- Home
- Sports
- Cricket
- రోహిత్ శర్మ ఫీల్డ్ లో అందర్నీ ఇష్టమొచ్చినట్టు తిడతాడు.. నేనూ బాధితుడినే.. ముంబై ఓపెనర్ షాకింగ్ కామెంట్స్
రోహిత్ శర్మ ఫీల్డ్ లో అందర్నీ ఇష్టమొచ్చినట్టు తిడతాడు.. నేనూ బాధితుడినే.. ముంబై ఓపెనర్ షాకింగ్ కామెంట్స్
TATA IPL 2022: భారత క్రికెట్ జట్టులో కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని తర్వాత ఫీల్డ్ లో అంత కూల్ గా ఉండే సారథిగా పేరు తెచ్చుకున్న రోహిత్ శర్మ.. అందర్నీ తిడతాడని అంటున్నాడు ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్...

ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ ఫీల్డ్ లోనే గాక బయట కూడా కూల్ గా ఉంటాడు. అయితే పైకి కనిపించని హిట్ మ్యాన్.. గ్రౌండ్ లో అందరినీ నోటికొచ్చినట్టు మాట్లాడతాడని ఆ జట్టు ఓపెనర్ ఇషాన్ కిషన్ అన్నాడు.
గతంలో ఛతేశ్వర్ పుజారా, భువనేశ్వర్ కుమార్ తో పాటు యుజ్వేంద్ర చాహల్ లు రోహిత్ బాధితులే. గ్రౌండ్ లో ఫీల్డింగ్ సరిగా చేయని పక్షంలో హిట్ మ్యాన్ వారి మీద చిందులేస్తాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇక ఇదే విషయమై తాజాగా బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ అనే కార్యక్రమంలో ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫీల్డ్ లో రోహిత్ ఎలా ఉంటాడో కిషన్ వివరించాడు.
‘మ్యాచ్ జరుగుతున్నప్పుడు రోహిత్ శర్మ ఫీల్డ్ లో సరిగా ఫీల్డింగ్ చేయనివారిపై ఆగ్రహించడం చూసే ఉంటాం. దానికి నేను కూడా బాధితుడినే. ఒకసారి వాంఖెడేలో మ్యాచ్ జరుగుతుంది. ముంబైకి నేను అప్పుడే కొత్తగా వచ్చాను.
కొత్త బంతిని తీసుకున్నాక దానిని పాతదానిని చేసేందుకు నేను ఆ బాల్ ను నేల మీద వేసి అటూ ఇటూ తిప్పుతున్నాను. రోహిత్ భాయ్ ఇది చూశాడు. అయితే నేను చేసిన పని చూసి రోహిత్ భాయ్ నన్ను మెచ్చుకుంటాడని అనుకున్నాను.
కానీ అక్కడ నేను అనుకున్నదానికంటే మరో విధంగా జరిగింది. నేను చేసిన పనికి రోహిత్ భాయ్ నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. నేను బంతిని పాతది చేసేందుకు ప్రయత్నించానే తప్ప అక్కడ మంచు ఉన్న విషయం గమనించలేకపోయాను. దీంతో హిట్ మ్యాన్ తో నాకు తిట్లు పడ్డాయి.
అయితే రోహిత్ భాయ్ లో ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే..ముందు ఎవరిపైనైనా కోప్పడితే... తిరిగి కాసేపటికే వాళ్లకు సారీ చెబుతాడు. మ్యాచ్ ఒత్తిడిలో అలా చేస్తానే తప్ప కావాలని కాదని సర్ది చెప్తాడు. తన మాటలను పర్సనల్ గా తీసుకోవద్దని కోరతాడు. మేం కూడా రోహిత్ భాయ్ అన్న మాటలను పెద్దగా పట్టించుకోం....’ అని తెలిపాడు.