పింక్ బాల్ టెస్టు: 81 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్... టీమిండియా ముందు ఊరించే టార్గెట్...
టీమిండియాను 145 పరుగులు చేసి, రెండో ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు 81 పరుగులకి ఆలౌట్ అయ్యింది. టీమిండియా టార్గెట్ 49 పరుగులు. రెండో ఇన్నింగ్స్‌లో మొదటి బంతికే వికెట్ పడడంతో మొదలైన ఇంగ్లాండ్ వికెట్ల పతనం, పదో వికెట్ దాకా కొనసాగింది. మొదటి 30 ఓవర్లలో కేవలం ఇద్దరు స్పిన్నర్లు అశ్విన్, అక్షర్ పటేల్‌లతో మాత్రమే బౌలింగ్ చేయించిన భారత సారథి విరాట్ కోహ్లీ, ప్రత్యర్థి జట్టును స్వల్ప స్కోరుకి కట్టడి చేశాడు. టీమిండియాపై ఇంగ్లాండ్‌కి టెస్టుల్లో ఇదే అత్యల్ప స్కోరు...
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో బెన్ స్టోక్స్ కొట్టిన 25 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు. జో రూట్ 19, ఓల్లీ పోప్ 12 పరుగులు చేసి పెవిలియన్ చేరారు.
మొదటి ఓవర్ వేసిన అక్షర్ పటేల్, మొదటి బంతికే ఓపెనర్ క్రావ్లేను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత రెండు బంతులకు బెయిర్ స్టో కూడా క్లీన్ బౌల్డ్ అయ్యాడు...
మూడు బంతుల్లోనే రెండు వికెట్లు తీసిన అక్షర్ పటేల్, ఇంగ్లాండ్ జట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చాడు.. 25 బంతుల్లో 7 పరుగులు చేసిన డొమినిక్ సిబ్లీ, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్‌ను బెన్ స్టోక్స్, జో రూట్ కలిసి ఆదుకునే ప్రయత్నం చేశారు. 34 బంతుల్లో 3 ఫోర్లతో 25 పరుగులు చేసిన బెన్ స్టోక్స్‌ను రవిచంద్రన్ అశ్విన్ అవుట్ చేయడంలో 50 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్...
రవిచంద్రన్ అశ్విన్, బెన్ స్టోక్స్‌ను అవుట్ చేయడం ఇది 11వ సారి... అశ్విన్ బౌలింగ్‌లో అత్యధిక సార్లు అవుటైన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు బెన్ స్టోక్స్...
బెన్ స్టోక్స్ వికెట్ తీసిన రవిచంద్రన్ అశ్విన్, అంతర్జాతీయ కెరీర్‌లో 600 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. వన్డేలు, టీ20, టెస్టులతో కలిపి 234 మ్యాచులు ఆడిన అశ్విన్, 600 వికెట్లు పూర్తి చేసుకున్నాడు... అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన భారత బౌలర్‌గా నిలిచాడు అశ్విన్...
బెన్ స్టోక్స్ అవుటైన కొద్ది సేపటికే ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ కూడా పెవిలియన్ చేరాడు. 45 బంతుల్లో 19 పరుగులు చేసిన జో రూట్, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 56 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్...
15 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసిన ఓల్లీ పోప్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన అశ్విన్, ఆ తర్వాత జోఫ్రా ఆర్చర్‌ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసి టెస్టుల్లో 400 వికెట్లు పూర్తి చేసుకున్నాడు...
అత్యంత వేగంగా 400 వికెట్లు పూర్తి చేసుకున్న రెండో బౌలర్‌గా నిలిచాడు రవిచంద్రన్ అశ్విన్. ముత్తయ్య మురళీధరన్ 72 మ్యాచుల్లో ఈ ఫీట్ సాధించగా, అశ్విన్ 77 మ్యాచుల్లో 400 వికెట్లను అందుకున్నాడు...
టీమిండియా తరుపున అత్యంత వేగంగా 50, 100, 150, 200, 250, 300, 350, 400 వికెట్లు తీసిన బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ రికార్డు క్రియేట్ చేశాడు...
అతి తక్కువ సమయంలో 400 టెస్టు వికెట్లను అందుకున్న రెండో బౌలర్‌గా నిలిచాడు అశ్విన్. మెక్‌గ్రాత్ 8 ఏళ్ల 341 రోజుల్లో ఈ ఫీట్ అందుకోగా, రవిచంద్రన్ అశ్విన్ 9 ఏళ్ల 109 రోజుల్లో 400 వికెట్ల ఫీట్ అందుకున్నాడు...
టీమిండియా తరుపున 400, అంతకంటే ఎక్కువ టెస్టు వికెట్లు తీసిన నాలుగో బౌలర్ రవిచంద్రన్ అశ్విన్. అనిల్ కుంబ్లే 619, కపిల్ దేవ్ 434, హర్భజన్ సింగ్ 417 వికెట్లతో అశ్విన్ కంటే ముందున్నారు...
28 బంతుల్లో 8 పరుగులు చేసిన బెన్ ఫోక్స్‌ను అవుట్ చేసిన అక్షర్ పటేల్, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో తీసిన 6 వికెట్లతో కలిపి 11 వికెట్లు తీసి, పింక్ బాల్ టెస్టులో ఈ ఫీట్ సాధించిన మొదటి బౌలర్‌గా నిలిచాడు...
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో మొదటి సిక్సర్ బాదిన జాక్ లీచ్, 22 బంతుల్లో 9 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో రహానేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 80 పరుగుల వద్ద 9వ వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్...
ఇంగ్లాండ్‌పై రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఐదు, అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా నిలిచాడు అక్షర్ పటేల్. 1984లో శివరామకృష్ణన్, 2016లో రవిచంద్రన్ అశ్విన్ మాత్రమే ఈ ఫీట్ సాధించారు.
31వ ఓవర్‌లో బాల్ అందుకున్న వాషింగ్టన్ సుందర్, అండర్సన్‌ను అవుట్ చేయడంతో 81 పరుగుల వద్ద ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌కి తెరపడింది...