కోహ్లీ చెయ్యి వేస్తే.. ఫామ్ అందుకున్న కెఎల్ రాహుల్..
T20 World Cup 2022: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ తాను బ్యాటర్ గానే కాదు మెంటార్ గా కూడా అద్భుత ఫలితాలు ఇవ్వగలనని నిరూపించాడు. ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్న టీమిండియా ఓపెనర్ రాహుల్‌కు.. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ టిప్స్ ఇచ్చాడు.
రన్ మెషీన్ విరాట్ కోహ్లీ రెండు నెలల క్రితం ఫామ్ లేమితో తీవ్ర విమర్శలు ఎదుర్కున్నాడు. కానీ ఆసియా కప్ ప్రారంభానికి ముందు కొద్దిరోజుల పాటు విరామం తీసుకున్న కోహ్లీ.. అప్పట్నంచి మళ్లీ మునపటి ఫామ్ ను అందుకుని ఇక ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో దుమ్ము రేపుతున్నాడు. ఈ టోర్నీలో పాకిస్తాన్, నెదర్లాండ్స్ తో పాటు తాజాగా బంగ్లాదేశ్ లో కూడా అర్థ సెంచరీతో చెలరేగాడు.
ఇదిలాఉండగా బంగ్లాదేశ్ తో మ్యాచ్ కు ముందు కెఎల్ రాహుల్ దారుణంగా విఫలమయ్యాడు. పాకిస్తాన్, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా లతో మూడు ఇన్నింగ్స్ లలో కలిపి 22 పరుగులే చేశాడు. దీంతో రాహుల్ పై క్రికెట్ వర్గాలతో పాటు సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
రాహుల్ పని అయిపోయిందని.. అతడు ఐపీఎల్ కే తప్ప జాతీయ జట్టుకు పనికిరాడని.. ఈ ఓపెనర్ ను జట్టులోంచి తీసేయాలని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరైతే రాహుల్ ను జట్టు నుంచి తప్పించి రిషభ్ పంత్ ను తుది జట్టులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
అయితే బంగ్లాదేశ్ తో మ్యాచ్ కు ముందు రాహుల్.. కోహ్లీ సాయం కోరాడు. తనను వేధిస్తున్న అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతులను ఎదుర్కోవడమెలాగో విరాట్ ను సలహా అడిగాడు. కొద్దికాలం క్రితం కోహ్లీ కూడా ఈ బలహీనతతో తీవ్ర విమర్శలు ఎదుర్కున్న వాడే కావడం గమనార్హం.
అడిలైడ్ లో బంగ్లాదేశ్ తో మ్యాచ్ కు ముందు విరాట్ కోహ్లీకి రాహుల్ విలువైన బ్యాటింగ్ పాఠాలు చెప్పాడు. రాహుల్ ను వేధిస్తున్న అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతులను ఆడటంతో పాటు మ్యాచ్ కు మానసికంగా ఎలా సిద్ధమవ్వాలి..? బౌలర్లపై మైండ్ గేమ్ ఎలా ఆడాలనేదానిపై రాహుల్ కు టిప్స్ ఇచ్చాడు. అటాకింగ్ గేమ్ ఆడేందుకు కీలక సూచనలు చేశాడు.
కోహ్లీ చెప్పిన సూచనలను రాహుల్ తూచా తప్పకుండా పాటించాడు. బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో బౌలర్లంతా తన బలహీనతనే లక్ష్యంగా చేసుకుని బంతులు విసిరినా రాహుల్ మాత్రం బెదరలేదు. రాహుల్ కొట్టిన నాలుగు సిక్సర్లలో మూడు ఆఫ్ సైడ్ కొట్టినవే కావడం గమనార్హం. గత మూడు మ్యాచ్ లలో డబుల్ డిజిట్ స్కోరు చేరేందుకు తంటాలు పడ్డ రాహుల్.. ఈ మ్యాచ్ లో ఫిఫ్టీ కొట్టాడు.
కోహ్లీ ఇలా ఫామ్ కోల్పోయిన బ్యాటర్ కు అండగా నిలవడం ఇదే ప్రథమం కాదు. గతంలో ఐపీఎల్-14 సందర్భంగా ఇషాన్ కిషన్ తో పాటు వెంకటేశ్ అయ్యర్, యశస్వి జైస్వాల్ కు బ్యాటింగ్ టిప్స్ చెప్పాడు. ఆ తర్వాత వాళ్లు రెచ్చిపోయి ఆడారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.