బంగ్లాదేశ్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న ప్రిన్స్.. చెన్నైలో శుభ్ మన్ గిల్ సూపర్ సెంచరీ
Team India : భారత స్టార్ బ్యాటర్లు రిషబ్ పంత్ (109), శుభ్‌మన్ గిల్ (119 నాటౌట్) సూపర్ సెంచరీలతో చెలరేగడంతో భారత్ తొలి టెస్టులో బంగ్లాదేశ్ ముందు 515 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
Shubman Gill, Team India
Team India : చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతున్న భారత్-బంగ్లాదేశ్ తొలి టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు శుభ్‌మన్ గిల్ బాణాసంచలా పేలాడు. ఫోర్లు, సిక్సర్లు కొడుతూ బంగ్లాదేశ్ బౌలింగ్ ను చిత్తుచేశాడు. అద్భుతమైన బ్యాటింగ్ తో శుభ్‌మన్ గిల్ ఇప్పుడు తన టెస్ట్ కెరీర్‌లో ఐదవ సెంచరీని సాధించి విమర్శకుల నోరు మూయించాడు.
Rishabh Pant-Shubman Gill
287/4 వద్ద రెండో ఇన్నింగ్స్‌ను భారత్ డిక్లేర్ చేసింది. దీతో తొలి టెస్టులో బంగ్లాదేశ్‌కు భారత్ 515 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. 81/3 పరుగులతో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ కు రిషబ్ పంత్, శుభ్ మన్ గిల్ లు అద్భుతమైన ఆటతో మంచి స్కోర్ అందించారు.
చాలా కాలం తర్వాత టెస్టు క్రికెట్ ఆడుతున్న వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ (109), అలాగే శుభ్‌మన్ గిల్ (119 నాటౌట్) సూపర్ బ్యాటింగ్‌తో సెంచరీలు పూర్తి చేయడంతో మూడో రోజు కూడా భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.
Shubman Gill, Team India
రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ ఔట్ అయిన తర్వాత, శుభ్‌మన్ గిల్ ధనాధన్ బ్యాటింగ్ తో తన ఐదో టెస్టు సెంచరీని నమోదు చేశాడు. చెన్నై టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ 176 బంతుల్లో 119 పరుగులతో అజేయంగా నిలిచాడు. తన ఇన్నింగ్స్ లో శుభ్‌మన్ గిల్ 10 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు.
ఇదే టెస్టు మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ తొలి ఇన్నింగ్స్‌లో 8 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ కు చేరాడు. కానీ, రెండో ఇన్నింగ్స్ లో సెంచరీతో రికార్డుల మోత మోగించాడు.
Shubman Gill, Team India
'ప్రిన్స్' అంటూ ముద్దుగా పిలుచుకునే శుభ్‌మన్ గిల్ భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరంభం నుంచి మంచి టచ్‌లో కనిపించాడు. శనివారం బ్యాటింగ్ చేస్తున్నప్పుడు శుభ్‌మన్ గిల్ భీకర ఫామ్ కనిపించింది. శుభ్‌మన్ గిల్ టెస్టు కెరీర్‌లో ఇది ఐదో సెంచరీ. ఇప్పటివరకు గిల్ మూడు దేశాలపై టెస్టు సెంచరీలు సాధించాడు.
శుభ్‌మన్ గిల్ ఇప్పటివరకు బంగ్లాదేశ్, ఇంగ్లండ్‌లపై రెండేసి సెంచరీలు సాధించాడు. దీంతో పాటు ఆస్ట్రేలియాపై కూడా గిల్ సెంచరీ సాధించాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ తర్వాత టెస్ట్‌లో 3వ స్థానంలో బ్యాటింగ్ చేసే బాధ్యత శుభ్‌మన్ గిల్‌కు ఇచ్చారు. టెస్టు క్రికెట్‌లో 3వ నంబర్ బ్యాట్స్‌మెన్‌గా శుభ్‌మన్ గిల్ ఇప్పటివరకు 18 ఇన్నింగ్స్‌లు ఆడాడు.
ఈ ఇన్నింగ్స్ లలో శుభ్‌మన్ గిల్ 6, 10, 29*, 2, 26, 36, 10, 23, 0, 34, 104, 0, 91, 38, 52*, 110, 0, 119* పరుగులు చేశాడు. భారత్ తరఫున 26 టెస్టు మ్యాచ్‌లు ఆడిన శుభ్‌మన్ గిల్ మొత్తంగా 1611 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్‌లో శుభ్‌మన్ గిల్ 5 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు సాధించాడు. టెస్టు క్రికెట్‌లో గిల్ అత్యుత్తమ స్కోరు 128 పరుగులు.
Shubman Gill, Team India
కాగా, రెండవ ఇన్నింగ్స్‌లో భారత జట్టు కేవలం 67 పరుగుల స్కోరు వద్ద తన మొదటి 3 వికెట్లను కోల్పోయింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ తక్కువ పరుగులకే ఔట్ అయ్యారు. అయితే, శుభ్‌మన్ గిల్ ఒక ఎండ్ నుంచి భారత జట్టు వికెట్లు పడకుండా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఎండ్ లో రిషబ్ పంత్ బ్యాట్ తో అదరగొట్టాడు.
పంత్ తో కలిసి శుభ్‌మన్ గిల్ నాలుగో వికెట్‌కు 167 పరుగులు జోడించారు. రిషబ్ పంత్ కూడా శుభ్‌మన్ గిల్‌కు బాగా మద్దతు ఇచ్చాడు. రిషబ్ పంత్ మరోసారి తన పేలుడు బ్యాటింగ్‌తో అభిమానులను ఉర్రూతలూగించాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న చెన్నై టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 26 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ 128 బంతుల్లో 109 పరుగులతో సెంచరీ సాధించాడు. రిషబ్ పంత్ 85.16 స్ట్రైక్ రేట్‌తో కొనసాగిన పంత్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు.