ఆడేది తక్కువ, గాయపడి కూసునేది ఎక్కువ... వీళ్ల ఫిట్‌నెస్ తగలేయ్యా...
సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే వంటి మాజీ క్రికెటర్లు, 35+ వయసు దాటిన తర్వాత కూడా ఏనాడూ కూడా రెస్ట్ కావాలని కోరుకున్నది లేదు. 2 దశాబ్దాలకు పైగా కెరీర్‌లో గాయం కారణంగా టీమ్‌కి అందుబాటులో లేని సందర్భాలు చాలా తక్కువ.. అయితే ప్రస్తుత క్రికెటర్లు మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధం..

Ravindra Jadeja
తాజాగా వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ఆరంభానికి ముందు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా మొదటి రెండు మ్యాచులకు అందుబాటులో ఉండడం లేదని ప్రకటించింది భారత క్రికెట్ బోర్డు...
ఈ ఏడాది రవీంద్ర జడేజా గాయం కారణంగా తప్పుకోవడం ఇది మూడోసారి. న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో గాయపడిన జడ్డూ, కోలుకోవడానికి చాలా సమయం తీసుకున్నాడు. సౌతాఫ్రికా టూర్‌కి కూడా దూరమయ్యాడు జడేజా...
Image credit: Getty
గాయం నుంచి కోలుకుని శ్రీలంకతో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్ ఆడిన జడేజా, ఐపీఎల్ 2022 సీజన్‌లో మరోసారి గాయపడ్డాడు... ఈ గాయం నుంచి కోలుకుని ఇంగ్లాండ్ టూర్‌కి అందుబాటులో ఉన్న జడ్డూ, వెస్టిండీస్ టూర్ ఆరంభానికి ముందు మరోసారి గాయపడ్డాడు...
KL Rahul
మరో భారత బ్యాటర్ కెఎల్ రాహుల్ కూడా కొన్నాళ్లుగా ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. సౌతాఫ్రికాతో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్ ఆరంభానికి ముందు గాయపడిన కెఎల్ రాహుల్, జర్మనీ వెళ్లి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు...
గాయం నుంచి కోలుకుని, వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కి అందుబాటులో వస్తాడని అభిమానులు ఆశిస్తున్న సమయంలో కరోనా బారిన పడ్డాడు. అసలే గాయం నుంచి పూర్తిగా కోలుకోని రాహుల్, ఇప్పుడు కరోనా పాజిటివ్‌గా తేలడంతో వెస్టిండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కి అందుబాటులో ఉండడం అనుమానంగానే మారింది...
Image credit: PTI
వీరితో పాటు సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌దీ ఇదే పరిస్థితి. గాయం కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ మొత్తానికి దూరమైన కుల్దీప్ యాదవ్, ఈ ఏడాది ఏడు నెలల్లో రెండు సార్లు గాయపడి, జట్టుకి దూరమయ్యాడు...
ఇక కెప్టెన్ రోహిత్ శర్మ గురించి చెప్పాల్సిన పనే లేదు. విరాట్ కోహ్లీ నుంచి టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్‌గా మూడు ఫార్మాట్లలోనూ సారథ్య బాధ్యతలు అందుకున్న రోహిత్ శర్మ... టీమ్‌కి అందుబాటులో ఉన్న సిరీస్‌ల కంటే లేని సిరీస్‌లే ఎక్కువ...
రోహిత్ శర్మ ఫిట్‌నెస్ కారణంగా ఈ ఏడాది ఇప్పటికే ఏడుగురు కెప్టెన్లనే మార్చేసింది బీసీసీఐ. ఇంకా మరో ఐదు నెలలు మిగిలి ఉండడంతో ఎంత మంది కొత్త కెప్టెన్లను చూడాల్సి వస్తుందోనని కంగారుపడుతున్నారు ఫ్యాన్స్...
వీళ్లే కాదు ఫిట్‌నెస్ ఫ్రీక్స్‌గా గుర్తింపు తెచ్చుకున్న జస్ప్రిత్ బుమ్రా, విరాట్ కోహ్లీ కూడా ఈ ఏడాది గాయాల కారణంగా జట్టుకి దూరం కావడం... అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వీళ్లు నిజంగానే గాయపడ్డారా? లేక బ్రేక్ తీసుకోవడానికి ఇలా గాయాన్ని అడ్డుపెట్టుకుంటున్నారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నవాళ్లూ లేకపోలేదు...