- Home
- Sports
- Cricket
- ఇంకా సెలవు దొరకలే..! నేడో రేపో తుది నిర్ణయం.. కోహ్లికి విశ్రాంతిపై సెలక్షన్ కమిటీ మల్లగుల్లాలు
ఇంకా సెలవు దొరకలే..! నేడో రేపో తుది నిర్ణయం.. కోహ్లికి విశ్రాంతిపై సెలక్షన్ కమిటీ మల్లగుల్లాలు
Virat Kohli: వెస్టిండీస్ పర్యటనలో విరామం కోరుకుంటున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి కి రెస్ట్ ఇవ్వడమా.?? లేదా..? అన్న విషయమై బీసీసీఐ మల్లగుల్లాలు పడుతున్నది.

ఫామ్ లేమితో తంటాలు పడుతున్న విరాట్ కోహ్లిని వెస్టిండీస్ పర్యటనకు దూరం పెట్టాలా..? వద్దా..? అన్న విషయమై బీసీసీఐ మల్లగుల్లాలు పడుతున్నది. తొలుత అతడు ఇంగ్లాండ్ తో టీ20లలో రాణించకుంటే అతడిని విండీస్ సిరీస్ లో కూడా ఎంపిక చేయరని వార్తలు వినిపించాయి.
కానీ అనూహ్యంగా కపిల్ దేవ్, అజయ్ జడేజాతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు కోోహ్లి ఆటతీరుపై విమర్శనాస్త్రాలు సంధిస్తుండటం..ఫామ్ లో లేనివాడికి రెస్ట్ ఎందుకు ఇస్తున్నారు..? జట్టులోంచి తొలగించడం ఉత్తమమని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ విషయమై ఆచి తూచి వ్యవహరిస్తున్నది.
ఇప్పటికే వెస్టిండీస్ టూర్ కు వన్డే జట్టను ప్రకటించింది టీమిండియా. మూడు మ్యాచుల ఈ సిరీస్ లో భారత జట్టు సీనియర్ ఆటగాళ్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ వంటి ఆటగాళ్లందరికీ రెస్ట్ ఇచ్చింది టీమ్ మేనేజ్మెంట్. అయితే వన్డేల తర్వాత జరిగే టీ20 సిరీస్ కు కూడా తనకు రెస్ట్ కావాలని కోహ్లి కోరాడట.
కానీ దీనిపై బీసీసీఐ ఎటూ తేల్చుకోలేకపోతున్నది. టీ20 ప్రపంచకప్ ముందున్న నేపథ్యంలో జట్టు కూర్పు, కాంబినేషన్ల విషయంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్.. ఓ పూర్తి అవగాహనకు వచ్చేందుకు ఈ సిరీస్ కీలకం కానుంది. వన్డే సిరీస్ కు మిస్ అయినా రోహిత్, బుమ్రా, పంత్ లు టీ20 సిరీస్ కు అందుబాటులో ఉంటారని సమాచారం. వీరితో పాటు కోహ్లిని కూడా ఆడించాలని.. ఈ సిరీస్ లో అయినా అతడు ఫామ్ అందుకుంటాడని భావిస్తున్నది.
ఇదే విషయమై సెలక్షన్ కమిటీకి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ... ‘ఒక ఆటగాడు రెస్ట్ అడిగాడంటే దానిని మనం కాదనలేం. మరీ ముఖ్యంగా ఫామ్ కోల్పోయిన ఆటగాడు విరామం కోరినప్పుడు వద్దని అతడిని బలవంతంగా ఆడించడం కూడా మంచిది కాదు. మేము ఒక ఆటగాడు సరిగా ఆడకున్నా నువ్వు ఆడమని బలవంతం చేయము. కోహ్లి రెస్ట్ విషయంలో కూడా ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. దీనిపై కెప్టెన్, హెడ్ కోచ్ తో మాట్లాడినాక తుది నిర్ణయం ప్రకటిస్తాం..’ అని తెలిపాడు.
వెస్టిండీస్ లో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడబోయే జట్టును వచ్చే సోమవారం ప్రకటించే అవకాశముంది. ఆ లోపు రోహిత్ తో పాటు రాహుల్ ద్రావిడ్ లను సంప్రదించి కోహ్లికి రెస్ట్ ఇవ్వడమా.. లేదా..? అనేదానిపై సెలక్టర్లు తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం. కెఎల్ రాహుల్ కూడా గాయం కారణంగా లేకపోవడంతో కోహ్లికి విరామం ఇవ్వకపోవడమే ఉత్తమమనే భావనలో సెలక్టర్లు ఉన్నట్టు తెలుస్తున్నది.