RR vs KXIP: రాజస్థాన్ వర్సెస్ పంజాబ్... నేటి మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...
IPL 2020లో పటిష్టంగా కనిపిస్తున్న జట్లు రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్. గత సీజన్లలో వరుస పరాజయాలు చవి చూసిన ఈ రెండు జట్లు ఈ సీజన్‌లో కెప్టెన్సీలో మార్పు చేసి, అద్భుత ఫలితాలను దక్కించుకుంటున్నాయి. పంజాబ్ మొదటి మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో ఓడినా, రెండో మ్యాచ్‌లో బెంగళూరును చిత్తు చేసింది. రాజస్థాన్ మొదటి మ్యాచ్‌లో చెన్నైని ఓడించింది. నేటి మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...
కెఎల్ రాహుల్: కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న తర్వాత కెఎల్ రాహుల్ మరింత రెచ్చిపోతున్నాడు. బెంగళూరుతో మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన రాహుల్, నేటి మ్యాచ్‌లో పంజాబ్ ఇన్నింగ్స్‌లో కీలకం కానున్నాడు.
స్టీవ్ స్మిత్: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న బ్యాట్స్‌మెన్. నేటి మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ నుంచి మంచి ఇన్నింగ్స్ తప్పకుండా ఆశించవచ్చు.
మయాంక్ అగర్వాల్: ఈ యంగ్ బ్యాట్స్‌మెన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. మొదటి మ్యాచ్‌లో ఒంటి చేత్తో మ్యాచ్‌ను మలుపుతిప్పిన మయాంక్ అగర్వాల్, రెండో మ్యాచ్‌లోనూ కెఎల్ రాహుల్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు.
సంజూ శాంసన్: చెన్నైతో మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు సంజూ శాంసన్. 32 బంతుల్లోనే 9 సిక్సర్లు, ఓ ఫోర్‌తో 74 పరుగులు చేశాడు సంజూ. బౌండరీలు బాదడం కంటే ఈజీగా సిక్సర్ కొట్టే సంజూ శాంసన్ పంజాబ్ బౌలర్లను ఎలా ఎదుర్కొంటాడనేది చూడాలి.
రవి బిష్ణోయ్: ఈ అండర్ 19 సెన్సేషనల్ స్పిన్నర్, బెంగళూరు బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. నిలకడగా బ్యాటింగ్ చేస్తున్న ఆరోన్ ఫించ్‌ను బౌల్డ్ చేయడంతో పాటు మరో రెండు క్యాచులు కూడా అందుకున్నాడు. పంజాబ్ జట్టుకు ఆయుధంగా మారిన రవి బిష్ణోయ్, రాజస్థాన్ జట్టును ఏ విధంగా ఇబ్బంది పెడతాడో చూడాలి.
ఊతప్ప: టీ20 మ్యాచుల్లో సునామీ ఇన్నింగ్స్‌లు ఆడగల భారత బ్యాట్స్‌మెన్లలో రాబిన్ ఊతప్ప ఒకడు. అయితే గత మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఊతప్ప, నేటి మ్యాచ్‌లో ఎలా ఆడతాడనేది తర్వాతి మ్యాచుల్లో అతని స్థానాన్ని డిసైడ్ చేస్తుంది.
డేవిడ్ మిల్లర్: సౌతాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్‌కి ఐపీఎల్‌లో మంచి రికార్డు ఉంది. ఐపీఎల్ కెరీర్‌లో ఓ సెంచరీతో పాటు 9 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు మిల్లర్. గత మ్యాచ్‌లో డకౌట్ అయిన మిల్లర్ నుంచి నేటి మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్ ఆశించవచ్చు.
యశస్వి జైస్వాల్: ఈ అండర్ 19 యంగ్ సెన్సేషన్, మొదటి మ్యాచ్‌లో వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు. కాబట్టి నేటి మ్యాచ్‌లో జైస్వాల్‌కి అవకాశం వస్తే అతని నుంచి మంచి స్కోరు కచ్ఛితంగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు.
గ్లెన్ మ్యాక్స్‌వెల్: ఈ ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ నుంచి గత రెండు మ్యాచుల్లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు రాలేదు. అయితే మ్యాక్స్‌వెల్ ఫామ్‌లోకి వస్తే ఎలాంటి బౌలర్‌కైనా చుక్కలు కనబడాల్సిందే.
జోఫ్రా ఆర్చర్: గత మ్యాచ్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు బాది, రాజస్థాన్ స్కోరు 200+ దాటించాడు ఆర్చర్. బౌలింగ్‌లోనూ చెన్నై ఇన్నింగ్స్‌లో సెటిలైన బ్యాట్స్‌మెన్ డుప్లిసిస్‌ను కీలక సమయంలో అవుట్ చేశాడు. ఆర్చర్ నుంచి బౌలింగ్‌లో మరిన్ని వికెట్లు ఆశిస్తోంది ఆర్చర్.
మహ్మద్ షమీ: భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఐపీఎల్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. మొదటి మ్యాచ్‌లో 3 వికెట్లు తీసిన షమీ, రెండో మ్యాచ్‌లోనూ చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. షమీ బౌలింగ్ పంజాబ్‌కి బాగా కలిసి వస్తోంది.
క్రిస్‌గేల్: కీలక మ్యాచులకి అందుబాటులో ఉండేందుకు క్రిస్‌గేల్‌ను అస్త్రంగా దాచి పెడుతోంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు. నేటి మ్యాచ్‌లో గేల్ బరిలో దిగడం అనుమానమే. అయితే గేల్ దిగితే మ్యాచ్ స్వరూపమే మారిపోతుంది.
జోస్ బట్లర్: క్వారంటైన్ కారణంగా మొదటి మ్యాచ్‌కి దూరమైన బట్లర్, నేటి మ్యాచ్‌లో బరిలో దిగే అవకాశం ఉంది. బట్లర్ బరిలో దిగితే ఊతప్ప లేదా యశస్వి జైస్వాల్‌లలో ఒకరు తుది జట్టులో చోటు కోల్పోతారు.