ఆస్ట్రేలియాలో అతడుంటేనే టీమిండియాకు మంచిది : సునీల్ గవాస్కర్
T20I World Cup: వచ్చే నెల చివర్లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టులో ఎవరెవరుంటారు..? ఎవరికి చోటు దక్కుతుంది..? ప్రస్తుతం టీమిండియాతో పాటు భారత క్రికెట్ అభిమానుల్లో నడుస్తున్న చర్చ ఇదే..

ఆసియా కప్ లో ట్రోఫీ నెగ్గడమే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత జట్టు.. ఆ మేరకు విజయవంతం కాలేదు. సూపర్-4లో వరుసగా రెండు మ్యాచులను ఓడి ఇంటిముఖం పట్టింది. ఈ టోర్నీ తర్వాత భారత్ స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో సిరీస్ లు ఆడనుంది. ఆ తదుపరి ఆస్ట్రేలియా విమానమెక్కాల్సి ఉంది.
team india
అయితే టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియా లో జరగాల్సి ఉన్నందున అక్కడ ఎవరిని ఆడిస్తే మంచిదనేమీద టీమిండియాతో పాటు క్రికెట్ అభిమానుల్లో విస్తృత చర్చ నడుస్తున్నది. ముఖ్యంగా ఆసీస్ వంటి బౌన్సీ పిచ్ ల మీద ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో కాకుండా నలుగురు పేసర్లతో బరిలోకి దిగిందే బెటరనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.
Image credit: PTI
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తకిర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్ కోసం ఎంపిక చేయబోయే జట్టులో టీమిండియా ఆల్ రౌండర్ దీపక్ చాహర్ ను ఎంపికచేయాలని సూచించాడు. ఆస్ట్రేలియా వంటి పిచ్ లపై దీపక్ చాహర్ అవసరముందని అన్నాడు.
Image credit: Getty
గవాస్కర్ మాట్లాడుతూ.. ‘వచ్చే టీ20 ప్రపంచకప్ జట్టులో దీపక్ చాహర్ తప్పక ఉండాలి. నేనైతే అతడు జట్టులో తప్పకఉండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఆడుతున్నది ఆస్ట్రేలియాతో.. అక్కడ పిచ్ లపై ఎక్స్ట్రా బౌన్స్ ఉంటుంది. కొత్తబంతితో దీపక్ చాహర్ చెలరేగుతాడు.
బౌలింగ్ తో పాటు లోయరార్డర్ బ్యాటర్ గా కూడా చాహర్ కీలక ఆటగాడు. గతంలో టీమిండియా ఎప్పుడు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినా నలుగురైదుగురు పేసర్లతో వెళ్తుంది. వారిలో ఒక పేసర్ ను సరిగ్గా వాడుకోవడం లేదు. కానీ టీ20 వంటి హైఓల్టేజ్ టోర్నీలో భారత్ కు ఎంతో అవసరమవుతాడు..’అని అన్నాడు.
టీ20 ప్రపంచకప్ కు జట్టును టీమిండియా ఈనెల 15 లేదా16 తేదీలలో ప్రకటించే అవకాశముంది. ఈమేరకు సెలక్టర్లు తుది కసరత్తు మొదలుపెట్టారు. టీ20 ప్రపంచకప్ కు కనీసం 15 మంది సభ్యులను ఎంపిక చేసుకునే అవకాశముంటుంది. అయితే భారత్ కు పేసర్ల జాబితాలో ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్ సింగ్, అవేశ్ ఖాన్ ల పేర్లున్నాయి.
వీళ్లే గాక ఆసియా కప్ లో ఆడని మహ్మద్ షమీని కూడా పేసర్ గా ఎంపిక చేసే అవకాశముంది. ఆసియా కప్ లో బుమ్రా, హర్షల్ గాయపడటంతో షమీని ఎంపిక చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పలుమ్యాచ్ లలో కేవలం భువనేశ్వర్, అర్ష్దీప్ సింగ్ లతోనే భారత్ బరిలోకి దిగింది. ఈ క్రమంలో మనకు పేసర్ లేని లోటు స్పష్టంగా తెలిసొచ్చింది.
ఇక చాహర్ విషయానికొస్తే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో గాయపడ్డ అతడు ఐపీఎల్ ఆడలేదు. ఆ తర్వాత జూన్ లో వివాహం చేసుకున్నచాహర్.. ఇటీవలే జింబాబ్వే సిరీస్ తో రీఎంట్రీ ఇచ్చాడు. ఆసిరీస్ లో 5 వికెట్లు పడగొట్టిన చాహర్.. ఆసియా కప్ లో కూడా చోటు దక్కించుకున్నాడు. కానీ అఫ్గాన్ తో జరిగిన ఒక్క మ్యాచ్ లోనే ఆడాడు. ఆ మ్యాచ్ లో పెద్దగా రాణించలేదు.