- Home
- Sports
- Cricket
- అది నా డ్రీమ్.. ఇప్పటికీ మరిచిపోను.. త్వరలోనే సాధిస్తా : యుజ్వేంద్ర చాహల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
అది నా డ్రీమ్.. ఇప్పటికీ మరిచిపోను.. త్వరలోనే సాధిస్తా : యుజ్వేంద్ర చాహల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ భారత క్రికెట్ జట్టులో పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో రెగ్యులర్ ప్లేయర్. టీ20లో టీమిండియా తరఫున అతడే హయ్యస్ట్ వికెట్ టేకర్.

Image credit: PTI
అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చి ఏడేండ్లు గడుస్తున్నా టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఇప్పటికీ టెస్టులకు ఎంట్రీ ఇవ్వలేదు. అతడిని పరిమిత ఓవర్ల ఫార్మాట్ కే పరిమితం చేసింది బీసీసీఐ. అయితే తనకు మాత్రం టెస్టు క్రికెట్ ఆడటం తన డ్రీమ్ అని త్వరలోనే తన లక్ష్యాన్ని చేరుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఐపీఎల్ - 16 ముగిసిన తర్వాత దొరికిన విరామాన్ని ఫ్యామిలీతో కలిసి గడుపుతున్న చాహల్ తాజాగా క్రిక్ ట్రాకర్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా చాహల్.. తన టెస్టు క్రికెట్ లక్ష్యాలు, 2021, 2022 టీ20 వరల్డ్ కప్ లలో తనను ఆడించకపోవడం వంటి విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
చాహల్ మాట్లాడుతూ.. ‘ప్రతీ క్రికెటర్ కు అంతర్జాతీయ స్థాయిలో తమ దేశం తరఫున టెస్టు క్రికెట్ ఆడాలన్నది డ్రీమ్ గా ఉంటుంది. టెస్టు క్రికెట్ ఆడితేనే ఒక క్రికెటర్ గా పరిపూర్ణమైన క్రికెటర్ గా పతాకస్థాయికి చేరుకుంటారు. నాక్కూడా అలాంటి డ్రీమ్ ఉంది. పరిమిత ఓవర్ల క్రికెట్ లో నేను చాలా సాధించాను.
కానీ రెడ్ బాల్ క్రికెట్ లో ఇంకా భారత్ తరఫున ఆడే అవకాశమే రాలేదు. ఇప్పటికీ టెస్టు క్రికెట్ లో ఆడటం నా చెక్ లిస్ట్ లో ఉంది. చాహల్ టెస్టు క్రికెటర్ అనే ట్యాగ్ కూడా నాకు రావాలని కోరుకుంటున్నా. వచ్చే రంజీ, దేశవాళీ సీజన్ లో బాగా రాణించి త్వరలోనే టెస్టు జట్టులో ఎంట్రీ ఇస్తానన్న నమ్మకం నాకుంది..’ అని తెలిపాడు.
ఇక జాతీయ జట్టుతో పాటు ఐపీఎల్ - 14లో మెరుగ్గా రాణించినా 2021 టీ20 వరల్డ్ కప్ లో చాహల్ కు చోటు దక్కలేదు. 2022 టీ20 ప్రపంచకప్ లో కూడా అతడిని ఎంపిక చేసినా తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. దీనిపై కూడా చాహల్ స్పందించాడు.
‘దానికి నేనేం బాధపడటం లేదు. అది నా చేతుల్లో లేని అంశం. దాని గురించి నేను పెద్దగా చింతించాల్సిన పన్లేదు. నా ఫోకస్ అంతా నేను ఆడుతున్న మ్యాచ్ లో బాగా రాణించి జట్టు కోసం నావంతు కృషి చేయడం మీదే ఉంటుంది. అది ఏ మ్యాచ్ అయినా ఏ టోర్నీ అయినా 100 శాతం ప్రదర్శన చేయడమే నా టార్గెట్. కానీ టీమ్ సెలక్షన్ అనేది నా చేతులలో లేని విషయం..’అని అన్నాడు.