పార్టీలపైన ఉన్న శ్రద్ధ, ప్రాక్టీస్‌పైన పెట్టకపోతే రిజల్ట్ ఇలాగే ఉంటుంది... టీమిండియాపై...
ఇంగ్లాండ్‌పై టెస్టు, టీ20 సిరీస్ గెలిచిన టీమిండియా, మొదటి వన్డే గెలవగానే రెండు రోజులు గ్యాప్ దొరికిందని పార్టీ చేసుకుంది. ప్రత్యర్థి నుంచి విజయాన్ని లాక్కున్నామనే సంతోషంతో మనోళ్లు ప్రాక్టీస్‌ను పక్కనబెట్టి, ఫ్యామిలీస్‌తో కలిసి ఎంజాయ్ చేశారు. ఫలితం రెండో వన్డే పరాజయం...
ఒక్క మ్యాచ్ గెలిచినంత మాత్రాన సిరీస్ గెలిచినట్టు కాదు. ఆ విషయం టీమిండియాకు తెలియనిది కాదు. అయితే మూడో వన్డే ముగిసిన తర్వాత భారత జట్టు బయో బబుల్ నుంచి బయటికి వెళ్తోంది...
అంతేకాకుండా రెండో వన్డేకి, మూడో వన్డేకి మధ్య కేవలం ఒకే రోజు గ్యాప్ ఉంది. దీంతో మొదటి వన్డే ముగియగానే అంతా కలిసి పార్టీ చేసుకున్నారు టీమిండియా సభ్యులు. దీని ఎఫెక్ట్ రెండో వన్డేలో స్పష్టంగా కనిపించింది...
బ్యాటింగ్‌లో శిఖర్ ధావన్ 17 బంతులు ఆడి 4 పరుగులు మాత్రమే చేశాడు. రన్‌రేట్ పెరుగుతున్న దశలో రోహిత్ శర్మ అవుట్ కావడంతో విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ భాగస్వామ్యం నిర్మించేందుకు నెమ్మదిగా ఆడారు..
బ్యాటింగ్‌కి అనుకూలిస్తున్న పిచ్‌పై టీమిండియా 370+ స్కోరు చేసి ఉండాలని క్రికెట్ విశ్లేషకుల అంచనా. ప్రారంభంలో నెమ్మదిగా ఆడి, ఆఖర్లో ఎంత స్పీడ్ పెంచినా ఆ స్కోరు రాదు...
భారీ స్కోరు చేయాలంటే ముందునుంచే దూకుడుగా ఆడాలి. కెఎల్ రాహుల్ సెంచరీ చేసినా, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేసినా... రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా సిక్సర్ల మోత కారణంగానే ఈ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది టీమిండియా...
స్పిన్ బౌలింగ్‌లో ప్రత్యర్థి చాలా తేలిగ్గా పరుగులు చేస్తున్నప్పుడు కూడా మరో పేసర్ హార్ధిక్ పాండ్యాకి బౌలింగ్ ఇవ్వలేకపోయాడు కెప్టెన్ విరాట్ కోహ్లీ..
‘హార్ధిక్ పాండ్యా బాడీపై ప్రెషర్ పడకుండా చూసుకోవడం టీమిండియా బాధ్యత’ అంటూ మ్యాచ్ అనంతరం తెలిపాడు విరాట్ కోహ్లీ. కేవలం16 బంతులాడితేనే హార్ధిక్ పాండ్యా అంతలా అలిసిపోయాడా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న...
మొదటి వన్డేలో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయినా కుల్దీప్ యాదవ్‌ను రెండో వన్డేలో కొనసాగించాడు విరాట్ కోహ్లీ. కానీ రెండో వన్డేలో మరిన్ని ఎక్కువ పరుగులు సమర్పించుకున్నాడు కుల్దీప్ యాదవ్...
ఓ రకంగా చెప్పాలంటే రెండో వన్డేలో టీమిండియా ఆటతీరు ఛాంపియన్ స్టైల్‌లో మాత్రం లేదు. బ్యాటింగ్‌లో భారీ స్కోరు చేసేశామనే ధీమా రెండో ఇన్నింగ్స్‌లో కనిపించింది...
మొదటి వన్డేలో మెరుపు ఆరంభం చేసి, ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయి ఆలౌట్ అయ్యింది ఇంగ్లాండ్. రెండో వన్డేలో కూడా అలాగే చేస్తారని ఆశించింది భారత జట్టు.
అయితే ఇంగ్లాండ్ చేసిన తప్పులు మళ్లీ చేయకుండా పక్కా ప్రణాళికతో బరిలో దిగి విజయాన్ని అందుకుంది. నిజానికి అంపైర్, బెన్ స్టోక్స్‌ని అవుట్‌గా ప్రకటించి ఉంటే, ఫలితం మరోలా ఉండేదేమో...
రెండో వికెట్ పడిన వెంటనే మరో రెండు వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్... 40 పరుగుల దగ్గర బెన్ స్టోక్స్ అవుటై ఉంటే, అప్పటికే లక్ష్యం భారీగానే ఉండేది... మరో రెండు వికెట్లు తీసి ఉంటే ఇంగ్లాండ్‌పై ఒత్తిడి పెరిగేది...
ఇలా రెండో వన్డేలో టీమిండియా ఓటమికి కారణాలెన్నో... కానీ మొదటి వన్డే గెలవగానే భారత జట్టు పార్టీ చేసుకోవడం వల్లే టీమ్ ఓడిపోయిందని విమర్శలు పోస్టులు పెడుతున్నారు కొంతమంది...
ఇంతకుముందు మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో కూడా ఆస్ట్రేలియాతో వన్డే మ్యాచ్‌కి ముందు ఇలాగే పార్టీ చేసుకుంది టీమిండియా. ఆ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ 175 పరుగులు చేసినా ప్రత్యర్థి ఇచ్చిన 350 పరుగుల టార్గెట్‌కి దగ్గరదాకి వచ్చి ఓడింది...
రెండో వన్డేలో టీమిండియా పరాజయం మరోసారి అప్పటి జట్టు స్థితిని గుర్తుకు తెచ్చింది... అయితే టీమిండియా భువనేశ్వర్ తప్ప సరైన పేసర్ లేడు, అతను కూడా 10 ఓవర్లలో 63 పరుగులిచ్చాడు.
రెండో మ్యాచ్ ఆడుతున్న ప్రసిద్ధ్ కృష్ణ చాలా బెటర్ బౌలింగ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. 10 ఓవర్లలో 58 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. ఇక స్పిన్ బౌలింగ్ పూర్తిగా తేలిపోయింది...
మూడో వన్డేలో గెలిచి వన్డే సిరీస్ సొంతం చేసుకోవాలంటే టీమిండియా ఈ లోపాలపై ఫోకస్ పెట్టాల్సిందే. లేదంటే టెస్టు, టీ20 సిరీస్ గెలిచి, దక్కించుకున్న ప్రశంసలన్నీ విమర్శలుగా మారతాయి.