- Home
- Sports
- Cricket
- Team India: గెలిచినా మళ్లీ అదే కథ.. ఐదో వన్డేలో భారత బ్యాటర్లు ఎందుకు చేతులెత్తేశారో తెలుసా?
Team India: గెలిచినా మళ్లీ అదే కథ.. ఐదో వన్డేలో భారత బ్యాటర్లు ఎందుకు చేతులెత్తేశారో తెలుసా?
Team India: న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో వన్డేలో విజయం సాధించినా భారత బ్యాటర్లు మరోసారి నిరాశపరిచారు. 42.1 ఓవర్లలో 209 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయింది. భారత బ్యాటర్లు మరోసారి ఎందుకు విఫలమయ్యారో తెలుసా?

కివీస్ బౌలర్ల ముందు కుప్పకూలారు.. టీమిండియా బ్యాటింగ్ వైఫల్యానికి 3 ప్రధాన కారణాలు ఇవే
న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత బ్యాటర్ల వైఫల్యం కొనసాగుతోంది. నవంబర్ 15న మౌంట్ మాంగనుయ్‌లోని బే ఓవల్ లో జరిగిన ఐదో, చివరి వన్డేలో కూడా టీమిండియా బ్యాటింగ్ లైనప్ మరోసారి నిరాశపరిచింది. న్యూజిలాండ్ బౌలర్లు భారత బ్యాటింగ్ లోపాలను ఇంకోసారి బయటపెట్టారు. నాలుగో వన్డేలో 244 పరుగుల భారీ తేడాతో ఓడిపోయిన తర్వాత, చివరి మ్యాచ్‌లోనైనా భారత్ గట్టిగా పుంజుకుంటుందని అంతా ఆశించారు. కానీ, మన బ్యాటర్లు మళ్లీ పాత కథనే రిపీట్ చేశారు.
ఈ మ్యాచ్‌లో టీమిండియా 42.1 ఓవర్లలో కేవలం 209 పరుగులకే ఆలౌట్ అయింది. టెస్ట్ సిరీస్ నేపథ్యంలో న్యూజిలాండ్ తమ ప్రధాన ఫాస్ట్ బౌలర్లు మ్యాట్ హెన్రీ, కైల్ జేమీసన్లకు విశ్రాంతినిచ్చింది. అయినా సరే, భారత బ్యాటర్లు పరుగులు చేయలేకపోవడం మరింత నిరాశ కలిగించే విషయం.
మరోవైపు రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ లేకుండానే భారత్ ఈ మ్యాచ్ ఆడింది. దీనివల్ల మిగతా ఆటగాళ్లకు మంచి అవకాశం దక్కినప్పటికీ, బ్యాటింగ్ యూనిట్ దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయింది. ఈ సిరీస్‌లో భారత్ వరుసగా రెండోసారి బ్యాటింగ్‌లో కుప్పకూలడానికి గల ప్రధాన కారణాలను ఇప్పుడు చూద్దాం.
పిచ్ పరిస్థితులకు తగ్గట్టుగా ఆడలేకపోవడం
బే ఓవల్ పిచ్ గత మ్యాచ్‌తో పోలిస్తే కాస్త స్లోగా ఉంది. పైగా ఫాస్ట్ బౌలర్లకు కొంత మూవ్‌మెంట్‌తో పాటు స్పిన్నర్లకు కూడా పిచ్ నుంచి సహకారం లభించింది. అయితే, భారత బ్యాటర్లు ఈ పరిస్థితులకు తగ్గట్టుగా తమ ఆటను మార్చుకోవడంలో విఫలమయ్యారు.
చాలా మంది బ్యాటర్లు క్రీజులో కాసేపు నిలదొక్కుకునే ప్రయత్నం చేయకుండా, తొందరపడి షాట్లు ఆడటానికి ప్రయత్నించారు. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కేవలం 7 పరుగులు మాత్రమే చేసి షార్ట్ మిడ్-వికెట్ వద్ద క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. విరాట్ కోహ్లీ కూడా ప్రభావం చూపలేకపోయాడు. మాథ్యూ ఫిషర్ బౌలింగ్‌లో కేవలం 5 పరుగులు చేసి కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
చెత్త షాట్ సెలెక్షన్‌తో కీలక వికెట్లు కోల్పోవడం
భారత్ కేవలం 34 పరుగులకే తన మొదటి మూడు వికెట్లను కోల్పోయింది. దీనివల్ల మిడిల్ ఆర్డర్‌పై ఒక్కసారిగా తీవ్ర ఒత్తిడి పడింది. రుతురాజ్ గైక్వాడ్‌కు మంచి ఆరంభం దక్కినా దాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. జాకబ్ డఫీ బౌలింగ్‌లో 18 పరుగులు చేసి అతను ఔటయ్యాడు.
ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ, షార్ట్ పిచ్ బంతులను ఆడటంలో ఇబ్బంది పడే అయ్యర్, మరోసారి అదే బలహీనతతో 22 పరుగుల వద్ద వికెట్ సమర్పించుకున్నాడు. క్రీజులో ఎక్కువ సేపు గడపకుండా భారీ షాట్లు ఆడబోయి చాలా మంది భారత బ్యాటర్లు తమ వికెట్లను చేజార్చుకున్నారు.
భారీ భాగస్వామ్యాలు నిర్మించలేకపోవడం
టాపార్డర్ విఫలమైన వేళ, జట్టును తిరిగి గేమ్‌లోకి తీసుకురావడానికి భారత మిడిల్ ఆర్డర్‌కు మంచి అవకాశం వచ్చింది. కానీ, ఒక్కరు కూడా కనీసం హాఫ్ సెంచరీ సాధించలేకపోయారు. అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్ ఇద్దరూ చెరో 46 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్లుగా నిలిచారు.
నమన్ ధీర్ 22 పరుగులు జోడించాడు. అయితే, జట్టుకు ఒక బలమైన స్కోరు అందించడానికి ఈ పరుగులు ఏమాత్రం సరిపోలేదు. చివర్లో భారత్ కేవలం 49 పరుగుల వ్యవధిలోనే తన చివరి ఐదు వికెట్లను కోల్పోయింది.
అనుభవజ్ఞులైన బౌలర్లు లేకపోయినా తడబాటు
న్యూజిలాండ్ బౌలింగ్ విభాగంలో ఇద్దరు అనుభవజ్ఞులైన ఫాస్ట్ బౌలర్లు లేరు. అయినప్పటికీ, కివీస్ బౌలర్ల ముందు భారత బ్యాటర్లు వరుసగా విఫలమవడం జట్టుకు పెద్ద ఆందోళన కలిగించే అంశం. చివరకు ఈ మ్యాచ్ లో భారత్ గెలిచినా మనోళ్ల బ్యాటింగ్ వైఫల్యం మరోసారి బయటపడింది. వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ నకు ముందు భారత్ చాలా తక్కువ వన్డే మ్యాచ్ లు ఆడనుంది. కాబట్టి లో మనోళ్ల బ్యాటింగ్ బలహీనతలను ఇప్పటినుంచే సరిదిద్దుకోవడం మంచిదని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. లేకుంటే రాబోయే ఐసీసీ మెగా టోర్నీ ట్రోఫీ గెలవడం కష్టమే.













