- Home
- Sports
- Cricket
- రాత్రి రెండింటికి ఇంటికెళ్లి ఐదింటికి గ్రౌండ్‌కు వెళ్లేవాన్ని.. ఫిట్నెస్ గురించి నాకు చెబుతున్నారా? సర్ఫరాజ్
రాత్రి రెండింటికి ఇంటికెళ్లి ఐదింటికి గ్రౌండ్‌కు వెళ్లేవాన్ని.. ఫిట్నెస్ గురించి నాకు చెబుతున్నారా? సర్ఫరాజ్
IPL 2023: ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తన ఫిట్నెస్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. కొంచెం బొద్దుగా ఉన్నందున తన ఫిట్నెస్ గురించి శంకించాల్సిన పన్లేదని చెప్పుకొచ్చాడు.

దేశవాళీలో పరుగుల వరద పారిస్తూ జాతీయ జట్టులో అవకాశాలు దక్కక మాజీ క్రికెటర్లతో పాటు అభిమానుల మద్ధతు కూడగట్టుకుంటున్న క్రికెటర్లలో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ముందుంటాడు. ఈ ముంబై కుర్రాడు ఫార్మాట్ తో సంబంధం లేకుండా వీరబాదుడు బాదుతున్నాడు.
అయితే సర్ఫరాజ్ కు పదే పదే టీమిండియా సెలక్టర్లు మొండిచేయి చూపుతుండటానికి కారణం అతడి ఫిట్నెస్ సమస్యలే అని గతంలో వార్తలు వినిపించాయి. కొంచెం బొద్దుగా ఉండే సర్ఫరాజ్.. బరువు తగ్గితే ఛాన్స్ లు వస్తాయని కూడా వాదనలు వచ్చాయి. దీనిపై గతంలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా స్పందించాడు.
సెలక్టర్లను ఉద్దేశిస్తూ గవాస్కర్.. ‘మీకు స్లిమ్, ఫిట్ గా ఉన్న అబ్బాయిలు కావాలంటే ఫ్యాషన్ షోకు వెళ్లండి. మోడల్స్ కు బ్యాట్, బాల్ ఇచ్చి వాళ్లతో క్రికెట్ ఆడిస్తే సరిపోతుంది కదా..’అని వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తూనే.. ‘క్రికెట్ అంటే ఇదికాదు. అన్ని రకాల బాడీ, సైజులు ఉన్నవాళ్లు ఆడొచ్చు. కావాల్సింది వాళ్లు మెరుగైన ప్రదర్శనలు చేస్తున్నారా..? లేదా..? సెంచరీ చేసిన తర్వాత సదరు ఆటగాడు మళ్లీ ఫీల్డింగ్ చేస్తున్నాడా..? లేదా..? అనేది కావాలి. అంతేగానీ సన్నగా ఉండి కిలోమీటర్లకు కిలోమీటర్లు పరుగెత్తే వాళ్లు కాదు..’అని అన్నాడు.
తాజాగా ఈ కామెంట్స్ పై సర్ఫరాజ్ కూడా స్పందించాడు. తన ఫిట్నెస్ విషయంలో గవాస్కర్ కామెంట్స్ గురించి తనకు ఇటీవలే తెలిసిందని అయినా తన ఫిట్నెస్ గురించి చింతించాల్సిన పన్లేదని చెప్పుకొచ్చాడు. సర్ఫరాజ్ మాట్లాడుతూ.. ‘నేను కొద్దిరోజుల క్రితం రంజీలు ఆడాను. అప్పుడు మ్యాచ్ లు అయిపోయి అక్కడ్నుంచి ఇంటికి వచ్చేసరికి రాత్రి 2 అయ్యేది. మళ్లీ తెల్లవారుజామున ఐదింటికి లేచి గ్రౌండ్ కు వెళ్లి ప్రాక్టీస్ మొదలుపెట్టేవాడిని..
రన్నింగ్, ఇతర విషయాల్లో నేను ఫిట్నెస్ మార్కును అందుకుంటున్నా. ఆ విషయంలో నాకు ఇబ్బందే లేదు. డీసీ (ఢిల్లీ క్యాపిటల్స్) కూడా ఇటీవల మాకు 14 రోజుల ఫిట్నెస్ క్యాంప్ పెట్టింది. మా చేతుల్లో ఉన్నది మేం చేయగలం..’అని చెప్పాడు.
ఇక తనకు భారత జట్టులో అవకాశాలు రాకపోవడం గురించి సర్ఫరాజ్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతానికి నేను నా ఫామ్ గురించే దృష్టి పెడతా. దానిని నిలకడగా కొనసాగించాలి. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న సూర్య నా స్నేహితుడే. మేమిద్దరం స్వీప్ షాట్ బాగా ఆడగలం. అతడు టీమిండియాలోకి రావడానికి ఎన్నాళ్లు వేచి చూశాడో నాకు తెలుసు. నేను కూడా జాతీయ జట్టులో చోటు దక్కేవరకూ వేచి చూస్తా....’అని చెప్పుకొచ్చాడు.