- Home
- Sports
- Cricket
- పంత్ నానాటికీ జట్టుకు భారంగా మారుతున్నాడు.. వెంటనే తీసేయండి.. అతడికి ఛాన్స్ ఇస్తే బెటర్ అంటున్న మాజీ క్రికెటర్
పంత్ నానాటికీ జట్టుకు భారంగా మారుతున్నాడు.. వెంటనే తీసేయండి.. అతడికి ఛాన్స్ ఇస్తే బెటర్ అంటున్న మాజీ క్రికెటర్
NZ vs IND ODI: పదే పదే విఫలమవుతున్న టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ పై విమర్శలు పెరుగుతున్నాయి. అతడిని ఎంత త్వరగా తీసేస్తే జట్టుకు అంత మంచిదని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

టీ20 క్రికెట్ లో భారత జట్టులో చోటు దక్కించుకుంటున్న వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్ని అవకాశాలిచ్చినా పంత్ వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదని, రాను రాను అతడు జట్టుకు భారంగా మారుతున్నాడని అంటున్నాడు టీమిండియా మాజీ ఆల్ రౌండర్ రితీందర్ సింగ్ సోధి.
టీ20 ప్రపంచకప్ లో దినేశ్ కార్తీక్ కారణంగా పంత్ కు ఒక్క మ్యాచ్ లోనే ఆడే అవకాశం వచ్చింది. అయినా అతడు దానిని సద్వినియోగం చేసుకోలేదు. ఇక తాజాగా న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ లో రెండు మ్యాచ్ లలో కూడా విఫలమయ్యాడు. దీంతో అతడిని జట్టు నుంచి తప్పించడమే బెటర్ అనే వాదనలు వినిపిస్తున్నాయి. పంత్ ను తప్పించి కేరళ యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్ కు ఆ బాధ్యతలు అప్పజెప్పాలని క్రికెట్ విశ్లేషకులతో పాటు ఫ్యాన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు.
తాజాగా ఇదే విషయమై టీమిండియా మాజీ ఆల్ రౌండర్ రితీందర్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విఫలమవుతున్నప్పుడు పంత్ ను ఆడించడంలో అర్థం లేదని సోధి వ్యాఖ్యానించాడు. పంత్ ను తీసేసి సంజూ శాంసన్ ను జట్టులోకి తీసుకోవాలని సూచించాడు.
సోధి మాట్లాడుతూ.. ‘రాను రాను పంత్ జట్టుకు భారంగా మారుతున్నాడు. ఇదే కొనసాగితే అతడిని తీసేసి సంజూ శాంసన్ కు అవకాశమివ్వండి. నిత్యం విఫలమవుతున్న ఆటగాడికి వరుసగా అవకాశాలివ్వడం వల్ల జట్టు సమతుల్యత దెబ్బతినే ప్రమాదముంది. అందువల్ల కొత్త సమస్యలు తలెత్తుతాయి.
ఎన్ని ఛాన్సులిచ్చినా సరిగ్గా ఆడని ఆటగాళ్లపై వేటు వేసి కొత్తవారికి అవకాశాలివ్వాలి. ఇంకెంతకాలం ఫెయిల్యూర్ క్రికెటర్లను భరిస్తారు. ఇలా అయితే కొత్త వారికి ఛాన్సులు వచ్చేదెలా..? ప్రతీదానికి ఒక పరిధి ఉంటుంది. చాలాకాలం పాటు ఒకే ఆటగాడి మీద ఆధారపడొద్దు. ఒకవేళ అతడు ఆడకుంటే ఎగ్జిట్ డోర్ చూపించడమే ఉత్తమం..
పంత్ మ్యాచ్ విన్నరే కావొచ్చు. కానీ పరుగులు చేయనప్పుడు, టీమ్ విజయాలలో భాగస్వామివి కానొప్పుడు ఆ స్థానంలో కొనసాగకూడదు. అవకాశం దొరికితే మనలోని బెస్ట్ ఇవ్వాలి. కానీ దురదృష్టవశాత్తూ టీ20లలో పంత్ అలా చేయడం లేదు..’ అని సోధి వివరించాడు.
ఈ ఏడాది పంత్ 25 టీ20లు ఆడి కేవలం 364 పరుగులు మాత్రమే చేశాడు. మొత్తంగా కూడా టీ20 కెరీర్ లో పంత్ ప్రదర్శన ఏమంత ఆశాజనకంగా లేదు. ఇప్పటివరకు అతడు భారత్ తరఫున 66 టీ20 మ్యాచ్ లు ఆడి 987 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలున్నాయి. గడిచిన 8 టీ20 ఇన్నింగ్స్ లలో పంత్ స్కోర్లు వరుసగా.. 11, 6, 6, 3, 27, 0, 0, 0గా ఉన్నాయి.