సూర్యకు ఆకాశమే హద్దు.. మిస్టర్ 360పై హిట్‌మ్యాన్ ప్రశంసలు
టీ20లలో నెంబర్ వన్ బ్యాటర్ గా ఎదిగిన టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ పై భారత జట్టు సారథి రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. అతడికి ఆకాశమే హద్దు అని కొనియాడాడు.
ప్రత్యర్థి ఎవరు..? పిచ్ ఎలా ఉంది..? బాదడానికి ఇది కరెక్ట్ సమయమా కదా..? అనే సంబంధం లేకుండా వీరవిహారం చేస్తున్న టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ పై భారత జట్టు సారథి రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. సూర్య ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడని అన్నాడు.
ఇంగ్లాండ్ తో సెమీఫైనల్స్ మ్యాచ్ కు ముందు జరిగిన పాత్రికేయుల సమావేశంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ‘మీకు ఇది తెలుసో లేదో, సూర్య గతంలో చెప్పి ఉంటాడో లేదో నాకు తెలియదు. మేం 10-2 ఉన్నా, 100-2 ఉన్నా ఒకేవిధంగా ఆడతాడు. అందుకే అతడు గతేడాది టీ20 ప్రపంచకప్ నుంచి జట్టులో ఉంటున్నాడు.
వాస్తవానికి గతేడాది మాకు అంత గొప్ప టోర్నీ కాదు. కానీ ఆ తర్వాత నుంచి సూర్య ఎలా చెలరేగుతున్నాడో మీరందరూ చూస్తూనే ఉన్నారు. మీరంతా చెబుతున్నట్టు ఆకాశమే హద్దుగా సూర్య చెలరేగుతున్నాడు. సూర్య గతేడాది ప్రపంచకప్ తర్వాత నుంచి చాలా పరిణితితో కూడిన ఆట ఆడుతున్నాడు.
సూర్యకు పెద్ద గ్రౌండ్స్ లో ఆడటం చాలా ఇష్టం. అలా అయితే తనకు గ్యాప్స్ ఎక్కువగా ఉంటాయని, అలాంటి గ్రౌండ్స్ లో ఆడితే బాగుంటుందని గతంలో నాతో చెప్పాడు. సూర్య ఆడేప్పుడు ఒత్తిడంతా తనమీదే వేసుకుంటాడు.
ఎటైనా టూర్లకు వెళ్లేప్పుడు సూర్య పెద్దగా సూట్ కేసులు, బ్యాగులు తీసుకెళ్లడు. నిజానికి సూర్య దగ్గర ఎక్కువ సూట్ కేసులున్నాయి. అతడికి షాపింగ్ అంటే చాలా ఇష్టం (నవ్వుతూ). అందుకే అతడు పెద్దగా సూట్ కేసులు వెంట తీసుకురాడు..’ అని ఒత్తిడిలో కూడా సూర్య ఎలా ఆడతాడని అడిగినదానికి హిట్ మ్యాన్ సమాధానం చెప్పాడు.
భారత్-ఇంగ్లాండ్ మధ్య ఈనెల 10న అడిలైడ్ ఓవల్ వేదికగా రెండో సెమీస్ మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో గెలిచేందుకు ఇరు జట్లు తమ వ్యూహాలకు పదును పెట్టుకుంటున్నాయి. ఇండియాకు తాము షాకిస్తామని ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఇదివరకే వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య హోరాహోరి పోరు తప్పేలా లేదు.