- Home
- Sports
- Cricket
- అతడు ఏదో చేస్తాడని ఆశించాం.. కానీ మాకు నమ్మకం పోయింది.. సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ షాకింగ్ కామెంట్స్
అతడు ఏదో చేస్తాడని ఆశించాం.. కానీ మాకు నమ్మకం పోయింది.. సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ షాకింగ్ కామెంట్స్
TATA IPL 2022 Live Updates: చెన్నై సూపర్ కింగ్స్ ఆ జట్టు కొత్తగా నియమించుకున్న సారథి రవీంద్ర జడేజాపై నమ్మకం కోలపోయిందా..? అంటే అవుననే సూచిస్తున్నాయి ఆ జట్టు హెడ్ కోచ్ వ్యాఖ్యలు..

డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్.. వరుసగా నాలుగు మ్యాచులలో ఓడి ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంటున్నది. నాలుగు వరుస ఓటముల సంగతి పక్కనబెడితే ఆ జట్టు కొత్తగా నియమించుకున్న సారథి రవీంద్ర జడేజా.. యాజమాన్యం పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోయాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.
తాజాగా శనివారం సన్ రైజర్స్ తో మ్యాచ్ ముగిశాక ఆ జట్టు హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వ్యాఖ్యలు గమినిస్తే ఇది నిజమనిపించకమానదు.
మ్యాచ్ అనంతరం ఫ్లెమింగ్ మాట్లాడుతూ... ‘మాకు ప్రతి గేమ్ కూడా ముఖ్యమే. కానీ వరుసగా నాలుగు ఓటములు మాకున్న నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో మేము చాలా మెరుగుపడాల్సిన అవసరం ఉందని గత నాలుగు మ్యాచులలో తేలింది.
సన్ రైజర్స్ తో మేము బాగానే ఆడాం. కానీ అదృష్టం మా వైపు లేదు. కీలక ఆటగాళ్ల అందుబాటుతో పాటు ఇంకా చాలా విషయాల మీద మేము దృష్టి సారించాల్సి ఉంది. ఈ విషయంలో మేము చాలా వెనుకబడి ఉన్నాం.
అయితే మా ఆటకు సంబంధించిన ప్రతి అంశం మాకు ఆందోళన కలిగిస్తున్నది. ఈ వరుస ఓటములు మాకు మా మీద నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తున్నాయి. ఇది చాలా ఆందోళనకరం. అయితే ఒకటో, రెండో మ్యాచులు గెలిస్తే ఈ ఒత్తిడంతా మాయమవుతుంది. కానీ ప్రస్తుతానికి మేము దానికి చాలా దూరంగా ఉన్నాము...’ అని వ్యాఖ్యానించాడు.
గత నాలుగు మ్యాచులలో సారథిగానే కాకుండా కెప్టెన్ గా కూడా రవీంద్ర జడేజా అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. నాలుగు సార్లు బ్యాటింగ్ కు వచ్చి 66 పరుగులు చేయగా.. బౌలింగ్ లో 13 ఓవర్లు విసిరి 1 వికెట్ మాత్రమే తీసుకున్నాడు.
ఇది కచ్చితంగా జడ్డూ ఒత్తిడిలో ఉన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. కెప్టెన్ కాకముందు చెన్నై మ్యాచులను ఒంటిచేత్తో మార్చేసిన జడ్డూ.. ఇప్పుడు మాత్రం దారుణంగా విఫలమవుతూ విమర్శలు ఎదుర్కుంటున్నాడు.
ఈ సీజన్ లో చెన్నై.. తొలి మ్యాచులో కేకేఆర్ చేతిలో ఓడింది. ఆ తర్వాత వరుసగా.. లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడింది. 2010 తర్వాత సీఎస్కే వరుసగా నాలుగు మ్యాచులు ఓడటం ఇదే తొలిసారి.