- Home
- Sports
- Cricket
- బ్రేక్ తీసుకోవడంలో తప్పేమీ లేదు.. కానీ ఇప్పుడంటేనే ఏదో తేడాగా ఉంది.. టీమిండియా కెప్టెన్లపై అజారుద్దీన్
బ్రేక్ తీసుకోవడంలో తప్పేమీ లేదు.. కానీ ఇప్పుడంటేనే ఏదో తేడాగా ఉంది.. టీమిండియా కెప్టెన్లపై అజారుద్దీన్
Mohammad Azharuddin: ఎక్కడ చూసినా అదే చర్చ.. ఏ ఇద్దరు క్రికెట్ అభిమానులను కలిసినా దాని మీదే డిబేట్. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల వ్యవహారం ఇప్పుడు భారత క్రికెట్ లో హాట్ కేక్. తాజాగా దీనిపై అజారుద్దీన్ కూడా స్పందించాడు.

పరిమిత ఓవర్ల క్రికెట్ లో టీమిండియాకు నాయకత్వం వహిస్తున్న రోహిత్ శర్మ, టెస్టు క్రికెట్ లో సారథ్య బాద్యతలను మోస్తున్న విరాట్ కోహ్లీల విరామాల పంచాయితీ అనవసర ఊహాగానాలకు తావిస్తున్నది. కారణాలేవైనా వీరి విశ్రాంతుల గోల.. భారత క్రికెట్ అభిమానులకు ఆందోళన కలిగిస్తున్నది.
తాజాగా ఇదే విషయమై భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ ఘాటుగా స్పందించాడు. ఈ ఇద్దరూ బ్రేక్ తీసుకోవడంలో తప్పేమీ లేదని, కానీ టైమింగే తీవ్ర అనుమానాలకు తావిచ్చే విధంగా ఉందంటూ పేర్కొన్నాడు.
ట్విట్టర్ వేదిగకా స్పందించిన అజారుద్దీన్.. ‘దక్షిణాప్రికా వన్డే సిరీస్ కు తాను అందుబాటులో ఉండనన విరాట్ కోహ్లీ బీసీసీఐని కోరాడు. అంతేగాక రోహిత్ శర్మ కూడా గాయం కారణంగా టెస్టుల నుంచి దూరమయ్యాడు.
అయితే ఆటగాళ్లు బ్రేక్ తీసుకోవడంలో సమస్యేమీ లేదు. కానీ బ్రేక్ తీసుకునే టైమ్ అనేది చాలా ముఖ్యం. ఇది అనవసర ఊహాగానాలకు తావిస్తున్నది..’ అని ట్వీట్ చేశాడు.
టీమిండియాకు మూడు ఫార్మాట్లలో కెప్టెన్లు గా వ్యవహరిస్తున్న ఈ ఇద్దరు సారథుల మధ్య కెప్టెన్సీ వివాదం చిచ్చు రేపిందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. గాయం కారణంగా రోహిత్ శర్మ, తన కూతురు పుట్టినరోజును కారణంగా చూపి విరాట్ కోహ్లీ ఒకరి కెప్టెన్సీ లో ఒకరు ఆడకుండా ఉన్నారు.
దీంతో ఇది భారత క్రికెట్ లో తీవ్ర చర్చకు తెరలేపింది. హిట్ మ్యాన్ సారథ్యంలో ఆడేందుకు విరాట్ కు అహం అడ్డు వస్తుందని రోహిత్ అభిమానులు అంటుంటే.. ఈ విషయంలో కోహ్లీకి బీసీసీఐ అన్యాయం చేస్తుందని విరాట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ ఇద్దరు వెటరన్స్ ఆటగాళ్ల అభిమానులు ఓ చిన్న సైజ్ యుద్ధమే నడుపుతున్నారు.
అయితే ఈ ఇద్దరి మధ్య విభేదాలు ఇప్పుడే వచ్చినవి కాదని, రెండేండ్లుగా బీసీసీఐ డ్రెస్సింగ్ రూమ్ లో ముంబయి వర్సెస్ ఢిల్లీ గా మారిందని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కెప్టెన్సీ నుంచి దిగిపోవద్దని స్వయంగా గంగూలీ చెప్పినా కోహ్లీ మాట వినిపించుకోలేదని, దీంతో రోహిత్ శర్మకు ఆ బాధ్యతలు అప్పజెప్పిన బీసీసీఐ.. ఇటీవలే వన్డే కెప్టెన్సీ కూడా అప్పగించింది. అప్పట్నుంచి వీళ్లిద్దరి మధ్య అభిప్రాయ భేదాలకు సంబంధించిన ఒక్కో వార్త బయటకు వస్తున్నది.
అయితే ఇవన్నీ పుకార్లే అని బీసీసీఐ కొట్టి పారేస్తున్నా.. నిప్పు లేనిదే పొగ రాదు కదా అని అభిమానులు అనుకుంటున్నారు. ఈ వివాదం చిలికి చిలికి గాలి వాన కాకముందే ఈ ఇద్దరిని కూర్చుండబెట్టి మాట్లాడిస్తే మంచిదని భారత క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.