- Home
- Sports
- Cricket
- మూడు నెలల తర్వాత మౌనం వీడిన ఆర్సీబీ.. ఫ్యాన్స్ కు బిగ్ అప్‌డేట్.. ఆ పోస్ట్ వైరల్
మూడు నెలల తర్వాత మౌనం వీడిన ఆర్సీబీ.. ఫ్యాన్స్ కు బిగ్ అప్‌డేట్.. ఆ పోస్ట్ వైరల్
RCB: బెంగుళూర్ తొక్కిసలాట ఘటనపై ఆర్సీబీ తొలిసారి స్పందించింది. దాదాపు 80 రోజుల తర్వాత సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. అభిమానుల సంక్షేమం కోసం ‘ఆర్సీబీ కేర్స్’ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది.

18 ఏళ్ల నిరీక్షణకు తెర
18 ఏళ్ల నిరీక్షణకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( ఆర్సీబీ) ముగింపు పలికింది. గత మూడు పర్యాయాలు ఐపీఎల్ టైటిల్‌ను తృటిలో చేజార్చుకున్న ఆర్సీబీ.. ఈసారి మాత్రం పట్టువదల్లేదు. సమిష్టి పోరాటంతో తొలిసారి ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. ఈసాలా కప్ నమదే.. నినాదాన్ని నిజం చేసింది. ఈసాలా కప్ నమ్దూ అని ఫ్యాన్స్‌కు గర్వంగా చెప్పింది. అయితే.. ఆ సంతోషం ఎక్కువ కాలం నిలువలేదు.. మరుసటి రోజే విషాదంగా మారింది. బెంగళూరులో నిర్వహించిన సంబరాల్లో అభిమానుల గుంపు అదుపుతప్పడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది అభిమానులు దుర్మరణం పాలవ్వగా, మరో 50 మందికి పైగా గాయపడ్డారు.
ఆర్సీబీ భావోద్వేగ లేఖ
ఈ సంఘటనపై కర్ణాటక ప్రభుత్వంతో పాటు ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అధికారుల నిర్లక్ష్యం, తగిన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఆరోపణలు వచ్చాయి. కేసులు నమోదవడంతో పాటు పలువురు బాధ్యులపై చర్యలు కూడా తీసుకున్నారు. జూన్ 5న తొక్కిసలాటపై ఆర్సీబీ తొలిసారి స్పందించింది. దాదాపు 80 రోజుల తర్వాత మళ్లీ సోషల్ మీడియా వేదికగా ఓ భావోద్వేగ లేఖ రాస్తూ కీలక నిర్ణయం ప్రకటించింది.
ఆ రోజు మా హృదయాలు బద్దలయ్యాయి
బెంగుళూర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనపై దాదాపు మూడు నెలల తర్వాత RCB ఫ్రాంచైజీ తొలిసారి స్పందించింది. బెంగూళూర్ తన అభిమానులకు ఓ భావోద్వేగ లేఖ రాసింది.
ఆ లేఖలో RCB ఇలా పేర్కొంది. “డియర్ ఆర్సీబీ ఆర్మీ.. ఇది మేం హృదయపూర్వకంగా రాస్తున్న లేఖ. దాదాపు మూడు నెలల క్రితం చివరి పోస్టు చేశాం. ఆ తర్వాత నిశ్శబ్దం అనేది మా దారి అయింది. జూన్ 4 న జరిగిన సంఘటన అన్నీ మార్చేసింది. ఆ రోజు మా హృదయాలు ముక్కలయ్యాయి. అప్పటి నుంచి మేం బాధతోనే ఉన్నాం. చాలా నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ బాధను ఓ ప్రతిజ్ఞగా, ఓ విశ్వాసంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాం.” అని పేర్కొన్నారు.
“RCB Cares” కొత్త ఆరంభం
ఈ లేఖలోRCB తన కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించింది. తన అభిమానుల కోసం ‘RCB Cares’ అనే కొత్త కార్యక్రమాన్ని ఆర్సీబీ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా అభిమానుల భద్రత, సంక్షేమానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. ఇకపై సంబరాలు జరిపినా, అభిమానుల రక్షణకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపింది.
“ఈ రోజు మేము తిరిగి వచ్చాము. అభిమానుల పక్కనే నిలబడి, బెంగుళూర్ గర్వకారణంగా ముందుకు సాగుతామని హామీ ఇస్తున్నాము. ఇది మా ప్రతిజ్ఞ, మా విధేయత. RCB Cares – మేము ఎల్లప్పుడూ మీతో ఉంటాము.”అని జట్టుతో పాటు మేనేజ్‌మెంట్ కూడా స్పష్టం చేసింది.
విజయోత్సవం నుండి విషాదం వరకు…
పంజాబ్ కింగ్స్‌పై విజయం సాధించిన వెంటనే RCB నగరంలో రోడ్ షో నిర్వహించాలని నిర్ణయించుకుంది. కానీ పోలీసుల అనుమతి లభించకపోవడంతో, జట్టు స్టేడియంలో అభిమానులతో వేడుక చేసుకోవాలని ప్లాన్ చేసింది. సమాచారం లోపం, నిఘా వైఫల్యం కారణంగా భారీగా అభిమానులు స్టేడియం వద్ద గుమికూడగా, తొక్కిసలాట విషాదంగా మారింది. ఆ సంబరాలు ఒక్కసారిగా శోకసంద్రంగా మారిపోయాయి.