ చేశాడు. వన్డేలలో కూడా రెండు సెంచరీలు ఉండటం గమనార్హం. 2 టీ20 ఇన్నింగ్స్ లలో రెండు అర్థ సెంచరీలు చేసి 154 పరుగులు చేశాడు. మొత్తంగా అడిలైడ్ లో కోహ్లీ సగటు.. 68.09 గా ఉండటం గమనార్హం.