- Home
- Sports
- Cricket
- Kieron Pollard: పొలార్డ్ నిర్ణయంపై నిరాశ వ్యక్తం చేస్తున్న విండీస్ క్రికెటర్లు.. కేకేఆర్ స్పిన్నర్ స్పందనిదే..
Kieron Pollard: పొలార్డ్ నిర్ణయంపై నిరాశ వ్యక్తం చేస్తున్న విండీస్ క్రికెటర్లు.. కేకేఆర్ స్పిన్నర్ స్పందనిదే..
Sunil Narine On Pollard Retirement: ఉన్నట్టుండి రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్న వెస్టిండీస్ సారథి కీరన్ పొలార్డ్ పై అతడి సహచర ఆటగాళ్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంత త్వరగా ఎందుకు అని నిరాశ చెందుతున్నారు.

సుమారు పదిహేనేండ్ల పాటు వెస్టిండీస్ క్రికెట్ లో స్టార్ ఆల్ రౌండర్ గా సేవలందించిన ఆ జట్టు మాజీ సారథి కీరన్ పొలార్డ్ నిర్ణయంపై సొంత జట్టు సభ్యులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
అతడిలో ఇంకా చాలా కాలం క్రికెట్ ఆడే సత్తా ఉన్నదని, వెస్టిండీస్ జట్టుకు పొలార్డ్ సేవలు మరింత కాలం అందించి ఉంటే బాగుండేదని భావిస్తున్నారు. పొలార్డ్ చిన్ననాటి స్నేహితుడు, సహచర ఆటగాడు సునీల్ నరైన్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
పొలార్డ్ రిటైర్మెంట్ నిర్ణయంపై నరైన్ స్పందిస్తూ... ‘పొలార్డ్ నిర్ణయం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. అతడు ఇంకొన్నాళ్లు విండీస్ జట్టుకు సేవలందిస్తే బాగుండేది. ఇంకా అతడిలో చాలా క్రికెట్ మిగిలుంది.
అయితే అతడు తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగాలనే నిర్ణయానికే వచ్చినట్టు ఉన్నాడు. టీ20లపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకుని ఉండొచ్చు. పొలార్డ్ కు భవిష్యత్ లో అంతా మంచే జరగాలని ఆశిస్తున్నా.
విండీస్ తరఫున ఆడటాన్ని పొలార్డ్ ఎంతగానో ప్రేమిస్తాడు. టీ20 క్రికెట్ మీద పొలార్డ్ కు మక్కువ ఎక్కువ. అందుకే ఈ ఫార్మాట్ లో అలుపన్నదే లేకుండా ఆడతాడు. ఇప్పటికీ అతడి ఆటను ప్రేమించే కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. రిటైర్ అయినంత మాత్రానా అతడి విన్యాసాలను మనం మరిచిపోలేం. ఇంకా చాలా సంవత్సరాల పాటు పొలార్డ్ మనను ఎంటర్టైన్ చేస్తాడు..’ అని నరైన్ తెలిపాడు.
పొలార్డ్ రిటైర్మెంట్ నిర్ణయంపై విండీస్ బోర్డు, పలువురు క్రికెటర్లు కూడా ఆశ్చర్యానికి గురైనట్టు కరేబియన్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. టీ20 ప్రపంచకప్ ముందున్న నేపథ్యంలో అతడు తీసుకున్న ఈ నిర్ణయంతో బోర్డు కూడా షాక్ లో ఉంది.
ఇదిలాఉండగా.. పొలార్డ్ రిటైర్మెంట్ పై పలువురు అంతర్జాతీయ క్రికెటర్లు కూడా స్పందిస్తున్నారు. అతడిది అద్భుతమైన కెరీర్ అని అతడికి శుభాకాంక్షలు చెబుతున్నారు. ముంబై ఇండియన్స్ మెంటార్, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా పొలార్డ్ కు శుభాకాంక్షలు తెలిపాడు.
2007లో విండీస్ వన్డే జట్టులో అరంగేట్రం చేసిన పొలార్డ్.. కరేబియన్ టీమ్ తరఫున 123 వన్డేలు, 101 టీ20లు ఆడాడు. వన్డేలలో 2,706 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలున్నాయి. బౌలింగ్ లో 55 వికెట్లు తీసుకున్నాడు. టీ20లలో 1,569 పరుగులు చేశాడు. బౌలింగ్ లో 42 వికెట్లు తీసుకున్నాడు. బుధవారం రాత్రి పొలార్డ్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.