పాక్ డ్రెస్సింగ్ రూమ్‌లో గొడవ అంతా ఉత్తిదేనంట! వన్డే వరల్డ్ కప్ టోర్నీకి ముందు వివాదం రేపడానికి...
ఆసియా కప్ 2023 టోర్నీలో పాకిస్తాన్ ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయింది. టీమిండియాతో మ్యాచ్‌లో 128 పరుగులకే ఆలౌట్ అయిన పాకిస్తాన్, శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 252 పరుగుల భారీ స్కోరు చేసినా దాన్ని కాపాడుకోలేకపోయింది..
రెండు రోజుల పాటు సాగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ సూపర్ 4 మ్యాచ్‌లో హారీస్ రౌఫ్, నసీం షా, ఆఘా సల్మాన్ గాయపడ్డారు. బ్యాటర్లు మూకుమ్మడిగా ఫెయిల్ అయ్యారు.. లంకతో మ్యాచ్‌లో మహ్మద్ రిజ్వాన్, ఇఫ్తికర్ అహ్మద్ బ్యాటింగ్‌లో రాణించినా బౌలర్లు తేలిపోయారు..
Pramod Madushan
42 ఓవర్లలో 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి, థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది శ్రీలంక. ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో పాక్ ఆటతీరు అనేక అనుమానాలకు తావిచ్చింది కూడా..
శ్రీలంకతో మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూమ్‌లో కెప్టెన్ బాబర్ ఆజమ్, స్టార్ పేసర్ షాహీన్ ఆఫ్రిదీ మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగిందని వార్తలు వచ్చాయి. ప్లేయర్లందరినీ బాబర్ ఆజమ్ తిట్టాడని, షాహీన్ ఆఫ్రిదీ కలగచేసుకున్నాడని... దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందన్నారు..
Babar Azam bowled
మధ్యలో వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ కలగచేసుకుని, వీరికి సర్దిచెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఇది పాకిస్తాన్ టీమ్‌ని ట్రోల్ చేయడానికి టీమిండియా ఫ్యాన్స్ క్రియేట్ చేసిన ఫేక్ న్యూస్ అనుకుంటే.. ఈ వార్తలను భారత ఫ్యాన్స్ కంటే ఎక్కువగా పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్సే ట్రెండ్ చేశారు.
అయితే పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూమ్‌లో ఇలాంటి వాగ్వాదం, చర్చ ఏమీ జరగలేదని పాక్ క్రికెటర్ స్పష్టం చేశాడు. ఆసియా కప్ పరాజయాన్ని మరిచిపోయి, వన్డే వరల్డ్ కప్‌పై దృష్టి పెట్టాలని మాత్రమే బాబర్ ఆజమ్, ప్లేయర్లకు సూచించినట్టు సదరు ప్లేయర్, క్రికెట్ పాకిస్తాన్ అనే వెబ్‌సైట్‌కి తెలియచేశాడు..
‘బాబర్ ఆజమ్, షాహీన్ ఆఫ్రిదీ మధ్య డ్రెస్సింగ్ రూమ్‌లో గొడవైందనే వార్తల్లో నిజం లేదు. అది కేవలం ఎవరో సృష్టించిన పుకారు మాత్రమే. వరుసగా రెండు మ్యాచులు ఓడిపోవడంతో ఎవరికి తోచినట్టు వాళ్లు రాసుకొచ్చారు.
మీటింగ్ తర్వాత అందరూ కలిసి హోటల్‌కి వెళ్లారు. అందరూ కలిసి ఒకే విమానంలో పాక్‌కి తిరిగి వెళ్లారు.. డ్రెస్సింగ్ రూమ్‌లో అంత పెద్ద గొడవ అయితే ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం ఉండదుగా..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు పాక్ జట్టులో లేని వివాదాన్ని రేపడానికి ఇది ఎవరో కల్పించిన వార్త మాత్రమే..’ అంటూ పాక్ సీనియర్ క్రికెటర్ చెప్పినట్టు క్రికెట్ పాకిస్తాన్ ప్రచురించింది..