- Home
- Sports
- Cricket
- IPL2022: చిన్నోడు పెద్దోడు.. ఐపీఎల్ జట్లలో అత్యంత చిన్న, పెద్ద వయసున్న ఆటగాళ్ల జాబితా ఇదే
IPL2022: చిన్నోడు పెద్దోడు.. ఐపీఎల్ జట్లలో అత్యంత చిన్న, పెద్ద వయసున్న ఆటగాళ్ల జాబితా ఇదే
TATA IPL 2022: ముంబై వేదికగా జరుగుతున్న ఐపీఎల్ లో ఆయా జట్లు ఇప్పటికే దుమ్ము దులిపే ప్రదర్శనలు చేస్తున్నాయి. యువ ఆటగాళ్లు, సీనియర్ ప్లేయర్లతో క్రికెటర్లంతా తమ స్థాయికి తగ్గ ఆట ఆడుతూ అభిమానులను అలరిస్తున్నారు.

ఐపీఎల్ లో పలు జట్లలో చిన్నోడు పెద్దోడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఆయా జట్లలో అత్యంత చిన్న వయసు ఉన్న ఆటగాడు.. పెద్ద వయసు ఉన్న సీనియర్ క్రికెటర్ ఎవరో ఇక్కడ చూద్దాం.
చెన్నై సూపర్ కింగ్స్ : డాడీల జట్టుగా పేరొందిన సీఎస్కేలో అత్యంత పెద్ద వయసు ఉన్న ఆటగాడిగా ఎంఎస్ ధోని (40 ఏండ్ల 273 రోజులు) ఉన్నాడు. ఐపీఎల్ లో ధోని.. 223 మ్యాచులాడి 4,835 పరగులు సాధించాడు. ఇక అదే జట్టులో అత్యంత తక్కువ వయసున్న ఆటగాడిగా రాజ్యవర్ధన్ హంగర్గేకర్ (19 ఏండ్లు) ఉన్నాడు. హంగర్గేకర్ చెన్నై తరఫున ఇంకా అరంగేట్రం చేయలేదు.
ఢిల్లీ క్యాపిటల్స్ : ఈసారి ఎలాగైన కప్ కొట్టాలని ఆశిస్తున్న ఢిల్లీకి అత్యంత చిన్నవాడు యశ్ ధుల్.. (19 ఏండ్ల 146 రోజులు) కాగా పెద్ద వయసున్న ఆటగాడిగా డేవిడ్ వార్నర్ (35 ఏండ్ల 161 రోజులు) ఉన్నాడు. యశ్ దుల్ ను ఐపీఎవ్ వేలంలో రూ. 50 లక్షలకు దక్కించుకుంది ఢిల్లీ.. వార్నర్.. రూ. 6.5 కోట్లకు అమ్ముడయ్యాడు.
గుజరాత్ టైటాన్స్ : ఐపీఎల్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ జట్టులో అందరికంటే చిన్నోడు నూర్ అహ్మద్. అఫ్ఘనిస్తాన్ కు చెందిన నూర్ వయసు 17 ఏండ్ల 93 రోజులు కాగా అందరికంటే పెద్దోడు వృద్ధిమాన్ సాహా.. సాహా వయసు 37 ఏండ్ల 164 రోజులు.
కోల్కతా నైట్ రైడర్స్ : ఐపీఎల్ లో రెండు సార్లు ఛాంపియన్ కేకేఆర్ జట్టులో అశోక్ శర్మ (19 ఏండల్ 293 రోజులు) అందరికంటే చిన్నవాడు. ఈ మీడియం ఫాస్ట్ బౌలర్ ఇంకా నిరూపించుకోవాల్సి ఉంది. ఇక ఇదే జట్టులో అఫ్ఘనిస్తాన్ కు చెందిన మహ్మద్ నబీ (37ఏండ్ల 95 రోజులు) ఆ జట్టు తరఫున ఉన్నారు.
లక్నో సూపర్ జెయింట్స్ : గుజరాత్ టైటాన్స్ మాదిరిగానే ఐపీఎల్ లోకి కొత్తగా వచ్చిన లక్నో జట్టులో ఢిల్లీకి చెందిన మయాంక్ యాదవ్ (19 ఏండ్ల 293 రోజులు) ఉండగా.. అందరికంటే ఎక్కువ వయసున్న క్రికెటర్ ఆండ్రూ టై (35 ఏండ్ల 115 రోజులు)..
ముంబై ఇండియన్స్ : ఐపీఎల్ లో ఐదు సార్లు ఛాంపియన్ ముంబైలో అత్యంత తక్కువ వయసున్న ఆటగాడు బేబి ఏబీడీ గా పేరున్న డేవాల్డ్ బ్రెవిస్. బ్రెవిస్ వయసు 18 ఏండ్ల 342 రోజులు మాత్రమే. ఇదే జట్టులో అందరికంటే పెద్ద వయసున్న ఆటగాడు సారథి రోహిత్ శర్మ (34 ఏండ్ల 341 రోజులు)
పంజాబ్ కింగ్స్ : ఈ సీజన్ లో అంచనాలకు మించి రాణిస్తున్న పంజాబ్ లో అత్యల్ప వయసున్న క్రికెటర్.. రాజ్ బవ. అతడి వయస్సు 19 ఏండ్ల 145 రోజులు కాగా అందరికంటే పెద్దోడు గబ్బర్. శిఖర్ ధావన్ వయసు 36 ఏండ్ల 122 రోజులు.
రాజస్థాన్ రాయల్స్ : మునుపెన్నడూ లేని విధంగా అన్ని విభాగాల్లో పటిష్టంగా రాణిస్తున్న రాజస్థాన్ లో అందరికంటే తక్కువ వయసున్న క్రికెటర్ యశస్వి జైస్వాల్ (20 ఏండ్ల 99 రోజులు). రవి అశ్విన్ (35 ఏండ్ల 201 రోజులు) అందరికంటే పెద్దోడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : బెంగళూరులో అత్యల్ప వయసున్న క్రికెటర్ అనీశ్వర్ గౌతమ్ (19 ఏండ్ల 80 రోజులు) ఉంటే అధిక వయసున్న ఆటగాడు ఆ జట్టు సారథి ఫాఫ్ డుప్లెసిస్. డుప్లెసిస్ వయసు 37 ఏండ్ల 267 రోజులు.
సన్ రైజర్స్ హైదరాబాద్ : హైదరాబాద్ జట్టులో అందరికంటే చిన్న వయసు క్రికెటర్ అబ్దుల్ సమద్. సమద్ వయసు 20 ఏండ్ల 160 రోజులు. ఇక అందరికంటే పెద్ద వయసున్న క్రికెటర్ భువనేశ్వర్ కుమార్. భువీ వయసు 32 ఏండ్ల 60 రోజులు.