- Home
- Sports
- Cricket
- నాగ్‌పూర్ టెస్టులో మరో కొత్త వివాదానికి తెరతీసిన ఆస్ట్రేలియా.. ఆడేందుకు తమను అనుమతించలేదంటూ..
నాగ్‌పూర్ టెస్టులో మరో కొత్త వివాదానికి తెరతీసిన ఆస్ట్రేలియా.. ఆడేందుకు తమను అనుమతించలేదంటూ..
India vs Australia: ఇండియాతో రెండ్రోజుల క్రితమే ముగిసిన నాగ్‌పూర్ టెస్టులో ఓడిపోయాక ఆస్ట్రేలియా మాజీలకు మైండ్ బ్లాక్ అయినట్టుంది. ఈ ఫ్రస్ట్రేషన్ లో ఏదేదో మాట్లాడుతూ అబాసుపాలవుతున్నారు.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య నాగ్‌పూర్ వేదికగా ముగిసిన టెస్టులో భారత స్పిన్ బౌలింగ్ కు కంగారూలు కంగారెత్తి ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో దారుణ ఓటమి పాలయ్యారు. ఈ ఓటమి తర్వాత ఏదో ఒకటి అనాలి కాబట్టి ఆసీస్ మాజీలు ఏ సాకూ దొరకక మళ్లీ పిచ్ మీదే పడ్డారు.
Image credit: PTI
వాస్తవానికి నాగ్‌పూర్ పిచ్ మరీ నెమ్మదిగా ఉన్నా అది బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూ అనుకూలించింది. తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ సెంచరీతో పాటు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ల ఆటతీరే ఇందుకు నిదర్శనం. ఓర్పుతో ఆడితే నాగ్‌పూర్ లో పరుగులు రాబట్టడం అంత కఠినమేమీ కాదని వీళ్ల బ్యాటింగ్ చెప్పకనే చెప్పింది. చివరికి ఆఖర్లో వచ్చి మెరుపులు మెరిపించిన షమీ కూడా ‘ఇక్కడ బ్యాటింగ్ చేయొచ్చు..’అని ఘనంగా చాటాడు.
భారత బ్యాటర్లు రాణించిన చోట ఆస్ట్రేలియా అగ్రశ్రేణి బ్యాటర్లంతా చేతులు కాల్చుకున్నారు. రెండో ఇన్నింగ్స్ లో అలా వచ్చి ఇలా వెళ్లారు. ఒక్క సెషన్ కూడా నిలువకుండా ఆలౌట్ అయ్యారు. ఈ మ్యాచ్ కు ముందు పిచ్ గురించి అవాకులు చెవాకులు పేలిన ఆసీస్ మాజీలు.. తర్వాత కూడా ఇదే మంత్రాన్ని పఠిస్తున్నారు. బంతి బాగా తిరిగిందని, జడేజా బాల్ టాంపరింగ్ చేశాడని వాదిస్తున్నారు.
ఇదిలాఉండగా తాజాగా ఆసీస్ మాజీ ఆటగాడు కొత్త విషయాన్ని లేవనెత్తాడు. తొలి టెస్టు మూడు రోజుల్లోనే ముగియడంతో మిగిలిన రెండు రోజులు ఆసీస్ ఆటగాళ్లు అక్కడే ప్రాక్టీస్ చేయాలని నిర్ణయించుకున్నారని, కానీ అందుకు నాగ్‌పూర్ పిచ్ క్యూరేటర్ అనుమతించలేదని ఆరోపించాడు.
ఢిల్లీ టెస్టుకు చాలా టైమ్ ఉన్నందున ఆసీస్ ఆటగాళ్లు ఇక్కడే ప్రాక్టీస్ చేయాలని భావించారట. అందుకు నాగ్‌పూర్ పిచ్ లోనే ప్రాక్టీస్ చేసుకుంటామని, ప్రధాన పిచ్ పై నీళ్లు పట్టొద్దంటూ పిచ్ క్యూరేటర్ ను ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ కోరిందని సమాచారం. అయితే ఇందుకు సదరు క్యూరేటర్, గ్రౌండ్ సిబ్బంది మాత్రం పట్టించుకోకుండా శనివారం రాత్రి పిచ్ మీద నీళ్లు పట్టారంట. దీంతో అక్కడ ప్రాక్టీస్ చేసే వీలులేకుండా పోయిందని ఫాక్స్ క్రికెట్ లో ఓ కథనం వచ్చింది.
ఇప్పుడు ఈ కథనం ఆధారంగా ఇయాన్ హీలి మాట్లాడుతూ.. ‘ఇది దారుణం. పర్యాటక టీమ్ ను మీరు అంత నమ్మడం లేదా..? మనం ఒకరిమీద ఒకరం విశ్వాసం ఉంచాలి. నాగ్‌పూర్ వికెట్ మీద ప్రాక్టీస్ చేస్తామంటే క్యూరేటర్, గ్రౌండ్ సిబ్బందికి అందుకు అంగీకరించకపోవడం మంచిది కాదు. ఇది ఏమాత్రమూ మంచి క్రికెట్ అనిపించుకోదు. ఈ విషయంలో ఐసీసీ జోక్యం చేసుకోవాలి. ఇటువంటి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి పర్యాటక జట్టు కోరినప్పుడు ఇలా వ్యవహరించడం మంచి పద్దతి కాదు..’అని వాపోయాడు.