రోహిత్ కోహ్లీ : అందరిచూపు ఆ ఇద్దరిపైనే.. రికార్డుల వేటలో రో కో !
India vs Australia : భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌తో టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి యాక్షన్‌లోకి వస్తున్నారు. ప్రపంచకప్ 2027కు బాటలు వేస్తూ రికార్డుల వేటను మొదలుపెడుతున్నారు. దీంతో ఈ సిరీస్ మరింత ఆసక్తిని పెంచుతోంది.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎంట్రీతో ఫుల్ జోష్ !
పెర్త్‌లో ఆదివారం నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో మూడు మ్యాచ్ లను ఆడనున్నాయి. భారత జట్టు సీనియర్ స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి యాక్షన్‌లోకి వస్తున్నారు. రోకో జోడీ ఇక్కడి నుంచే 2027 ఐసీసీ ప్రపంచకప్ ప్రయాణానికి శ్రీకారం చుట్టనుంది.
మార్చిలో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత ఇది ఇద్దరికీ భారత్ జెర్సీలో మొదటి సిరీస్. ఈ ఏడాది ఇంగ్లాండ్ పర్యటనకు ముందు టెస్టుల నుంచి వీరిద్దరూ రిటైర్మెంట్ ప్రకటించారు. ఇప్పుడు వీరి రికార్డుల వేట మరోసారి అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
2027 ప్రపంచకప్ దిశగా రోకో జోడీ తొలి అడుగు
ఈ సిరీస్ రోహిత్, కోహ్లీలకు కీలకం. 38 ఏళ్ల రోహిత్, 36 ఏళ్ల విరాట్.. వయసు, ఫిట్‌నెస్, ఫామ్ అంశాలు ఈ సిరీస్‌లో పరీక్షను ఎదుర్కొంటాయి. రాబోయే వన్డే ప్రపంచ కప్ భారత జట్టులో భాగంగా వీరిద్దరిని చూడటం లేదనే చర్చ నేపథ్యంలో ఈ సిరీస్ లో రాణించడం కీలకం కానుంది.
భారత్‌కు ఈ సిరీస్ తర్వాత వన్డేలు తక్కువగా ఉన్నాయి. వీరి ప్రదర్శన 2027 ప్రపంచకప్ దాకా కొనసాగుతుందా అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. యంగ్ బ్యాటర్లు యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రన్ సింగ్, తిలక్ వర్మ వంటి ప్లేయర్లు అద్భుతమైన ప్రదర్శనలతో ఈ జంట భవిష్యత్తుపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి.
రోహిత్ శర్మ రికార్డుల వేట
రోహిత్ శర్మ ఇప్పటివరకు 499 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 19,700 పరుగులు చేశారు. ఆయన సగటు 42.18. తన కెరీర్ లో 49 సెంచరీలు, 108 హాఫ్ సెంచరీలు సాధించారు. అయితే, మరో 54 పరుగులు చేస్తే, సౌరవ్ గంగూలీ (11,221 పరుగులు) రికార్డును అధిగమించి భారత వన్డే చరిత్రలో మూడవ అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా ఘనత సాధిస్తారు. ప్రస్తుతం రోహిత్ 273 వన్డేల్లో 11,168 పరుగులు చేశారు.
ఈ సిరీస్ లో 300 పరుగులు చేస్తే ఆయన 20,000 అంతర్జాతీయ పరుగుల క్లబ్‌లోకి ఎంట్రీ ఇస్తారు. ఇది సాధించిన 14వ ప్లేయర్, భారత్ నుండి నాల్గో ఆటగాడిగా రోహిత్ నిలుస్తారు. అలాగే, ఇంకా ఒక సెంచరీ చేస్తే ఆయన 50వ అంతర్జాతీయ సెంచరీని నమోదు చేస్తారు. ఇప్పటి వరకు భారత్ నుంచి సచిన్ టెండుల్కర్ (100), విరాట్ కోహ్లీ (82) మాత్రమే రోహిత్ కంటే ముందున్నారు.
అలాగే, రోహిత్ శర్మ ఇప్పటికే 344 సిక్సులు బాదాడు. మరో 8 సిక్సులు కొడితే పాకిస్తాన్ ఆటగాడు షాహిద్ అఫ్రిదీ (351)ను అధిగమించి వన్డేల్లో అత్యధిక సిక్సులు కొట్టిన ప్లేయర్ గా ఘనత సాధిస్తాడు.
విరాట్ కోహ్లీ కొత్త చరిత్ర
విరాట్ కోహ్లీ ప్రస్తుతం 302 వన్డేల్లో 14,181 పరుగులు చేశారు. ఆయన సగటు 57.88. ఇప్పటివరకు 51 సెంచరీలు, 74 హాఫ్ సెంచరీలు సాధించారు. మరో 54 పరుగులు చేస్తే శ్రీలంక లెజెండ్ కుమార సంగక్కర (14,234 పరుగులు)ను అధిగమించి వన్డేల్లో రెండవ అత్యధిక పరుగుల బ్యాట్స్‌మన్ అవుతారు.
పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆయన 18,369 పరుగులు (ODI 14,181 + T20I 4,188) చేశారు. సచిన్ టెండుల్కర్ మొత్తం 18,436 పరుగులు చేశారు. కేవలం 68 పరుగులు చేస్తే కోహ్లీ సచిన్‌ను అధిగమించి వైట్‌బాల్ క్రికెట్ లో అత్యధిక పరుగుల ప్లేయర్ గా నిలుస్తారు.
అలాగే ఇంకా ఒక సెంచరీ చేస్తే ఆయన ఒక ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు (52) సాధించిన ఆటగాడిగా నిలుస్తారు. ప్రస్తుతం సచిన్ (టెస్టుల్లో 51), కోహ్లీ (వన్డేల్లో 51) సమానంగా ఉన్నారు. అలాగే, విదేశీ గడ్డపై ఇంకో సెంచరీ చేస్తే ఆసియా ఆటగాళ్లలో విదేశాల్లో అత్యధిక సెంచరీలు (30) సాధించిన రికార్డును కోహ్లీ సొంతం చేసుకుంటాడు.
ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు ఇదే
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, నితీష్ రెడ్డి, ధ్రువ్ జురేల్, ప్రసిద్ధ్ కృష్ణ.
రోహిత్, విరాట్‌ల కెరీర్ లో కీలక సిరీస్
ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఈ సిరీస్‌లో లేరు. ఆయన స్థానంలో యంగ్ ప్లేయర్లు ఎంపికయ్యారు. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయంతో దూరం అయ్యారు. మార్నస్ లాబుషేన్, జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్ వంటి ఆటగాళ్లు యాషేస్ సిరీస్‌కు సిద్ధమవుతుండగా, ఈ వన్డేలు వారికీ వార్మ్-అప్‌గా కూడా మారనున్నాయి.
పెర్త్‌లోని తొలి మ్యాచ్‌తో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుండగా, తరువాత అక్టోబర్ 23న అడిలైడ్, అక్టోబర్ 25న సిడ్నీలో మ్యాచ్‌లు జరుగుతాయి.
ఆస్ట్రేలియా పర్యటన రోహిత్, విరాట్‌ల కెరీర్ లో కీలక నిర్ణయం తీసుకునే మలుపు కానుంది. ఈ సిరీస్‌లో వారి ప్రదర్శన 2027 ప్రపంచకప్ దిశగా భారత జట్టుకు మార్గదర్శకం కానుంది. పెర్త్‌లో మొదలయ్యే ఈ సిరీస్‌లో రికార్డులు, రిటర్న్స్ రెండూ కలిసి భారత క్రికెట్ అభిమానులకు పండుగ వాతావరణాన్ని తీసుకువస్తున్నాయి.