- Home
- Sports
- Cricket
- వాళ్లు ముగ్గురు చాలా స్ట్రాంగ్.. గంగూలీ అందుకే రవిశాస్త్రిని పంపించాడు : పాకిస్థాన్ మాజీ సారథి సంచలన వ్యాఖ్యలు
వాళ్లు ముగ్గురు చాలా స్ట్రాంగ్.. గంగూలీ అందుకే రవిశాస్త్రిని పంపించాడు : పాకిస్థాన్ మాజీ సారథి సంచలన వ్యాఖ్యలు
Rashid Latif Comments on Indian Cricket Issues: టీమిండియాలో జరుగుతున్న పరిణామాలు మన దాయాది దేశానికి చెందిన మాజీ సారథి రషీద్ లతీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ వివాదానికంతటికీ టీ20 ప్రపంచకప్ సమయంలో బీజం పడిందని వ్యాఖ్యానించాడు.

భారత క్రికెట్ లో కొన్నాళ్లుగా జరుగుతున్న ఆఫ్ ది ఫీల్డ్ వ్యవహారాలు పాక్ సీనియర్, తాజా మాజీలకు సరుకుగా మారుతున్నాయి. ఇప్పుడు ఏ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ను చూసినా వారి దేశంలో ఆట కంటే వాళ్ల ఫోకస్ అంతా భారత క్రికెట్ కంట్రోల్ మీదనే ఉన్నట్టుంది.
గత కొన్నాళ్లుగా ఈ ట్రెండ్ కొనసాగుతుండగా.. తాజాగా ఆ జట్టు మాజీ సారథి రషీద్ లతీఫ్ కూడా ఈ జాబితాలో చేరాడు. రవిశాస్త్రి కోచ్ గా తప్పుకోవడం, దాని వెనుక గంగూలీ హస్తం... తదితర అంశాలపై ఆయన స్పందించాడు. రవిశాస్త్రికి టీమిండియా కోచ్ గా కొనసాగాలని ఉన్నా దానికి గంగూలీ మాత్రం సుముఖంగా లేడని వ్యాఖ్యానించాడు.
తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా లతీఫ్ మాట్లాడుతూ... ‘ఇదంతా టీమిండియా దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే భారత జట్టుకు హెడ్ కోచ్ గా ఉన్నప్పుడు మొదలైంది. కుంబ్లే అర్థాంతరంగా కోచ్ పదవి నుంచి దిగిపోవడంతో ఆ స్థానాన్ని రవిశాస్త్రి భర్తీ చేశాడు. కానీ గతంలో అతడు కోచ్ గా పనిచేసిన దాఖలాల్లేవు.
అతడి కాంట్రాక్టు 2021 టీ20 ప్రపంచకప్ దాకా ఉంది. కాంట్రాక్టును అతడు పెంచుకోవాలని చూశాడు. కానీ దానికి గంగూలీ సుముఖంగా లేడు. దాంతో గంగూలీ శాస్త్రికి.. ‘మీరు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది..’ అని చెప్పాడు. దాంతో శాస్త్రికి మరో ఆప్షన్ లేకుండా పోయింది. టీమిండియాలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు అప్పుడే బీజం పడింది.
ఇదే సమయంలో ఒకనాటి భారత జట్టులో కీలక సభ్యులైన సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్ లు చాలా స్ట్రాంగ్ టీమ్. కుంబ్లే అనంతరం గంగూలీ.. ద్రావిడ్ ను కోచ్ గా చేయాలనుకున్నాడు.
ఇక టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత క్రికెట్ లో జరుగుతున్న పరిణామాలు ఆందోళనకరంగా ఉన్నాయి. వ్యక్తుల మీద ఆరోపణలు, విమర్శల దాడులు భారత క్రికెట్ కు మంచిది కాదు. ఇవన్నీ చూస్తుంటే పాకిస్థాన్ జట్టులో 1990లో ఏదైతే జరిగిందో ప్రస్తుతం భారత క్రికెట్ లో కూడా అదే జరుగుతుందని అనిపిస్తున్నది..’ అని వాపోయాడు.
బీసీసీఐ-విరాట్ కోహ్లి వివాదం తర్వాత టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో రెండు గ్రూపులున్నాయని కూడా లతీఫ్ ఆరోపించాడు. ఈ ఆఫ్ ఫీల్డ్ టెన్షన్స్.. భారత జట్టు ఆటతీరుపై దారుణంగా ప్రభావం చూపుతున్నాయని లతీఫ్ అన్నాడు. దక్షిణాఫ్రికా లో టెస్టు, వన్డే సిరీస్ ఓటమే దానికి కారణమని చెప్పుకొచ్చాడు. ఆ సిరీస్ లో తాత్కాలిక సారథిగా నియమితుడైన కెఎల్ రాహుల్ కు ఈ టెన్షన్ లను తట్టుకునే శక్తి లేదని వ్యాఖ్యానించాడు.