- Home
- Sports
- Cricket
- రిజ్వాన్, బాబర్ తీరుపై పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ ఆగ్రహం.. ఈ జట్టుతో ప్రపంచకప్ కష్టమంటూ..
రిజ్వాన్, బాబర్ తీరుపై పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ ఆగ్రహం.. ఈ జట్టుతో ప్రపంచకప్ కష్టమంటూ..
Asia Cup 2022 Final: ఆసియా కప్-2022 ఫైనల్ లో లంక చేతిలో ఓడిపోవడంపై పాకిస్తాన్ స్పీడ్ స్టర్ షోయభ్ అక్తర్ తనదైన శైలిలో స్పందించాడు. పాక్ ఆటతీరుపై విమర్శలు గుప్పించాడు.

ఆసియా కప్ -2022 ఫైనల్లో పాకిస్తాన్.. లంక చేతిలో 23 పరుగుల తేడాతో దారుణంగా ఓడింది. ఫైనల్ పోరులో పాకిస్తాన్.. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో కూడా విఫలమైంది. బౌలింగ్ లో పవర్ ప్లే లో రాణించినప్పటికీ తర్వాత లయ తప్పింది. బ్యాటింగ్ లో కూడా రిజ్వాన్, ఇఫ్తికార్ మినహా మిగిలిన వారంతా విఫలమయ్యారు.
అయితే మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ స్పీడ్ స్టర్ షోయభ్ అక్తర్.. ఆ జట్టుపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. ఇటువంటి జట్టుతో టీ20 ప్రపంచకప్ లో ఆడటం కష్టమేనని పాకిస్తాన్ ఇప్పటికైనా మేల్కోవాలని పేర్కొన్నాడు.
మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిన తర్వాత అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా స్పందించాడు. అక్తర్ మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్ ఇకనైనా కాంబినేషన్లను మార్చాలి. ఓపెనర్ బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ ల జోడీ సరికాదు. బాబర్ ఓపెనర్ గా వద్దని నేను చాలారోజులుగా చెబుతున్నా..
మహ్మద్ రిజ్వాన్ టీ20 లలో నెంబర్ వన్ బ్యాటర్ గా ఉన్నాడు. కానీ అతడు ఆడుతున్న తీరు మాత్రం సరికాదు. ఫైనల్లో లంకతో మ్యాచ్ లో 50 బంతులాడి 50 పరుగులు చేయడం వల్ల ఉపయోగం లేదు. రిజ్వాన్ గత మ్యాచ్ లలో కూడా ఇదే ఆటను ఆడాడు.
పాకిస్తాన్ తుది జట్టులో కాంబినేషన్లు సెట్ కావడం లేదు. ఇప్పటికైనా పాక్.. పలు అంశాల మీద దృష్టి సారించాలి. ఫకర్ జమాన్, ఇఫ్తికార్ అహ్మద్, ఖుష్దిల్ ల ఆటతీరు ఏమాత్రం బాగోలేదు. వీరివల్ల పాకిస్తాన్ కు జరిగిన ఉపయోగమేమీ లేదు. కానీ ఈ టోర్నీలో శ్రీలంక మాత్రం అద్భుతంగా ఆడింది. చాలా గొప్ప జట్టు..’ అని పేర్కొన్నాడు.
ఈ మ్యాచ్ లో రిజ్వాన్.. 49 బంతుల్లో 55 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీ చేసినా అందుకు ఎక్కువ బంతులు వాడుకున్నాడు. దీంతో పాకిస్తాన్ స్కోరు నెమ్మదించింది. ఫైనల్ లో ఇఫ్తికార్ అహ్మద్ (31 బంతుల్లో 32) తో కలిసి 71 పరుగులు జోడించారు. కానీ ఇద్దరూ మరీ నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంతో మధ్య ఓవర్లలో పాక్ స్కోరు నెమ్మదించింది.
ఇక బాబర్ ఆజమ్ విషయానికొస్తే.. ఈ టోర్నీలో దారుణంగా విఫలమయ్యాడు. ఆసియా కప్ లో బాబర్ స్కోర్లు వరుసగా 10, 9, 14, 0, 30, 5 పరుగులు (మొత్తం 68) మాత్రమే చేశాడు.