- Home
- Sports
- Cricket
- ఈ ఐపీఎల్ చాలా స్పెషల్.. ఆ మూమెంట్ అయితే తరాలు గుర్తుంచుకుంటుంది.. పాక్ మాజీ ఆటగాడి కామెంట్స్
ఈ ఐపీఎల్ చాలా స్పెషల్.. ఆ మూమెంట్ అయితే తరాలు గుర్తుంచుకుంటుంది.. పాక్ మాజీ ఆటగాడి కామెంట్స్
IPL 2023: ఇటీవలే ముగిసిన ఐపీఎల్-16 లో రాబోయే తరాలు గుర్తుంచుకునే క్షణాలు ఎన్నో ఉన్నాయని పాకిస్తాన్ మాజీ క్రికెటర్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ అధ్యక్షుడు రమీజ్ రాజా అన్నాడు.

Image credit: PTI
రెండు నెలల పాటు ఉత్కంఠగా సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2023 ఎడిషన్ ఇటీవలే ఘనంగా ముగిసింది. గుజరాత్ - చెన్నైల మధ్య అహ్మదాబాద్ లో ముగిసిన ఫైనల్ తో ఈ సీజన్ కు ఎండ్ కార్డ్ పడింది. అయితే ఐపీఎల్ -16 ముగిసినా ఈ సీజన్ లో ఫ్యాన్స్, ఆటగాళ్లు రాబోయే కొన్నేళ్ల పాటు జాగ్రత్తగా భద్రపరుచుకునే క్షణాలు ఎన్నో ఉన్నాయని అంటున్నాడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ అధ్యక్షుడు రమీజ్ రాజా.
ఐపీఎల్ -16 ముగిసిన తర్వాత రమీజ్ రాజా తన యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ... ‘ఈ ఏడాది ఐపీఎల్ ఎల్లో (సీఎస్కే జెర్సీ కలర్), ధోనికి చిరకాలం గుర్తుండిపోతుంది. ధోని వినయం, అతడి మేనియా, కెప్టెన్సీ, ప్రశాంతత, వికెట్ కీపింగ్ రాబోయే కొన్ని తరాల పాటు గుర్తుండిపోతాయి.
ఈ సీజన్ లో పెద్ద ప్లేయర్లు సైతం బెంచ్ కే పరిమితమయ్యారు. డగౌట్ లో కొంతమంది దిగ్గజ ఆటగాళ్లు కోచింగ్ సిబ్బందిగా మారారు. కోచింగ్ టీమ్ లో పెద్ద పెద్ద పేర్లు ఉన్నప్పటికీ విజయంపై మాత్రం ఎవరికీ గ్యారెంటీ లేదు.
ఈ ఐపీఎల్ లో చిన్న చిన్న దేశాల ఆటగాళ్లు భాగా ప్రభావం చూపగలిగారు. వారికి ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ కూడా గుర్తుంచుకోదగ్గదే. ముఖ్యంగా వారి స్పిన్ విభాగం (రషీద్ ఖాన్, నూర్ అహ్మద్.. ఈ ఇద్దరూ అఫ్గాన్ దేశస్తులే) ఈ సీజన్ ను చాలా రోజుల పాటు గుర్తుంచుకుంటుంది.
అన్నింటికంటే మించి ఈ సీజన్ లో సీఎస్కే కెప్టెన్ ధోనిని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తన షర్ట్ మీద ఆటోగ్రాఫ్ అడగడం. ఐపీఎల్-16 లో ఇదే అత్యంత ప్రత్యేకమైన సందర్భం. ధోనికి ఇంతకుమించిన కాంప్లిమెంట్ లేదు అని చెప్పడంలో సందేహం లేదు..
ఈ సీజన్ ద్వారా కొత్తగా వెలుగులోకి వచ్చిన రింకూ సింగ్, యశస్వి జైస్వాల్ తో పాటు యువ ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్ తో పాటు ఎందరో యువ ఆటగాళ్లకు ఈ మూమెంట్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇది వారిలో స్ఫూర్తి నింపుతుంది. రాబోయే రోజుల్లో ఐపీఎల్ లో వీళ్లే సూపర్ స్టార్లుగా ఎదుగుతారు..’ అని రమీజ్ రాజా చెప్పుకొచ్చాడు.