టెస్టు క్రికెట్‌కి ఇది మంచిది కాదు... టీమిండియా విజయాన్ని తక్కువ చేసిన యువరాజ్ సింగ్...
తొలి టెస్టులో ఊహించని పరాజయం తర్వాత వరుసగా రెండు టెస్టులు గెలిచి, అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది టీమిండియా. రెండో టెస్టులో 317 పరుగుల భారీ తేడాతో గెలిచిన భారత జట్టు, మూడో టెస్టులో 10 వికెట్లు తేడాతో విజయాన్ని అందుకుంది. అయితే ఈ రెండు టెస్టుల్లోనూ పిచ్‌పై తీవ్రమైన విమర్శలు రావడం విశేషం...
దాదాపు 11 ఏళ్ల తర్వాత అహ్మదాబాద్‌లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్, కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. అతి తక్కువ బంతుల్లో ముగిసిన టెస్టు మ్యాచ్‌గా చరిత్ర తిరగరాసింది. దీనికి పిచ్ సరిగా లేకపోవడమేనని విమర్శలు వినిపిస్తున్నాయి...
‘రెండు రోజుల్లోనే మ్యాచ్ ముగిసింది... టెస్టు క్రికెట్‌కి ఇది ఏ మాత్రం మంచిది కాదు... ఇలాంటి పిచ్‌లపైన బౌలింగ్ చేసి ఉంటే అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ ఓ వెయ్యి, 800 వికెట్లు పడగొట్టేవారు... ఏదైతేనేమీ అద్భుతంగా బౌలింగ్ చేసిన అక్షర్ పటేల్‌కి అభినందనలు... అశ్విన్, ఇషాంత్‌లకు శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశాడు యువరాజ్ సింగ్...
యువీ వేసిన ట్వీట్, టీమిండియా విజయాన్ని, అశ్విన్, అక్షర్ పటేల్ బౌలింగ్‌ను తక్కువ చేస్తున్నట్టు ఉందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు... అశ్విన్ బౌలింగ్‌ను అనిల్ కుంబ్లే స్వయంగా మెచ్చుకున్నాడని, అది తెలీకుండా యువీ ఇలా మాట్లాడడం బాగోలేదని కొందరు కామెంట్లు చేస్తున్నారు..
ఆస్ట్రేలియాలో టీమిండియా 36 పరుగులకి ఆలౌట్ అయినప్పుడు పిచ్ గురించి ఏ విధమైన వ్యాఖ్యలు చేయని యువరాజ్ సింగ్ వంటి వాళ్లు, భారత జట్టు విజయానికి పిచ్ మాత్రమే కారణమైనట్టు వ్యాఖ్యానిస్తుండడం సరికాదంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు...
టెస్టు క్రికెట్‌లో ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కంటే తక్కువ సెంచరీలు చేసిన యువరాజ్ సింగ్... భారత జట్టు సాధించిన విజయాన్ని, అశ్విన్ బౌలింగ్‌ను తక్కువ చేసి మాట్లాడడం హాస్యస్పదం అంటూ ట్రోల్ చేస్తున్నారు అశ్విన్ అభిమానులు...
భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా అహ్మదాబాద్ పిచ్‌పై విమర్శలు చేశాడు. ‘టెస్టు మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసింది. ఇలాంటి పిచ్‌ను క్రికెట్ లవర్స్ ఏ మాత్రం ఇష్టపడరు... కానీ ఇలాంటి పిచ్‌పై ఇంగ్లాండ్ కంటే భారత జట్టు మంచి ఆధిక్యాన్ని కనబరిచింది....’ అంటూ ట్వీట్ చేశాడు ఇర్ఫాన్ పఠాన్..
తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ కూడా పిచ్‌పై కామెంట్ చేశాడు. ‘ఈ వికెట్‌పై రెండు జట్లూ బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డాయి. నాకు కూడా ఐదు వికెట్లు దక్కాయంటే ఈ పిచ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు...’ అంటూ కామెంట్ చేశాడు జో రూట్...
పింక్ బాల్ టెస్టులో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన రోహిత్ శర్మ మాత్రం పిచ్ బ్యాటింగ్‌కి సహకరిస్తోందంటూ వ్యాఖ్యానించాడు... ‘పిచ్‌లో ఎలాంటి లోపం లేదు. బాల్ చక్కగా బ్యాటుపైకి వస్తోంది... ఇంగ్లాండ్ త్వరగా వికెట్లు కోల్పోవడంతో ఒత్తిడికి లోనైంది. ఆ ప్రభావంతోనే తొందరగా ఆలౌట్ అయ్యింది. భారత ఇన్నింగ్స్‌లో కూడా ఇదే జరిగింది... అనవసర షాట్లకి వెళ్లి, వికెట్లను పడేసుకున్నాం...’ అంటూ కామెంట్ చేశాడు రోహిత్ శర్మ...
భారత సారథి విరాట్ కోహ్లీ కూడా పిచ్‌పై సానుకూలంగా స్పందించాడు. ‘పిచ్ బ్యాటింగ్‌కి చక్కగా సహకరిస్తోంది. బ్యాటు మీదకి బాల్ వస్తోంది. అయితే రెండు టీమ్ బ్యాట్స్‌మెన్ కూడా ఘోరంగా ఫెయిల్ అయ్యారు. వారి కంటే మా బౌలింగ్ బాగుండడం వల్ల మాకు విజయం దక్కింది...’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...
‘స్కిల్స్‌కి, ఓపికకి పరీక్ష పెట్టే ఇలాంటి వికెట్ ఒక్క మ్యాచ్‌కి అయితే ఒకే... కానీ ఇలాంటి వికెట్ నేను మళ్లీ చూడకూడదని కోరుకుంటున్నా... ఇంతమంది ఖిలాడీ ప్లేయర్లు కూడా ఆడకూడదు... బహుత్ అచ్చే... ఇండియా’ అంటూ హిందీలో ట్వీట్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కేవిన్ పీటర్సన్...