- Home
- Sports
- Cricket
- మాకు ఫాస్ట్ బౌలర్లు కొత్తేం కాదు.. కానీ ఉమ్రాన్ మాలిక్ ను చూస్తుంటే..! సఫారీ కెప్టెన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మాకు ఫాస్ట్ బౌలర్లు కొత్తేం కాదు.. కానీ ఉమ్రాన్ మాలిక్ ను చూస్తుంటే..! సఫారీ కెప్టెన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
IND vs SA T20Is: భారత పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా లో ఫాస్ట్ బౌలర్లకు కొదవలేదు. ప్రస్తుతం ప్రపంచంలో నెంబర్ వన్ బౌలర్లయిన కగిసొ రబాడా, అన్రిచ్ నోర్త్జ్ లు ఆ దేశానికి చెందిన బౌలర్లే.. కానీ..

టీమిండియా పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ ఇంకా అంతర్జాతీయ అరంగేట్రం చేయకుండానే ప్రత్యర్థులు అతడిని చూసి హడలెత్తుతున్నారు. తాజాగా భారత పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా కూడా ఉమ్రాన్ ను టార్గెట్ చేసింది.
ఇదే విషయమై దక్షిణాఫ్రికా సారథి టెంబ బవుమా తాజాగా ఉమ్రాన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికాలో తమకు ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడం కొత్తేమీ కాదని.. కానీ గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే ఉమ్రాన్ వంటి బౌలర్ ను ఎదుర్కోవాలని ఏ బ్యాటర్ కోరుకోడని అంటున్నాడు.
బవుమా స్పందిస్తూ.. ‘దక్షిణాఫ్రికాలో మాకు పేస్ బౌలర్లు కొత్తేం కాదు. పేస్ ను ఎదుర్కుంటూనే మేం పెరిగాం. అయితే ప్రపంచంలో ఏ బ్యాటర్ కూడా తాను గంటకు 150 కిలోమీటర్ల వేగంతో విసిరే (ఉమ్రాన్ ను ఉద్దేశిస్తూ) బంతిని ఎదుర్కోవాలని అనుకోడు. అందుకు మేం సిద్ధంగా ఉండాలి.
మాకు కూడా 150 కి.మీ. వేగంతో బౌలింగ్ చేసే ఆటగాళ్లున్నారు. కానీ ఉమ్రాన్ మాలిక్ చాలా ప్రత్యేకం. అతడిలో ప్రత్యేకమైన టాలెంట్ ఉంది. ఉమ్రాన్ టీమిండియాకు దొరికిన వరం. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ లో అతడి ప్రదర్శనను జాతీయ జట్టు తరఫున కూడా పునరావృతం చేయాలని కోరుకుంటున్నాను..’ అని తెలిపాడు.
జూన్ 9న భారత జట్టుతో తొలి టీ20 మ్యాచ్ ఆడబోతున్నది దక్షిణాఫ్రికా. ఈ క్రమంలో తాము అన్ని విధాలా ఈ సిరీస్ కు సన్నద్ధమయ్యాయమని బవుమా చెప్పాడు. ఉమ్రాన్ తో పాటు ఇతర భారత బౌలర్లను ఎదుర్కోవడానికి తాము తగిన ప్రణాళికలతో వచ్చామని చెప్పుకొచ్చాడు.
ఈ ఏడాది ప్రారంభంలో సఫారీ పర్యటనకు వెళ్లి ఉత్త చేతులతో తిరిగి వచ్చిన భారత్.. అక్కడ ఎదురైన పరాభావాలకు బదులు తీర్చుకోవాలని భావిస్తున్నది. అయితే ఈ సిరీస్ కోసం కీలక ఆటగాళ్లైన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లు అందుబాటులో లేరు. వారి స్థానంలో కొత్తవాళ్లకు అవకాశమిస్తున్నారు.