మహిళల వన్డే వరల్డ్ కప్ 2025: మరో నాటకానికి తెరలేపిన పాకిస్తాన్
World Cup 2025 : మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 ఓపెనింగ్ సెరిమనీలో పాల్గొనబోమని పాకిస్తాన్ ప్రకటించింది. భారత్ కు రామని చెప్పింది. పాక్ తమ అన్ని మ్యాచ్‌లు శ్రీలంకలోనే ఆడనుంది.

వన్డే మహిళల వరల్డ్ కప్ ప్రారంభం ముందు వివాదం
సెప్టెంబర్ 30 నుంచి మహిళల వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్ కు ఈసారి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. అయితే టోర్నమెంట్ ఆరంభానికి ముందే పాకిస్తాన్ మరో నాటకానికి తెరలేపింది. తన కొత్త నిర్ణయంతో వార్తల్లో నిలిచింది. గౌహతిలో జరగనున్న ఓపెనింగ్ సెరిమనీలో తమ జట్టు పాల్గొనబోదని పాకిస్తాన్ మీడియా రిపోర్టులు వెల్లడించాయి.
KNOW
గౌహతిలో మహిళల వన్డే వరల్డ్ కప్ ఓపెనింగ్ సెరిమనీ
మహిళల వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ ఓపెనింగ్ సెరిమనీలో ప్రతి జట్టు కెప్టెన్లు పాల్గొంటారు. పలువురు బాలీవుడ్ స్టార్ల ప్రదర్శనలతో ఓపెనింగ్ సెరిమనీ జరగనుంది. భారత స్టార్ సింగర్ శ్రేయా ఘోషాల్ ఈ కార్యక్రమంలో ప్రదర్శన ఇవ్వనున్నారు. అయితే పాకిస్తాన్ మహిళల జట్టు ఈ వేడుకలో పాల్గొనడం లేదు. పాకిస్తాన్ జట్టు కెప్టెన్ ఫాతిమా సనా కూడా ఈ సెరిమనీతో పాటు కెప్టెన్ల ఫోటోషూట్‌లో పాల్గొనబోరని మీడియా రిపోర్టులు తెలిపాయి.
భారత్ vs పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత
భారత్‌లో ఇటీవల జరిగిన పహల్గామ్ దాడి తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. ఈ పరిణామం నేపథ్యంలో పాకిస్తాన్ జట్టు భారత భూభాగంలో మ్యాచ్‌లు ఆడేందుకు నిరాకరించింది. మహిళల వరల్డ్ కప్‌లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ షెడ్యూల్‌లో ఉన్నా, దీనిపై కూడా వ్యతిరేకత కొనసాగుతోంది.
శ్రీలంకలోనే పాకిస్తాన్ మ్యాచ్‌లు
భారత్ తో ఉద్రిక్తతల మద్య పాకిస్తాన్ జట్టు తమ అన్ని మ్యాచ్‌లను శ్రీలంకలోనే ఆడనుంది. జట్టు సెమీఫైనల్ లేదా ఫైనల్‌కు చేరినా కూడా అదే దేశంలో మ్యాచ్ జరగనుంది. అంటే మొత్తంగా పాకిస్తాన్ జట్టు భారత భూభాగంలో అడుగుపెట్టదు.
భారత్ vs పాకిస్తాన్ ఫార్మూలా ఒప్పందం
భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ చాలా కాలంగా జరగలేదు. ఇరు దేశాలు కేవలం ఐసీసీ టోర్నమెంట్లు లేదా ఆసియా కప్‌లో మాత్రమే తలపడుతున్నాయి. ఇటీవల ఇరు దేశాలు ఒక ఫార్మూలా నిర్ణయించుకున్నాయి. దాని ప్రకారం, భారత్ జట్టు పాకిస్తాన్ వెళ్లదు. అలాగే పాకిస్తాన్ జట్టు భారత్‌లో మ్యాచ్‌లు ఆడదు. ఆయా దేశాల్లో కాకుండా మరో దేశంలోని వేదికల్లో భారత్, పాక్ లు తలపడగాయి. ఈ నిర్ణయాన్ని మహిళల వన్డే వరల్డ్ కప్‌లోనూ అమలు చేస్తున్నారు.