సంజూ శాంసన్ కు అది లేదు.. అందుకే విఫలమవుతన్నాడు : కపిల్ దేవ్
Kapil Dev On Sanju Samson: టన్నులకొద్ది టాలెంట్ కలిగినా జాతీయ జట్టులో సరైన అవకాశాలు దక్కించుకోని ఆటగాళ్లలో సంజూ శాంసన్ ఒకడు. అయితే అతడి వైఫల్యాలకు గల కారణాలను కపిల్ దేవ్ వివరించారు.

ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ కు సారథ్యం వహిస్తున్న సంజూ శాంసన్ అడపాదడపా జాతీయ జట్టులోకి రావడం పోవడం తప్ప తన మార్కు ఆటను ఇంకా ఆడలేదు. ఇటవలే ముగిసిన ఐపీఎల్ లో రాణించినా అతడికి సెలెక్టర్లు మొండిచేయే చూపారు.
రాబోయే మూడు నెలల్లో ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు ధోని వలే వికెట్ కీపింగ్ కమ్ బ్యాటింగ్ చేసే ఆటగాడి కోసం సెలక్టర్లు వెతుకుతున్నారు. ఈ క్రమంలోనే ఏర్పాటు చేసిన దక్షిణాఫ్రికా తో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ లో శాంసన్ పేరు లేదు.
ఈ నేపథ్యంలో శాంసన్ విషయంలో భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించారు. అన్ కట్ తో ఆయన మాట్లాడుతూ..‘ప్రస్తుతం భారత జట్టులో నలుగురు వికెట్ కీపర్లు టీ20 ప్రపంచకప్ కు అందుబాటులో ఉన్నారు. ఆ నలుగురే రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్.
వికెట్ కీపింగ్ తో పాటు బ్యాటింగ్ చేయడంలో వీళ్లకు ఎవరి శైలి వారిదే. తమదైన రోజున ఒంటిచేత్తో మ్యాచ్ ను గెలిపించగల సత్తా వీళ్లకు ఉంది. ఒకరిని మిగ్గతా ముగ్గురితో పోలిస్తే మాత్రం ఎవరు నెంబర్ వన్ అనేది చెప్పడం కష్టం.
కానీ ఈ నలుగురిలో సంజూ శాంసన్ ను చూస్తే కోపంగా ఉంటుంది. ప్రతిభ పరంగా అతడు సూపర్ టాలెంటెడ్. తనదైన రోజున చెలరేగి ఆడతాడు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా మ్యాచ్ ను తన కంట్రోల్ లోకి తెచ్చుకోగల సామర్థ్యమున్నవాడు.
కానీ అతడిలో నిలకడ లేదు. అదే అతడి ప్రధాన లోపం. ఒకటి, రెండు మ్యాచుల్లో బాగా ఆడతాడు. తర్వాత మళ్లీ వరుసగా విఫలమవుతుంటాడు. అందుకే అతడు జాతీయ జట్టుకు ఎంపిక కావడం లేదు...’ అని తెలిపారు.
ఇటీవలే ముగిసిన ఐపీఎల్ సీజన్ లో 458 పరుగులు చేశాడు శాంసన్. అయితే గతంలో అతడికి భారత జట్టు తరఫున ఆడే అవకాశం వచ్చిన దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 13 టీ20 లలో ఆడి.. 174 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు.