- Home
- Sports
- Cricket
- తన సొంత ఆటగాళ్ల మీదే అరుస్తున్నాడు.. సహనం కోల్పోతున్నాడు.. ఇలాగైతే కష్టం: హిట్‌మ్యాన్ పై విమర్శలు
తన సొంత ఆటగాళ్ల మీదే అరుస్తున్నాడు.. సహనం కోల్పోతున్నాడు.. ఇలాగైతే కష్టం: హిట్‌మ్యాన్ పై విమర్శలు
Rohit Sharma: టీమిండియా సారథి రోహిత్ శర్మ సహనం కోల్పోతున్నాడా..? భారత జట్టు మాజీ కెప్టెన్ ధోని తర్వాత కెప్టెన్ కూల్ గా గుర్తింపు దక్కించుకున్న రోహిత్.. అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నాడా..?

క్రికెట్ లో భావోద్వేగాలు సహజం. ముఖ్యంగా ఒత్తిడి ఎక్కువగా ఉండే మ్యాచ్ లలో ఆటగాళ్లు వాళ్ల ఎమోషన్స్ ను అణుచుకోవడం కష్టం. అయితే మహేంద్ర సింగ్ ధోని వంటి అతి కొద్ది మంది మాత్రం ఎంతటి పరిస్థితుల్లో అయినా ముఖం మీద చిరునవ్వు చెదరకుండా ఉంటారు. అందుకే ధోనిని మిస్టర్ కూల్ అంటారు.
ధోని తర్వాత వచ్చిన భారత సారథి విరాట్ కోహ్లీ అలా కాదు. అతడికి దూకుడెక్కువ. కక్కొచ్చినా కళ్యాణమొచ్చినా ఆగదన్నట్టు.. కోహ్లీ కూడా ఏ ఎమోషన్ నూ తన లోపల దాచుకోడు. కోపమైనా, బాధైనా, సంతోషమైనా అక్కడే ఆ భావాన్ని వ్యక్తపరుస్తాడు.
rohit sharma
కోహ్లీ శకం ముగిశాక వచ్చిన రోహిత్ శర్మ అలా కాదు. ధోని వలే రోహిత్ కూడా కూల్ అండ్ కామ్ గోయింగ్ పర్సన్ అని పేరు తెచ్చుకున్నాడు. ఐపీఎల్ లో హై ఓల్టేజ్ మ్యాచ్ లలో కూడా రోహిత్ కామ్ గా ఉంటూనే పని కానిచ్చాడు. ఫీల్డ్ లో రోహిత్ ముఖంలో భావాలను పసిగట్టడం కష్టంగా ఉండేది. మిన్ను విరిగి మీద పడ్డా చలించని మనస్తత్వంతో ఉండేవాడు హిట్ మ్యాన్.
కానీ కొంతకాలంగా రోహిత్ ఆ గుర్తింపును చెరిపేసుకుంటున్నాడని అతడిని చూస్తే అనిపించకమానదు. ఆటగాళ్ల మీద అరవడం.. ఎవరైనా క్యాచ్ లు మిస్ చేస్తే వారి మీద అసహనంతో ఊగిపోవడం.. మ్యాచ్ ఓడిపోతున్నప్పుడు నిరాశ, నిస్పృహలు కలిగిన బావాలు రోహిత్ ముఖం మీద స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఆసియా కప్ లో ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. గ్రూప్ దశలో భాగంగా హాంకాంగ్ తో ఆడిన మ్యాచ్ లో భారత బౌలర్ల ప్రదర్శన రోహిత్ కు నచ్చలేదు. అది రోహిత్ ముఖంమీద ప్రస్పుటించింది. అంతకుముందు పాకిస్తాన్ ను ఆలౌట్ చేసిన భారత్.. హాంకాంగ్ బ్యాటర్ల వి సగం వికెట్లు మాత్రమే తీయగలిగింది. ఈ మ్యాచ్ లో 40 పరుగులతో భారత్ గెలిచినా.. మ్యాచ్ ముగిశాక రోహిత్ అసంతృప్తి బావంతో పెవిలియన్ చేరాడు.
ఇక పాకిస్తాన్ తో మ్యాచ్ లో అర్ష్‌దీప్ క్యాచ్ మిస్ చేసినప్పుడు రోహిత్ కోపంతో ఊగిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. లంకతో మ్యాచ్ లో కూడా ఫీల్డింగ్, క్యాచ్ లు మిస్ అయినప్పుడు రోహిత్.. ఫీల్డర్ల మీద అరిచాడు. మ్యాచ్ లో చివరివరకు టెన్షన్ ఫేస్ తో కనిపించాడు.
Rohit Sharma
ఇప్పుడు ఇదే విషయమై క్రికెట్ పండితులు రోహిత్ తీరుపై విమర్శలు కురిపిస్తున్నారు. గతంలో రోహిత్ ఇలా ఉండేవాడు కాదని.. ఇంతలా ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదని పలువురు అతడికి సూచిస్తున్నారు. తాజాగా ఇదే విషయమై పాకిస్తాన్ దిగ్గజ పేసర్ షోయభ్ అక్తర్ స్పందిస్తూ.. ‘రోహిత్ అసౌకర్యంగా కనిపిస్తున్నాడు. అతడు తన సొంత ఆటగాళ్లమీదే చీటికి మాటికి అరుస్తున్నాడు. చూస్తుంటే టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో ఏదో అనిశ్చితి ఉన్నట్టు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది..’అని అన్నాడు.
ప్రముఖ కామెంటేంటర్ హర్షాభోగ్లే ఈ విషయమ్మీద స్పందిస్తూ.. ‘రోహిత్ తన సహనాన్ని కోల్పోతున్నాడు. మ్యాచ్ లు జరిగేప్పుడు అతడి ముఖంలో టెన్షన్ కనిపిస్తున్నది. అంతలా చింతించాల్సిన అవసరం లేదు...’అని తెలిపాడు.